Begin typing your search above and press return to search.

ఇక అవిశ్వాసం బెడద ఉండదు.. స్థానికంపై సంచలన నిర్ణయం!

ఈ పద్ధతిలో ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తే ఐదేళ్లు పదవుల్లో ఉంటారని, అవిశ్వాసం బెడద తప్పడమే కాకుండా, ప్రజలకు మరింత జవాబుదారీగా వ్యవహరిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.

By:  Tupaki Political Desk   |   6 Aug 2026 10:11 AM IST
ఇక అవిశ్వాసం బెడద ఉండదు.. స్థానికంపై సంచలన నిర్ణయం!
X

స్థానిక సంస్థల ఎన్నికలలో విప్లవాత్మకమార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు పరోక్ష విధానంలో నిర్వహిస్తున్న ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ అంశంపై కూటమిలోని మూడు పార్టీల నేతలతో సీఎం సమాలోచనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అమలులోకి తీసుకువస్తే స్థానిక సంస్థలకు అవిశ్వాసం బెడద తప్పుతుందని సీఎం భావిస్తున్నారని అంటున్నారు. ఏపీలో త్వరలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ దశలో ఎన్నికల సంస్కరణలు చేయాలని ప్రభుత్వం భావించడం హాట్ టాపిక్ అవుతోంది.

స్థానిక సంస్థల్లో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు ఉంటాయి. ప్రస్తుతం పంచాయతీలకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ లను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. అదేవిధంగా వార్డు మెంబర్లను ఎన్నుకుంటారు. ఇదే పద్దతిని మండలాలు, మున్సిపాలిటీలకు తీసుకురావాలి ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం మండలాలు, మున్సిపాలిటీల్లో పరోక్ష విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంపీటీసీలు మండల అధ్యక్షులను, జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లను ఎన్నుకుంటున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చైర్మన్, మేయర్ లను ఎన్నుకుంటన్నారు.

ఈ పరోక్ష విధానం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో రాజకీయంగా సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు ఎలాంటి అధికారాలు, బాధ్యతలు లేకపోవడం వల్ల ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ఎన్నిక తర్వాత ఆయా పదవుల్లో ఉన్న వారు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన సమయంలో అనైతిక వ్యవహారంతో అవిశ్వాసాలు పెడుతున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దీనివల్ల స్థానిక సంస్థల నిర్వహణలోనూ సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని చెబుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు తప్పించేందుకు ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

ఈ పద్ధతిలో ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తే ఐదేళ్లు పదవుల్లో ఉంటారని, అవిశ్వాసం బెడద తప్పడమే కాకుండా, ప్రజలకు మరింత జవాబుదారీగా వ్యవహరిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి 1996కి ముందు ఇదే విధానం అమలులో ఉండేది. అప్పట్లో పంచాయతీ రాజ్ సంస్కరణలు తీసుకురావడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు పుట్టుకొచ్చాయి. దీనివల్ల గ్రామ, మండల స్థాయిలో అదనపు రాజకీయ పదవులు వచ్చినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ పాత విధానం తీసుకువస్తే ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు ఉంటాయా? లేక రద్దు చేస్తారా? అనేది తెలియాల్సివుంది. ఒకవేళ రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయిస్తే గ్రామాల్లో రాజకీయ నిరుద్యోగం ఎక్కువైపోతుందని, నామినేటెడ్ పదవుల కోసం ప్రభుత్వంపై ఎక్కువ ఒత్తిడి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఏదిఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సాహసోపేతమైన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించడం అంటే పార్టీలకు పెద్ద సవాలుగానే చెబుతున్నారు. రిజర్వేషన్లు, కుల, మత, ప్రాంతాల వారీగా సమర్థులైన నాయకులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేషన్ పదవులకు నేరుగా ఎన్నికలు అంటే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకంటే ఎక్కువ ఓటింగ్ జరుగుతుందని చెబుతున్నారు. అలాంటి సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి మించిన నేతలను బరిలోకి దింపాల్సివుంటుందని అంటున్నారు. ఒక్కో జిల్లాకు ప్రస్తుతం సగటున ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏడుగురు ఎమ్మెల్యేలకు అంగీకారమైన నేతను జడ్పీ చైర్మనుగా పోటీకి దింపాల్సివుంటుందని అంటున్నారు. ఈ విధానం ఒక విధంగా పార్టీలు, అధినేతలకు కత్తిమీద సాముగానే వ్యాఖ్యానిస్తున్నారు.