Begin typing your search above and press return to search.

బాబు మాస్టర్ ప్లాన్ : పీ 4 టార్గెట్ కోటిన్నర మంది !

ఇదే క్రమంలో పీ 4 మార్గదర్శులు బంగారు కుటుంబం కాన్సెప్ట్ ని బాబు తీసుకుని వచ్చారు. ఈ రోజుకు ఇది దేశంలో లేని కాన్సెప్ట్.

By:  Tupaki Desk   |   12 April 2025 3:15 AM
బాబు మాస్టర్ ప్లాన్ : పీ 4 టార్గెట్ కోటిన్నర మంది !
X

చంద్రబాబుకు వినూత్నమైన ఆలోచనలు వస్తూంటాయి. ఆయన ఎపుడూ కొత్తగా చేయాలని చూస్తారు. ఆయన విజనరీ అని అంటారు. దాంతో ఆయన తనకు వచ్చిన వాటిని ఆచరణలో పెట్టడానికి తపిస్తూంటారు. అయితే ఆయన ఆలోచనలు ఎపుడూ మంచివే. వాటిని ఆచరణలో సరిగ్గా మెటీరియలైజ్ చేయకపోవడంలో లోపం వల్లనే కొన్ని ఫెయిల్ అయి ఉండవచ్చు అని అంటారు.

బాబు రెండున్నర దశాబ్దాల క్రితం ఇంకుడు గోతులు ప్రతీ అపార్ట్మెంట్, ఇళ్ళ వద్దన తవ్వమని పిలుపు ఇచ్చారు. అప్పట్లో ఇదేంటి అనుకున్నారు. కొందరు చేశారు, ఎక్కువ మంది వదిలేశారు. కానీ ఆ రోజు కనుక పాటించి ఉంటే భూగర్భ జలాలు పెరిగి నీటి కొరత ఉండేది కాదు. సిమెంట్ రోడ్లు, కాంక్రీట్ జంగిల్స్ లో వర్షం నీటిని ఒడిసి పట్టడం అన్న కాన్సెప్ట్ బాబు చాలా ముందుగానే ఆలోచించారు.

అలాగే సొంత ఊరికి న్యాయం చేయమని జన్మభూమిని ప్రవేశపెట్టారు దాని వల్ల చాలా మేలు జరిగింది ఆ తరువాత అందులోకి రాజకీయం ప్రవేశించి ఇబ్బంది అయింది. ఇక టెక్నాలజీ అన్న దానిని బాబు ఒక నినాదంగా అందుకున్నారు అది సూపర్ సక్సెస్ అయింది. ఇపుడు ఆయన ఎక్కువ మంది పిల్లలను కనమని చెబుతున్నారు ఇది కూడా ఒక సంస్కరణ లాంటి స్లోగన్.

ఇదే క్రమంలో పీ 4 మార్గదర్శులు బంగారు కుటుంబం కాన్సెప్ట్ ని బాబు తీసుకుని వచ్చారు. ఈ రోజుకు ఇది దేశంలో లేని కాన్సెప్ట్. ఎక్కడా అమలు కానిది. ఇది కనుక క్లిక్ అయితే ఏపీలో పేదరికం చాలా వరకూ తగ్గుతుంది. సమాజం నుంచి ఎదిగి ఉన్నత స్థానంలోకి చేరుకున్న వారు తిరిగి ఆ సమాజంలోకి పేదలకు న్యాయం చేయడానికి వారిని పైకి తీసుకుని రావడానికి చేసే ప్రయత్నమే పీ 4 జీరో పావర్టీ కార్యక్రమం.

ఈ కార్యక్రమం ఇపుడు బూత్ లెవెల్ దాకా తీసుకుని వెళ్ళేందుకు ఒక సోసైటీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది దీనిని వ్యవస్థీకృతం చేయాలని చూస్తోంది ఏపీలో అధికారికంగా చూస్తే కోటిన్నర మంది దాకా పేద కుటుంబాలు ఉన్నాయి. వారిని బాగు చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది.

వారికి సంక్షేమ పధకాలను అమలు చేస్తోంది. అయితే వారి పేదరికాన్ని అవి పూర్తిగా రూపు మాపలేకపోతున్నాయి. దాంతో తొలి దశగా ఇరవై లక్షల మంది పేదలను అందులో నుంచి బయటపడేసేందుకు బంగారు కుటుంబాలుగా వారిని తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమం చేపట్టింది.

దీనికి ఇపుడు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఏలూరులో బాబు ఈ కార్యక్రమం గురించి చెబితే చాలా మంది దాతలు మార్గదర్శులుగా మారి వితరణ చేయడానికి ముందుకు వచ్చారు. పైగా తాము ఒక గ్రామాన్ని కాదు మరిన్ని గ్రామాలు తీసుకుంటామని ఉత్సాహం చూపించడం విశేషం. దాంతో బాబు ఇచ్చిన పిలుపు బ్రహ్మాండంగా పనిచేస్తోంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ఏపీలో పేదలను తమ వైపు ఉంచుకుని వైసీపీ రాజకీయం చేయాలని చూస్తోంది. ఏపీలో అభివృద్ధి సంక్షేమం రెండింటికీ పవర్ ఫుల్ గా ఓటు షేర్ ఉంది. వైసీపీ పేదలను అండగా ఉంచుకుంది. దాంతో బాబు మాస్టర్ ప్లాన్ తో వారిని తమ వైపునకు తిప్పుకోవడానికి పీ 4 జీరో పావర్టీ అన్న కాన్సెప్ట్ ని తెచ్చారు. ఇది కనుక సక్సెస్ అయితే ఏకంగా వైసీపీ మూల ధనం అయిన ఓటు షేర్ నే చేదిస్తుందని అంటున్నారు. మొత్తానికి అభివృద్ధిని ఒక వైపు చూపిస్తూనే ప్రజా భాగస్వామ్యంతో పేదలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో బాబు ముందుకు సాగుతున్నారని అంటున్నారు. మరి దీనికి పై ఎత్తు వైసీపీ ఏమి వేస్తుందో చూడాల్సి ఉంది.