Begin typing your search above and press return to search.

100 రూపాయ‌ల‌తో హ‌క్కుల బ‌దిలీ: చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. భూముల‌కు సంబంధించిన వార‌స‌త్వ బ‌దిలీ(టైటిల్ ట్రాన్స్‌ఫ‌ర్‌)పై ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న కీల‌కంగా మారింది.

By:  Garuda Media   |   9 Jun 2026 1:53 AM IST
100 రూపాయ‌ల‌తో హ‌క్కుల బ‌దిలీ: చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
X

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. భూముల‌కు సంబంధించిన వార‌స‌త్వ బ‌దిలీ(టైటిల్ ట్రాన్స్‌ఫ‌ర్‌)పై ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న కీల‌కంగా మారింది. వారసత్వ హక్కుల బదిలీని సులభతరం చేశా మ‌న్న చంద్ర‌బాబు... రూ.10 లక్షల లోపు ఆస్తులకు 100 రూపాయ‌ల‌తో బదిలీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. 10 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కంటే ఎక్కువ విలువైన ఆస్తులకు 1000 రూపాయ‌ల‌ స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే చాలని.. ఆమేర‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు.

దీనిని ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన కానుక‌గా చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా సిద్ధాంతంలో ప‌ర్య టించిన ఆయ‌న రైతుల‌కు ప‌ట్టాదారు పాస్ పుస్త‌కాల‌ను పంపిణీ చేశారు. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకువస్తున్నామ‌ని చెప్పారు. రీ-సర్వే 2.0 కింద ఇప్పటికే 1836 గ్రామాల్లో ఫైన‌ల్‌ రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామ‌న్నారు. భూముల అమ్మకం, బహుమతి, విభజన వంటి 9 లక్షల లావాదేవీలకు 100 శాతం ఆటో మ్యుటేషన్ తెచ్చామ‌ని పేర్కొన్నారు.

అన్నీ డిజిట‌లైజేష‌న్‌

1బీ, అడంగల్, డీకేటీ, ఇనాం, సీలింగ్ వంటి పాత రికార్డుల డిజిటలైజేషన్ ప్రారంభించామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. 9(2) నోటీసుల జారీ సమయంలో కూడా ఈ-కేవైసీ అమలు చేస్తున్నామ‌న్నారు. 80 శాతం ఈ-కేవైసీ పూర్తయిన తర్వాతనే గ్రామాలను వెబ్‌ల్యాండ్ 2.0లోకి తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ఈ ప్ర‌క్రియ‌ను కూడా వాట్సాప్ ద్వారా చేస్తున్న‌ట్టు తెలిపారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనామ్ భూములను 22ఏ నుంచి తప్పించామ‌ని.. త‌ద్వారా ల‌క్ష‌ల మందికి ఉప‌శ‌మ‌నం క‌ల్పించామ‌ని తెలిపారు.

కూట‌మి ప‌థ‌కాల జోరు..

కూట‌మి ప్ర‌భుత్వం గ‌త వైసీపీ ప్ర‌భుత్వంకంటే ప‌థ‌కాల‌నుఎక్కువ‌గా ఇస్తోంద‌నిచంద్ర‌బాబు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 46 లక్షల మంది రైతులకు 8,985 కోట్ల రూపాయ‌ల‌ను జమ చేశామ న్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవడానికి కూడా రైతులు ఇబ్బందులు పడ్డారన్న ఆయ‌న‌.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. 24 గంటల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామ‌ని తెలిపారు. గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో పాటు, ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామ‌న్నారు.

ఆక్వా రంగం రాష్ట్రానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమ‌ని సీఎం తెలిపారు. ఆక్వా రంగానికి అన్ని విధాలా అండగా ఉంటామ‌న్నారు.రెండేళ్లుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన నడుస్తోందని, సంక్షేమం- అభివృద్ధి- సుపరిపాల నినాదంతో ముందుకు సాగుతున్నామ‌ని వివ‌రించారు. గ‌త వైసీపీపాల‌కులు రాష్ట్రంపై 10 లక్షల కోట్ల రూపాయ‌ల అప్పులు పెట్టారని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం సహా వేర్వేరు అంశాల కారణంగా ఆక్వా రైతులకు ఇబ్బందులు వస్తున్నాయని, ఆక్వా ఫీడ్ రేట్లు కూడా పెరిగాయన్నారు. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన‌ట్టు చెప్పారు. త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌న్నారు.