కడప గడ్డకూ న్యాయం చేస్తున్నాం: జగన్‌పై చంద్రబాబు కామెంట్లు
వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలోనూ తాము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
By: Garuda Media | 19 Nov 2025 6:54 PM ISTవైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలోనూ తాము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాము రాజకీయ వైషమ్యాలు పెట్టుకుని.. కక్ష సాధింపు రాజకీయాలు చేయడం లేదన్నారు. కడప గడపలో అనేక కార్యక్ర మాలు చేపట్టామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి పులివెందులకు(జగన్ సొంత నియోజకవర్గం) సైతం నీరు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అదేసమయంలో ఇక్కడి ప్రతి ఎకరాకు సాగునీటి రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు.
ఇక, రాజకీయంగా కూడా.. కడప ప్రజలకు చేరువ అయ్యామన్న చంద్రబాబు.. రా కదలిరా.. కార్యక్రమానికి వచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది మహానాడును కూడా కడపలోనే నిర్వహించామనిగుర్తు చేశారు. అదేసమయంలో ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాల హామీలను ఇచ్చామని..వాటిని సూపర్ సిక్స్ చేశామని చంద్రబాబు వివరించారు. దీనికి సంబంధించిన విజయో త్సవ సభను కూడా సీమ గడ్డపైనే నిర్వహించామన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారని.. ముఖ్యంగా సూపర్ సిక్స్‌పై.. విమర్శలు చేసిన వారు ఉన్నారని అన్నారు.
అయితే.. ప్రతి హామీని అమలు చేస్తూ.. ప్రజలకు చేరువగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. దీంతో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. పెట్టుబడిదారులను వేధించార ని.. ఫలితంగా వారు ఏపీని దూరంగా పెట్టారన్నారు. అదేవిదంగా ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ధ్వంసంచేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. అన్నదాతలను కూడా నిలువునా ముంచారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ సరిచేసుకుంటూ.. పాలనలో కొత్త అడుగులు వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
విశాఖ వేదికగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. తద్వారా రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. దీనికి ముందు 10 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకు న్నామన్నారు. ఫలితంగా నిరుద్యోగుల కలలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కడప ప్రజలు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆర్థిక విధ్వంసం చేసిన వారిని ప్రజలు వదిలి పెట్టవద్దని.. పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
