బ్రాండ్ ఇమేజ్ Vs గ్రౌండ్ రియాలిటీ - జగన్ బాటలోనే బాబు.. నష్టం తప్పదా?
ప్రభుత్వం జాతీయ మీడియాకు ప్రకటనలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఆశిస్తుందో కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోవడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
By: Tupaki Political Desk | 25 Feb 2026 6:00 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత. ఏపీకి నాలుగోసారి సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు.. తన 4.0 పాలనలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విధానాలనే అనుసరిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అనేక దుష్పరిణామాలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్న సీఎం చంద్రబాబు మీడియాకు ప్రకటనలు జారీ చేసే విషయంలో మాత్రం జగన్ బాటలోనే నడుస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ తన సొంత పత్రిక సాక్షితోపాటు జాతీయ మీడియాకు ఎక్కువ ప్రకటనలు ఇచ్చేవారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు 4.0 పాలనలో టీడీపీ అనుకూల మీడియాతోపాటు జాతీయ పత్రికలకు సింహాభాగం ప్రకటనలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం లభించడం లేదని, పైగా ఎక్కువగా నష్టపోతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వం జాతీయ మీడియాకు ప్రకటనలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఆశిస్తుందో కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోవడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ఆంగ్ల మీడియాలో ప్రచారం చేసుకుని క్షేత్రస్థాయి ప్రచారానికి దూరమయ్యారని అంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తున్నది అన్న విషయం ప్రజలకు తెలియాలంటే స్థానిక మీడియాలో ఎక్కువ ప్రచారం జరగాల్సివుంటుందని అంటున్నారు. కానీ, గత ప్రభుత్వంలో స్థానిక మీడియాకు బదులుగా జాతీయ మీడియాలో ప్రచారం చేయడానికి ప్రాధాన్యమిచ్చారని, దీనివల్ల జగన్ ప్రవేశపెట్టిన కొన్ని పథకాలకు జాతీయ స్థాయిలో ప్రచారం వచ్చినా, ఓటు వేసే ప్రజలకు అవగాహన లేకుండా పోయిందని అంటున్నారు.
ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వంలో అదే పద్ధతి కొనసాగుతోందని అంటున్నారు. జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ తమ ఇమేజ్ పెంచుకుంటున్నారే తప్ప, ప్రజలలో ప్రభుత్వం రీచ్ పెరుగుతుందా? లేదా? అన్న విషయాలను పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో 90 శాతం మంది ప్రజలు స్థానిక తెలుగు మీడియానే ఫాలో అవుతుంటారు. ప్రభుత్వ పథకాల ప్రచారం చేయాలన్నా, రాజకీయ ప్రయోజనం పొందాలన్నా ప్రభుత్వాలు తెలుగు మీడియా ద్వారా గరిష్టంగా లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. కానీ, ప్రభుత్వాధినేతలుగా చంద్రబాబు, జగన్ వంటి నేతలు మాత్రం ఈ విషయాన్ని విస్మరిస్తున్నారని అంటున్నారు. జాతీయ స్థాయిలో ప్రచారం కోసం పరితపిస్తూ స్థానికంగా తమ ప్రభుత్వ విజయాలను చెప్పుకోలేకపోతున్నారని అంటున్నారు.
స్థానిక మీడియాను సమర్థంగా వాడుకోలేకపోవడం వల్ల ప్రభుత్వాలు నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహనరెడ్డికి ఇది అనుభవ పూర్వకంగా తెలిసిందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యే భాషలోను అందుబాటులో ఉన్న వ్యవస్థ ద్వారా సమాచారం చేరవేయకపోతే ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇది ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీయొచ్చని అంటున్నారు. గతంలో జగన్మోహనరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో స్థానిక మీడియాలో వచ్చే అంశాలను పట్టించుకోకుండా, ఓ ఆంగ్ల పత్రిక నెలనెలా ఇచ్చే సర్వే రిపోర్టులు నమ్మి దెబ్బతిన్నారని గుర్తు చేస్తున్నారు. ఈ అనుభవం నుంచి పాఠం నేర్చుకోవాల్సిన ప్రస్తుత ప్రభుత్వం అలా చేయడం లేదని అంటున్నారు.
తమ బ్రాండ్ ఇమేజ్ కోసం జాతీయ మీడియా వెనుక పడటం వల్ల ప్రజలకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. తల్లికి వందనం, పింఛన్లు, అన్నదాతా సుఖీభవ వంటి పథకాలకు రీచ్ రావాలంటే స్థానిక మీడియాలో ప్రచారం ఎక్కువగా జరగాలని, కానీ ప్రజలకు అర్థం కాని జాతీయ మీడియాలో ప్రకటనలు ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పట్టించుకోని కారణంగానే జగన్మోహనరెడ్డి దెబ్బతిన్నారని, కానీ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు కూడా అదే తప్పు చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కావాల్సింది మేధావుల ప్రశంసలు కాదని, ఆంధ్రా పల్లెల్లో సామాన్యుల నమ్మకం అంటున్నారు. ఇమేజ్ మేనేజ్‌మెంట్ కంటే ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ చాలా ముఖ్యమని గుర్తించాలని చెబుతున్నారు. గత పాలకుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే, చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
