Begin typing your search above and press return to search.

జగన్ బ్యాడ్ అవుతున్నారా... బాబు భయపడుతున్నారా ?

అధికారంలోకి వచ్చిన కొత్తల్లో జగన్ ఖజానాను ఊడ్చేశారు అని విమర్శలతో మొదలెట్టి విద్వంశకారుడిగా చిత్రీకరించారు.

By:  Tupaki Desk   |   3 July 2025 9:30 AM IST
జగన్ బ్యాడ్ అవుతున్నారా... బాబు భయపడుతున్నారా ?
X

గత ఏడాదిగా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ పేరు తలవకుండా ఏ వేదిక మీదా మాట్లాడింది లేదు నిండు అసెంబ్లీ అయినా పార్టీ మీటింగ్ అయినా లేదా కూటమి సమావేశం అయినా మీడియా మీట్ అయినా లేక అధికారులతో సమావేశం అయినా పెట్టుబడిదారులతో కానీ కలెక్టర్ల సదస్సులో కానీ ఎక్కడ మైకు దొరికినా కూడా బాబు తన గురించి తన పాలన గురించి గొప్పగా చెప్పుకుంటూనే అదే నోటితో జగన్ మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన కొత్తల్లో జగన్ ఖజానాను ఊడ్చేశారు అని విమర్శలతో మొదలెట్టి విద్వంశకారుడిగా చిత్రీకరించారు. ఏపీ మొత్తం సర్వ నాశనం అయింది అన్నారు. ఏపీ చేయలేకపోతున్నామని హామీలు చాలా ఉన్నాయి కానీ భయమేస్తోంది అన్నారు. ఇలా జగన్ విషయంలో మొదట్లో చేసిన ఆరోపణలు చూసిన వారు నిజమే కదా అపుడే అధికారంలోకి వచ్చిన సర్కార్ కి కాలూ చేయీ ఆడనీయకుండా వైసీపీ చేసి వెళ్ళిపోయింది అని కూడా అనుకున్నారు.

అయితే రాను రానూ జగన్ నే ఫోకస్ చేస్తూ చంద్రబాబు ప్రతీ చోటా మాట్లాడుతూంటే అది కాస్తా మెల్లగా కొత్త ఆలోచనలకు దారి తీస్తోంది. పెట్టుబడిదారుల సమావేశంలో ఎవరు అడిగారో తెలియదు కానీ జగన్ అనే భూతాన్ని బంధిస్తున్నాను భయపడవద్దు అని బాబు చెప్పడమూ కూడా అలవాటుగా మారిపోయింది. అమరావతి రాజధానిని ఎవరూ మార్చకుండా చూస్తున్నాను, మళ్ళీ జగన్ రారు అన్న భరోసా నాది అని చెబుతూనే ఆయన ప్రస్తావన తీసుకుని రావడంతోనే జనాలకు వేరే ఆలోచనలు వచ్చేలా చేశారు అంటున్నారు.

అవునా కొంపదీసి జగన్ మళ్ళీ వస్తారా అన్న చర్చకు కారణం చంద్రబాబు అతిగా జగన్ మీద ఫోకస్ పెట్టడమే అని అంటున్నారు. శుభ్రంగా పార్టీ మీటింగ్ పెట్టుకుని తమ గురించి తమ పార్టీ గురించి ఎక్కువగా చెప్పుకోకుండా రాజకీయ ప్రత్యర్ధికీ అందులో ఎక్కువ స్పేస్ ఇవ్వడం అంటే రాజకీయంగా సరైన వ్యూహం కాదేమో అన్న మాట కూడా ఉంది.

ఇంకో వైపు చూస్తే కనుక ప్రభుత్వ కార్యక్రమాలలో అధికార కార్యక్రమాలలో సైతం లేని జగన్ ప్రస్తావన ఎందుకు అంటే ఏమో తెలియదు కానీ అదే ఒరవడి సాగుతోంది. ఇక్కడ జగన్ ని ఆయన రాజకీయాలను చెడ్డ చేస్తున్నామని జనాల్లో ఆయన మీద ఆగ్రహం కలిగేలా చేస్తున్నామని టీడీపీ పెద్దలు అనుకోవచ్చు. కానీ ఇది రాజకీయ శాస్త్రం. ఇక్కడ లెక్కలు వేరుగా ఉంటాయి.

పదే పదే ఒకరి గురించి తలచినా వారినే ఎక్కువగా టార్గెట్ చేసినా వారికి మరింత ఫోకస్ పెరుగుతుంది. అది కాస్తా నెమ్మదిగా వారికే అనుకూలం అవుతుంది అన్నది అయితే ఉంది. మొత్తానికి చూస్తే చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇలాంటివి చాలనే చేసారు, చూశారు. కానీ కాలం మారింది ఇది సోషల్ మీడియా యుగం. మీడియాలో ఏదో విధంగా ప్రత్యర్ధులను మారు మోగించేలా చేయడం వల్ల లాభమేపాటి అన్నది వారే తేల్చుకోవాలని అంటున్నారు.