లక్ష కోట్ల విలువైన భూములపై చంద్రబాబు కన్ను.. సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
By: Tupaki Political Desk | 29 Sept 2025 9:00 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూముల ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని భావిస్తోంది. దాదాపు లక్ష కోట్ల విలువైన 1,82,270 ఎకరాల భూములను గత 13 ఏళ్లలో ప్రభుత్వం కేటాయించింది. వివిధ అవసరాల పేరు చెప్పి భూములను తీసుకున్నవారు సరైన రీతిలో వినియోగిస్తున్నారా? లేక నిరుపయోగంగా వదిలేశారా? అనేది పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిశీలన తర్వాత నిరుపయోగంగా ఉంచేసిన భూములను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలకు ఎక్కువ నిధులు అవసరం అవుతుండటం, అందుకు తగ్గట్లుగా రాష్ట్ర ఆదాయం లేకపోవడంతో సంపద పెంచుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిస్తుననారు. ఇందుకోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పారిశ్రామిక పురోగతి కోసం అని పలు పాలసీలను రూపొందించారు. ఇందులో ఇండస్ట్రియల్ పాలసీతోపాటు విద్యుత్ పాలసీ కూడా ప్రధానం. ఈ రెండింటి వల్ల రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఇక గత 16 నెలలుగా పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పనిచేయడంతో దాదాపు రూ.10 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు, ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి సంస్థల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది.
అయితే, ఈ ప్రాజెక్టులు గ్రౌండింగ్ కావాలంటే భూమి కేటాయించాల్సివుంది. ప్రస్తుతం భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ప్రభుత్వ భూమి తగినంతగా అందుబాటులో లేకపోవడం వల్ల కొత్త పరిశ్రమలకు భూముల కేటాయింపు సవాల్ గా మారుతోంది. అదే సమయంలో ఐటీ పరిశ్రమలకు విశాఖలో ఖరీదైన భూములు కారుచౌకగా ప్రభుత్వం అప్పగిస్తోందని విపక్షం రచ్చ చేస్తోంది. దీంతో పరిశ్రమలకు భూముల కేటాయింపుపై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. గతంలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపుల విధానం - 2012 ప్రకారం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ప్రస్తుతం 26 జిల్లాల్లో కేటాయించిన భూములు, పారిశ్రామిక పార్కుల్లో ఖాళీ స్థలాలను పునఃపరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో భూ కేటాయింపుల విధానం ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు 13 ఏళ్లలో విభజిత రాష్ట్రంలో 1,82,270 ఎకరాలను వివిధ రంగాలకు కేటాయించారు. ఇందులో పరిశ్రమల ఏర్పాటుతోపాటు కాలేజీలు, యూనివర్సిటీలు, ఆస్పత్రులు ఇలా ప్రజలకు అవసరమైన సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయించారు. గత ప్రభుత్వంలో కూడా వేల ఎకరాలను చౌకగా కేటాయించారని విమర్శలు ఉన్నాయి. అయితే పునఃపరిశీలన పేరుతో ఆ భూములను వెనక్కి తీసుకుంటే వివాదం తలెత్తే అవకాశం ఉందన్న ఆలోచనతో 2012 నుంచి పంపిణీ చేసిన భూములను పరిశీలించాలని నిర్ణయించారు. దీనివల్ల 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూములు కూడా మళ్లీ పరిశీలించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ పరిశీలనలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థల వద్ద ఉన్న మొత్తం ప్రభుత్వ భూమి ఎంత? వాటి విలువ ఎంత? భూ కేటాయింపుల ప్రయోజనం నెరవేరిందా? లేదా? ఆ భూముల వల్ల ప్రజలు, ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం దక్కిందా? దుర్వినియోగమవుతున్నాయా? అన్న విషయాలను ఆరా తీయనున్నారు. ఈ పరిశీలన తర్వాత అవసరమైతే ఆయా భూములను వెనక్కి తీసుకునే అవకాశం ఉందన్న జరుగుతున్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి లక్ష కోట్లమేర ప్రయోజనం దక్కనుందని, అదేవిధంగా కొత్త పరిశ్రమలకు భూములను సులువుగా సమకూర్చవచ్చని అంటున్నారు.
గడిచిన 13 ఏళ్లలో ఏపీఐఐసీ, నెడ్ క్యాప్ ద్వారా ఎక్కువ భూములు కేటాయించినట్లు చెబుతున్నారు. మొత్తం 1,82,270 ఎకరాల భూములు కేటాయించగా, ఇందులో ఏపీఐఐసీ ద్వారా 64,788 ఎకరాలు, సోలార్, విండ్, ఇతర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు 42,084 ఎకరాలు కేటాయించారు. ఇవి కాకుండా ప్రైవేటు సంస్థలకు 28,893 ఎకరాలు సమకూర్చారు. వీటితోపాటు రైల్వే, ఇతర కేంద్రప్రభుత్వ సంస్థలకు మరికొంత భూమి కేటాయించారు. అయితే విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి, ఏలూరు ఇలా రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి కొన్ని సంస్థలు భూములు తీసుకున్నాయి. వాటిపై బ్యాంకు రుణాలు తీసుకుని ఇంతవరకు పరిశ్రమలు స్థాపించకుండా ఖాళీగా వదిలేశాయి. దీంతో ఆయా స్థలాలను వెనక్కి తీసుకుని, ఇతర సంస్థలకు కేటాయించే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనివల్ల ఖాళీగా ఉన్న భూములను వినియోగంలేకి తేవడంతోపాటు విపక్షం విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
