'హెరిటేజ్'పై ఫ్యాక్షన్ పాలిటిక్స్.. అసెంబ్లీలో సీఎం ఘాటు స్పందన
‘‘హెరిటేజ్ తన ఫ్యామిలీ బిజినెస్. లైవ్ లీ హుడ్ కింద వ్యాపారం చేస్తున్నారు. బ్రాండ్ దెబ్బతీసేలా ఆ పత్రిక (సాక్షి)లో అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నారు.
By: Tupaki Political Desk | 13 Feb 2026 4:05 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ డెయిరీపై విపక్షం వైసీపీ చేస్తున్న విమర్శలను అసెంబ్లీ వేదికగా సీఎం తిప్పికొట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న పరిణామాలతోపాటు ప్రస్తుత ప్రభుత్వంలో చేపడుతున్న అంశాలను సీఎం సుదీర్ఘంగా వివరించారు. ఈ సమయంలో కల్తీ మద్యం, ఇసుక కుంభకోణం, తిరుమల లడ్డూ కల్తీపై సీఎం మరోసారి ఫైర్ అయ్యారు. ఆయా అంశాలపై తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రధానంగా తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీపై వైసీపీ గత కొన్ని రోజులుగా చేస్తున్న విమర్శలపై సీఎం ఎదురుదాడి చేశారు.
ఫ్యాక్షన్ పాలిటిక్స్ లో భాగంగా హెరిటేజ్ డెయిరీపై ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిందే కాకుండా ఆ వివాదంలోకి హెరిటేజ్ సంస్థను తీసుకు వస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య జరిగినప్పుడు కూడా ఇలాంటి నాటకాలు ఆడారని గుర్తు చేశారు. సాక్షిపత్రికలో నారాసుర రక్త చరిత్ర అని రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ళ్లు చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి ఇతరులపై నెట్టేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని సీఎం వివరించారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ సంస్థకు ముడిపెట్టి తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
‘‘హెరిటేజ్ తన ఫ్యామిలీ బిజినెస్. లైవ్ లీ హుడ్ కింద వ్యాపారం చేస్తున్నారు. బ్రాండ్ దెబ్బతీసేలా ఆ పత్రిక (సాక్షి)లో అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నారు. గతంలో రాయలసీమ ఫ్యాక్షన్లో భాగంగా కక్ష తీర్చుకునేందుకు చీనీ చెట్లను నరికి వేసేవారు. ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడం ఫ్యాక్షనిస్టులకు అలవాటు. ఇప్పుడు ఇలాంటి వ్యవహారాన్నే వారు నడిపిస్తున్నారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు పరోక్షంగా వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.
ఇక తిరుమలతోపాటు దేవాలయాల రక్షణపై తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు వివరించారు. తిరుపతి లడ్డూ వ్యవహారం చాలా సున్నితమైన అంశమని, కొందరు కావాలని దేవుడి పవిత్రతను, భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని ప్రయత్నించారని సీఎం వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఒక్కసారైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీ, జరిగిన తప్పులను చెప్పకుండా ఉంటే ఆ అపవిత్రతను కొనసాగించేందుకు వాళ్లు ఏమాత్రం వెనుకాడరు. టీటీడీ సహా అన్ని దేవాలయాల్లో పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని సీఎం వెల్లడించారు.
అదేవిధంగా గత ప్రభుత్వంలో భూ రికార్డులను అస్తవ్యస్తం చేశారని సీఎం ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువ అందినట్లు చెప్పారు. అడిగిన భూములు ఇవ్వకపోతే వాటిని 22ఏలో పెట్టేవారని ఆరోపించారు. చట్టాలు చేయాల్సిన వారే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? అంటూ మాజీ సీఎం జగన్ హయాంలో చోటుచేసుకున్న హెలిపాడ్ భూ సేకరణ అంశాన్ని అసెంబ్లీలో సీఎం ప్రస్తావించారు. తాడేపల్లిలో మాజీ సీఎం నివాసానికి సమీపంలో హెలిప్యాడ్ కోసం భూమి అడిగారని, ఆ భూమి ఇవ్వలేదని బలవంతంగా 22ఏ కింద నిషేధ జాబితాలో చేర్చారని చంద్రబాబు ఆరోపించారు. అదేవిధంగా మద్యం కల్తీపైన సీఎం మాట్లాడారు. నకిలీ మద్యం విక్రయాలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
