Begin typing your search above and press return to search.

వారికి గాలి పీల్చే హక్కు లేదు...బాబు సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలిని పీల్చేందుకు కూడా ఒక అర్హత ఉంటుందని బాబు చెప్పడం విశేషం.

By:  Tupaki Desk   |   5 Jun 2025 7:12 PM IST
వారికి గాలి పీల్చే హక్కు లేదు...బాబు సంచలన వ్యాఖ్యలు
X

ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలిని పీల్చేందుకు కూడా ఒక అర్హత ఉంటుందని బాబు చెప్పడం విశేషం. ఎవరైతే తమ జీవిత కాలంలో మొక్కలను పెంచని వారికి అసలు గాలిని పీల్చే హక్కే లేదని బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మొక్కలను పెంచడం వల్ల పర్యావరణం సమతూల్యత సాధ్యమవుతుంది. అంతే కాదు ఆక్సిజన్ అక్కడ నుంచే పుడుతుంది. ఆక్సిజన్ ప్రాణవాయువుగా మానవాళికి ఉంది అన్నది తెలిసిందే.

అందుకే బాబు ఈ తరహా కామెంట్స్ చేశారు అని అంటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు అమరావతి రాజధాని పరిధి అనంతవరం ఏడీసీఎల్‌ పార్కులో వన మనోహత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలను నాటారు. అంతే కాదు ఆయన మొక్కల పెంపకం గురించి వాటి ఆవశ్యకత గురించి సమాజానికి గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు.

మొక్కలను పెంచని వారు చెట్లను నరుకుతున్నారని కూడా బాబు మండిపడ్డారు. అలాంటి వారిని కొన్ని దేశాలలో అయితే జైలుకు పంపించి కఠినమైన శిక్షలు అమలు చేస్తారు అని బాబు చెప్పారు. మనిషిని చంపితే ఎంత పాపమో ఎంత నేరమో చెట్లను నరికితే అంతే నేరమని బాబు అన్నారు. అది ఇతర దేశాల చట్టాలలో ఉందని అన్నారు.

ఇక వైసీపీ ప్రభుత్వం మీద పరోక్ష విమర్శలను ఆయన చేశారు. గత ప్రభుత్వానికి మొక్కలు నాటడం అన్నది తెలియదు కానీ చెట్లను నరకడం బాగా వచ్చు అని ఎద్దేవా చేశారు. ఏపీలో రానున్న నాలుగేళ్ళ కాలంలో పర్యావరణాన్ని మరింతగా పెంచుతామని అన్నారు. అలాగే రాష్ట్రంలో 37 శాతం గ్రీన్ కవర్ రావాల్సి ఉందన్నారు. ఆ లక్ష్యాన్ని సైతం చేరుకుంటామని బాబు స్పష్టం చేశారు.

కేవలం కోస్తాంధ్రా ప్రాంతమే కాకుండా రాయలసీమలో హార్టీకల్చర్ ని అభివృద్ధి చేస్తామని బాబు చెప్పారు. ఈ సందర్భంగా మొక్కలు ఏపీలో పెంచే కార్యక్రమం గురించి బాబు వివరించారు. రానున్న కాలంలో రాఖీలు కట్టే చెల్లెమ్మలు ఇకపై వారి అన్న నక్షత్రం పేరుకు తగ్గట్టుగా విత్తనాలు ఇస్తామని బాబు ఒక వినూత్న కార్యక్రమం ప్రకటినారు.

ఈ ఏడాదిలోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చూడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇక చెల్లెళ్ళు తమ అన్న నక్షత్రం చూసుకుని రాఖీ కడితే వారి నక్షత్రాలకు తగినట్లుగా విత్తనాలు ఇస్తామని అవి పెరిగి పెద్దవి అయి మహా వృక్షాలు అవుతాయని బాబు అన్నారు. ఇది మంచి ఆలోచనగా ఉంటుందని పేర్కొన్నారు.

అంతే కాదు ఈ రోజులలో మొక్కల పెంపకం బాగా తగ్గిపోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో రూఫ్ టాప్ గార్డెన్ లేదా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. చేపలు, చికెన్, ఇళ్లలో నుంచి వచ్చే వేస్ట్తో రీసైక్లింగ్కు ఉపయోగిస్తామని ఆయన అన్నారు. అంతే కాకుండా నల్లమల అడవుల్లో విలువైన మూలికలు ఉన్నాయని చంద్రబాబు చెప్పరు. ఇక మీదట ఎర్రచందనంతో పాటు నల్లమల అడవులలో ఉన్న వనమూలికలనూ కాపాడుకోవాలని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

ఏపీలో వచ్చే ఏడాది నాటికి పూర్తిగా ప్లాస్టిక్ నిషేధిస్తామని చంద్రబాబు కీలకమైన ప్రకటన చేశారు. అంతే కాకుండా మొత్తం 175 నియోజకవర్గాలలో నగర వనాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పర్యావరణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన మరోసారి ఏపీ ప్రజలకు స్పష్టం చేశారు.

మొత్తానికి అంతర్జాతీయ పర్యావరణం దినోత్సవం వేళ చంద్రబాబు స్పూర్తివంతమైన ప్రసంగం చేయడంతో పాటు భవిష్యత్తు కార్యచరణను ప్రకటించారు. ఇది అందరికీ ఆదర్శనీయంగా ఉండడమే కాదు, మొక్కలు పెంచడం మీద ప్రతీ ఒక్కరికీ ఒక ఆలోచన శ్రద్ధ కలిగేలా ఉంటుందని అంటున్నారు. ఏపీ అద్భుతమైన పర్యావరణ రాష్ట్రంగా ఉండాలన్నదే కూటమి లక్షయమని బాబు చెప్పడం మంచి పరిణామంగా అంతా చూస్తున్నారు.