బాబు ఆశావాది...జగన్ కి తెలియనిది అదే !
ఏపీ రాజకీయాల్లో గత పదిహేనేళ్ళుగా చంద్రబాబు జగన్ ల మధ్య రాజకీయ వైరం పెద్ద ఎత్తున సాగుతోంది.
By: Satya P | 3 April 2026 12:48 AM ISTఏపీ రాజకీయాల్లో గత పదిహేనేళ్ళుగా చంద్రబాబు జగన్ ల మధ్య రాజకీయ వైరం పెద్ద ఎత్తున సాగుతోంది. నిజం చెప్పాలంటే చంద్రబాబు వైఎస్సార్ సమకాలీనుడు. కానీ వైఎస్సార్ బాబు ఇద్దరూ ముఖా ముఖీ తలపడింది. అతి కొద్ది సంవత్సరాలే కావడం విశేషం. 1998లో వైఎస్సార్ పీసీసీ చీఫ్ అయ్యారు. అప్పటి నుంచి బాబు వర్సెస్ వైఎస్సార్ గా సాగిన ఉమ్మడి ఏపీ పాలిటిక్స్ చివరికి 2009లో వైఎస్సార్ మరణంతో ఫుల్ స్టాప్ పడింది. అయితే 2010 నుంచి జగన్ చంద్రబాబుల మధ్య సరికొత్త రాజకీయ యుద్ధం మొదలైంది. అది నేటికీ కొనసాగుతూ వస్తోంది. ఆ విధంగా చూస్తే బాబు ఎక్కువగా జగన్ తోనే రాజకీయం చేయాల్సి వస్తోంది అనుకోవాలి.
పాలకుడు ఎలా ఉండాలంటే :
పాలకుడు అంటే కోట్లాది మంది ప్రజలకు పెద్ద. ఒక విధంగా అతి పెద్ద కుటుంబానికి యజమాని అన్న మాట. ఒక కుటుంబంలో తండ్రి సంపాదన మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎన్నో కోరికలు కోరుతారు. తండ్రి వారిని చేరదీసి అన్నీ చేస్తాను అని చెబుతారు. ఆశావహంగా వాతావరణం ఇంట్లో ఉండేలా చూస్తారు. అంతే తప్ప ఇది నేను చేయలేను అని తెగేసి చెప్పడు. పాలకులు కూడా అచ్చం అలాగే ఉండాలి. ప్రజలలో వివిధ వర్గాల వారు ఉంటారు, వారు అంతా పాలకులనే నమ్ముకుంటారు. అలాంటపుడు నాయకుడు వాటిని సాకారం చేయడానికే చూడాలి. ఆ విషయంలో చూస్తే చంద్రబాబుకు కొండంత ఆశావాదం ఉంది. జగన్ లో అదే కరవు అయింది అని విశ్లేషణలు ఉన్నాయి.
ఏడున్నర పదుల వయసు :
చంద్రబాబు వయసు ఏడున్నర పదులు. ఆయన ఎర్లీ సెవెంటీస్ నుంచి పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. నిజానికి బాబులో ఎక్కువ చాదస్తం ఉండాలి. కానీ ఆయన అప్టూ డేట్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల మనోభావాలకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే బాబుని జెన్ జెడ్ కూడా గమనించి మద్దతు ఇస్తోంది. ఇక ఏపీ రాజధాని విషయం తీసుకుంటే బాబు ఏపీ ఆర్ధిక పరిస్థితులను ఆలోచించలేదు, తన వయసుని అంతకంటే పట్టించుకోలేదు. ఏపీకి ఒక బ్రహ్మాండమైన రాజధాని కావాలని అనుకుని పూనుకున్నారు.
ఒక మాదిరి రాజధాని చాలు :
నిజంగా ఇది హర్షించదగిన పరిణామమే. 2014లోనే బాబు ఏపీకి ఒక మాదిరి రాజధాని చాలు అనుకుంటే 2019లో ఆయనే మరోసారి విజయం సాధించేవారు అని చెబుతారు. కానీ తాను తలపెట్టేది ఈ తరానికి కాదు ఈ రోజున అయిదు కోట్లు ఉన్న ఏపీ ప్రజలు రేపటి రోజున పది కోట్లు అవుతారు అందరికీ రాజధాని అని ఆయన అమరావతి పేరుతో ఏకంగా ఒక మహా నగరం నిర్మాణానికే సిద్ధపడ్డారు. ఆ విషయంలో బాబు ఆశావాదాన్ని ఆయన కొండంత సంకల్పాన్ని ప్రశంసించాల్సిందే.
పెద్ద ఆలోచనే మరి :
బాబు పెద్ద ఆలోచనే చేశారు. అది ఏపీ శక్తికి మించి చేశారు. సంకల్పం ఉంటే సాకారం కష్ట సాధ్యం కాదన్నది ఆయన ఆలోచన. అందుకే అమరావతి విషయంలో బాబు ఎక్కడా తగ్గడం లేదు, ఆయన ధైర్యం పట్టుదల చూసే ఏపీలో అయిదు కోట్ల మంది అమరావతి పూర్తి అవుతుందని నమ్మకంతో ఉన్నారు. బాబు సైతం అమరావతి విషయంలో కేవలం ఆలోచనలే కాదు ఆచరణలో ఏమి చేయాలో కూడా తీవ్రంగానే మధనం చేస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పాలి. అమరావతి అన్నది ఒక కొలిక్కి వచ్చేలా బాబు తాపత్రయపడుతున్నారు. ఒక్కసారి కనుక అమరావతికి రూపు రేఖలు వస్తే ఇక దాని వృద్ధి ఎవరూ ఊహించలేరని అంటున్నారు. ప్రస్తుతానికి బాబు మదగజాన్ని దారికి తెచ్చే మావటీడు పడే పరిశ్రమను అంతా పడుతున్నారు అనుకోవాలి. నిజానికి పాలకుడికి ఉండాల్సిన ఆశావహ దృక్పధం అయితే బాబుకు ఉంది. అందుకే ఆయన వైపు జనాలు నిలబడ్డారు అని అనుకోవాల్సి ఉంది.
కాళ్ళు ముడుచుకుంటే :
ఇక జగన్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం ఏపీ వాతావరణాన్ని ఆర్థిక పరిస్థితిని చూసి మాట్లాడుతున్నారు. అంత పెద్ద రాజధాని నిర్మాణం అన్నది జరగదు అన్నది జగన్ నిశ్చితాభిప్రాయం గా ఉంది. అందుకే ఆయన అయిదేళ్ల పాలనలో ఆ వైపు పెద్దగా చూడలేదని అంటారు. అయితే జగన్ వయసు రీత్యా చూస్తే మరో ముప్పయ్యేళ్ళ పాటు రాజకీయం చేయగలరు. నిజానికి జగన్ లాంటి వారు ఇలాంటి దీర్ఘ కాల ప్రాజెక్టులను తలకెత్తుకోవాలి. కానీ ఆయన ఎందుకో ఉన్న దాంట్లో సర్దుకోవాలని చెబుతున్నారు. పాలకుడిగా జగన్ ఆశావహం కంటే యధార్ధ వాదానికే పెద్ద పీట వేస్తున్నారు. కానీ ఒక కుటుంబం అయినా రాష్ట్రం అయినా ఎదగాలీ అంటే భారీ స్కేల్ నే ముందుకు పెట్టుకోవాలి. పెద్ద లక్ష్యాలనే చేసుకుని సాగాలి. కానీ జగన్ ఆలోచనలు అయితే పాత తరం దగ్గరే ఆగిపోతున్నాయా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి చూస్తే బాబు ఆశావహ దృక్పధమే ఇపుడు జగన్ మార్క్ వాదాన్ని ఓడిస్తోంది. ఇది కేవలం బాబు జగన్ లకే కాదు, ఎక్కడైనా పాలకుడు సానుకూల దృక్పధం తోనే ఉండాలి. అపుడే అభివృద్ధి సాధ్యపడుతుంది. మరి ఈ విషయం బాబుకు తెలిసినంతగా జగన్ కి తెలియకపోవడం వల్లనే రాజధాని విషయంలో ఇన్ని విమర్శలు ఆ పార్టీ ఎదుర్కొంటోంది అని అంటున్నారు.
