జగన్ పాలనలో అలానే జరిగింది: బాబు తెలుసుకోవాలి!
అయినప్పటికీ.. జగన్ సహించలేక పోయారన్న వాదనను చంద్రబాబు అప్పట్లో వినిపించారు.
By: Garuda Media | 30 Sept 2026 7:00 AM ISTఅది ఏపీ అయినా.. తెలంగాణ అయినా.. చివరకు కేంద్రమైనా.. ప్రభుత్వాలపై విమర్శలు, నిందలు కామన్. ఏపీ మంత్రి డోలా బాల వీరాంజ నేయ స్వామి అన్నట్టుగా ఎంత చేసినా ప్రభుత్వంపై నిందలు పడుతూనే ఉంటాయి. ఎందుకంటే.. విశాల పాలనలో అందరినీ సంతృప్తి పరచడం కూడా ప్రభుత్వాలకు సాధ్యం కాదు. దీంతో కొన్ని కొన్ని వర్గాలు ప్రభుత్వాలపై విమర్శలు చేస్తాయి. నిరసనలు కూడా వ్యక్తం చేస్తాయి. అయితే.. గతంలో వైసీపీ హయాంలో విమర్శించేవారిపైనా.. ప్రశ్నించే వారిపైనా ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా ఉద్యోగులను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. నిజానికి వారికి రావాల్సిన బకాయిలు.. ఇతర భత్యాలపైనే ఉద్యోగులు డిమాండ్ చేశారు.
అయినప్పటికీ.. జగన్ సహించలేక పోయారన్న వాదనను చంద్రబాబు అప్పట్లో వినిపించారు. ఉద్యోగుల పక్షాన, ఉపాధ్యాయ వర్గాల పక్షాన నిలిచారు. దీంతో అదేఉద్యోగులు చంద్రబాబును కూటమిని కూడా బలపరిచారనడంలో సందేహం లేదు. అయితే.. ఇప్పుడు కూటమి సర్కారు కూడా అదే పంథాలో నడుస్తుండడం.. ఉద్యోగులపై ఉక్కుపాదం మోపేలా కేసులు పెట్టడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. `జగన్‌కు మీకు తేడా ఉంది బాబు గారు.. ` అంటూ కొందరు సునిశితంగానే హెచ్చరిస్తున్నారు. మరికొందరు.. బాబు ఇలా చేయడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు.
అసలు ఏం జరిగింది?
ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.(సెక్రటరీలు) పెద్ద ఎత్తున కదం తొక్కారు విజయవాడ వేదికగా ఉద్యమించారు. తమకు ప్రమోషన్లు కల్పించాలని.. సెలవులు ఇవ్వాలని, పీఆర్సీ అమలు చేయాలని.. ఇలా వారికున్న డిమాండ్ల చిట్టాను ప్రభుత్వం ముందు పెట్టారు. కానీ, సరైన చర్చలు జరగలేదు. దీంతో వారు విజయవాడలో ధర్నా నిర్వహించారు. దీనిని అడ్డుకునేందుకుపోలీసులు భారీ ప్రయత్నం చేయడం.. ఈ క్రమంలో లాఠీ చార్జీలు, అరెస్టులు, అడ్డుకోవడాలు.. జరిగాయి. అయినా.. ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. ఇక, ఈ క్రమంలోనే ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు.
తర్వాత ఏంటంటే..
ఇక, ఇప్పుడు సర్కారుపై ఎందుకు విమర్శలు వస్తున్నాయంటే.. బీఎన్ ఎస్ సెక్షన్ 170 ని ప్రయోగించారు. దీని కింద.. దాదాపు వందల మంది ఉద్యోగులపై కేసులు పెట్టినట్టు ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సెక్షన్ ఏంటంటే.. ఎవరినైనా ఎలాంటి కారణం చూపించకుండానే అరెస్టు చేసేయొచ్చు. అదేసమయంలో ఎలాంటి నోటీసులు కూడా వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒకరకంగా నిర్బంధ సెక్షన్. దీనిని చిరు ఉద్యోగులుగా పేర్కొంటున్న సచివాలయ ఉద్యోగులపై పోలీసులు ప్రయోగించడాన్ని ఇప్పటికే 45 మందిపై కేసులు నమోదు చేయడాన్ని పార్టీలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు. విమర్శిస్తున్నారు. జగన్ ఇలా చేసే కదా.. వ్యతిరేకతను తెచ్చుకున్నారు.. అంటూ చంద్రబాబుకు విన్నవిస్తున్నారు. ఇలాంటి దూకుడు మంచిది కాదని.. తప్పు చేసిన వారిని న్యాయపరంగా చట్ట పరంగా శిక్షించాలని .. కానీ ఇలా నిర్బంధ సెక్షన్లు విధించరాదని కోరుతున్నారు.
