సుపరిపాలనలో తొలి అడుగు.. 'సగమే!'
'సుపరిపాలనలో తొలి అడుగు' పేరుతో సీఎం చంద్రబాబు ఏపీలో బుధవారం(జూలై 2) నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
By: Tupaki Desk | 2 July 2025 8:00 PM IST'సుపరిపాలనలో తొలి అడుగు' పేరుతో సీఎం చంద్రబాబు ఏపీలో బుధవారం(జూలై 2) నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా.. ప్రజలను కలుసుకుని ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన మంచిని వారికి వివరించాలన్నది టార్గెట్. అంతేకాదు.. సంక్షేమం, పథకాలు, సూపర్ 6తో పాటు.. ఏడాది లో తీసుకువచ్చిన పెట్టుబడులు.. త్వరలోనే రానున్న ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కూడా ప్రజలకు వివరించాలన్నది చంద్రబాబు ఉద్దేశం.
ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. చేసింది చెప్పుకోలేక పోతే.. వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు ఎటైనా తిరిగే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించారు. కాబట్టి.. ప్రజలకు ఏడాది కాలంలో చేసిన మంచిని వివరించే ప్రయత్నం చేయాలని బాబు సూచించారు. దీనికి గాను సుపరిపాలన లో తొలి అడుగు పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కట్ చేస్తే.. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎంత మేరకు సక్సెస్ అయిందనేది చూస్తే.. రాష్ట్రంలో సగం నియోజకవర్గాల్లో కూడా. ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదు. మొత్తంగా 135 నియోజకవ ర్గాల్లో టీడీపీ విజయం దక్కించుకుంది. వీటిలో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రధానంగా పర్యటించి.. ప్రజలకు వివరించాలి. కానీ, తొలి రోజు సగం నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమం ప్రారంభం కాలేదన్నది పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
అయితే.. కొందరు దీనికి కారణాలు చెబుతున్నారు. పింఛన్ల పంపిణీ ఇంకా పూర్తికాలేదని.. అందుకే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించలేదని చెప్పుకొచ్చారు. మిగిలిన చోట్ల మాత్రం కొంత మేరకు ప్రారంభమైంది. అయితే.. ప్రజల నుంచి ఏమేరకు స్పందన వస్తుందన్నది చూడాలి. ప్రస్తుతం సగానికి పైగా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాకపోవడంపట్ల పార్టీ చీఫ్ పల్లా విస్మయం వ్యక్తం చేశారు.
