Begin typing your search above and press return to search.

కార్యకర్తలకు టికెట్లు....టీడీపీ బంపర్ ఆఫర్

ఏపీలో పెద్ద ఎత్తున అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి. దాంతో అనేక మంది కొత్త నాయకులు రంగంలోకి వచ్చే అవకాశాలు ఏర్పడ్డాయి.

By:  Satya P   |   30 March 2026 11:00 AM IST
కార్యకర్తలకు టికెట్లు....టీడీపీ బంపర్ ఆఫర్
X

ఏపీలో పెద్ద ఎత్తున అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి. దాంతో అనేక మంది కొత్త నాయకులు రంగంలోకి వచ్చే అవకాశాలు ఏర్పడ్డాయి. సంప్రదాయ రాజకీయ కుటుంబాలు అలాగే సీనియర్లతో పాటు కొత్త వారూ ఈసారి ఎన్నికల రణ క్షేత్రంలో కనిపించబోతున్నారు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ 45 వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలకు పెద్ద పీట వేశారు వారినే వేదిక మీద కూర్చోబెట్టారు. వారితో కలసి తన నివాసంలో విందు భోజనం ఆరగించారు. చంద్రబాబు లోకేష్ ఈ ఇద్దరూ కార్యకర్తలు పార్టీకి జీవ గర్రలు అని నినదించారు.

వారినే దూరం పెడతాం :

చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకేసి పార్టీ అంటే కార్యకర్తలే అని స్పష్టం చేశారు. ఏ నాయకుడు అయినా కార్యకర్తలను దూరం పెడితే ఆ నాయకుడిని సైతం పార్టీకి దూరం పెట్టడానికి తాను వెనకాడబోము అని బాబు హెచ్చరించారు. కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకోవాలని వారితోనే మమేకం కావాలని ఆయన సూచించారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే నాయకులు ఎవరైనా తమకు అవసరం లేదని బాబు ఖండితంగా చెప్పేశారు.

పనిచేసే వారికి చాన్స్ :

ఇదిలా ఉంటే భవిష్యత్తులో పార్టీలో పనిచే వారికి పెద్ద పీట వేస్తామని బాబు హామీ ఇచ్చారు. ఏకంగా 50 శాతం పైగా అదనం సీట్లు ఏపీకి రాబోతున్నాయని బాబు చెప్పారు. అలాగే మహిళా రిజర్వేషన్లు కూడా వస్తున్నాయని గుర్తు చేశారు. వీటి నేపధ్యంలో బాగా పనిచేసే వారికి పార్టీకి అవకాశాలు కల్పిస్తుందని బాబు చెప్పారు. పార్టీ కోసం ఎవరు బాగా కష్టపడి పనిచేస్తారో వారికే చాన్స్ అని బాబు మనసులో మాట చెప్పేశారు వారే ప్రజా ప్రతినిధులు అవుతారని కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారు అందువల్ల బాగా పనిచేయాలని ఆయన సూచించారు.

లోకేష్ కే బాధ్యతలు :

పార్టీలో ఎవరు బాగా పనిచేస్తున్నారో చూసే బాధ్యతని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కి అప్పగిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. లోకేష్ ఈ విధయంలో మోనిటరింగ్ చేస్తారు అని అన్నారు. టీడీపీలో ప్రతీ కార్యకర్త పనితీరుని ఆయన మధింపు చేస్తారు అని చెప్పారు. అందువల్ల అంతా కష్టపడాలని బాబు సూచించారు. అంతే కాదు పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ క్రమశిక్షణతో మెలగాలని బాబు కోరారు. మంచి ప్రవర్తన ద్వారానే పదవులు అందుకుంటారని చెప్పారు పార్టీ బ్రాండ్ అన్నది చాలా ముఖ్యమని బాబు చెబుతూ ఆ విధంగా ఆదర్శంగా నాయకులు కార్యకర్తలు ఉండాలని దిశా నిర్దేశం చేశారు.

కొత్త ముఖాలుగా :

టీడీపీ వయసు 45 ఏళ్ళు. దాంతో పాత తరానికి నెమ్మదిగా దూరం పెట్టి కొత్త తరానికి ఆహ్వానం పలకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విషయం మీద 2024 ఎన్నికల్లోనే టీడీపీ కొంత కసరత్తు చేసింది. డీ లిమిటేషన్ ప్రక్రియతో సీట్లు పెరగడంతో టీడీపీ ఈసారి మరింతమంది కొత్త వారిని ప్రోత్సహించాలని చూస్తోంది. దాంతో ఈసారి గోల్డెన్ చాన్స్ అని అంటున్నారు. లోకేష్ సైతం యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి బాగా పనిచేసే కార్యకర్తలు నేరుగా ఎమ్మెల్యే ఎంపీ వంటి కీలక పదవులు చేపట్టేందుకు పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి అధినేత చంద్రబాబు ప్రకటించిన ఆ ఆఫర్ ని ఎంతమంది అందుకుని అదృష్టవంతులు అవుతారో చూడాల్సి ఉంది.