Begin typing your search above and press return to search.

గోదావరి సాక్షిగా బాబు మరో రికార్డు!

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే రికార్డులకు మారు పేరుగా మారుతున్నారు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 10:00 AM IST
గోదావరి సాక్షిగా బాబు మరో రికార్డు!
X

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే రికార్డులకు మారు పేరుగా మారుతున్నారు. ఆయన ఒక ప్రాంతీయ పార్టీకి సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా రికార్డు క్రియేట్ చేశారు. నాలుగు సార్లు సీఎం గా తెలుగునాట సమీప కాలంలో మరొకరు టచ్ చేయలేని రికార్డుని సొంతం చేసుకున్నారు. ఇక అర్ధ శతాబ్దం పైగా రాజకీయ అనుభవంతో బాబు ఇంకో రికార్డుని దక్కించుకున్నారు.

జాతీయ స్థాయిలో అనేక ప్రభుత్వాలలో కీలక భూమిక పోషించడం ద్వారా బాబు తెలుగు నాట నుంచి జాతీయ స్థాయిలో ప్రముఖ నాయకుడిగా వెలుగుతూ ఇంకో రికార్డుని అందుకున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే గోదావరి పుష్కరాలకు బాబుకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పరమైన అనుబంధం ఉంది.

బాబు గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రిగా ఉంటూ ఇప్పటికి రెండు సార్లు నిర్వహించారు. ఇపుడు ఆయన ముచ్చటగా మూడోసారి నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి డేట్స్ ఫిక్స్ అంటూ ప్రచారం సాగుతోంది.

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు ఇప్పటికే మొదలు పెట్టింది.ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా కూడా వేస్తున్నారు.

ఇక చూస్తే కనుక 2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు దృష్టిలో ఉంచుకొని అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారని చెబుతున్నారు.

ఇక ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధికార యంత్రాంగం రూ.904 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేసింది. అలాగే కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే రూ. 100 కోట్ల నిధులు కేటాయించింది.

మరో వైపు చూస్తే రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు రూ 271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతారని అంటున్నారు. ఏది ఏమైనా నాలుగవ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన హయాంలో మూడు గోదావరి పుష్కరాలను చూడడమే కాదు వాటిని సీఎం హోదాలో నిర్వహించడం అంటే గ్రేట్ అంటున్నారు.

చంద్రబాబు 1995లో సీఎం అయితే 2003లో వచ్చిన గోదావరి పుష్కరాలకు ఆయన ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్నారు. దాంతో అప్పట్లో ఆయన విజయవంతంగా పుష్కరాలను నిర్వహించారు. ఆ సమయంలోనే పుష్కరాల నిర్వహణని ఒక భారీ విధానంలో నిర్వహించి హైలెట్ చేసారు. అలాగే 2015లో వచ్చిన పుష్కరాలో కూడా బాబు తన మార్క్ చూపించారు. ఇపుడు 2027లో మళ్ళీ పుష్కరాలు బాబు చేతుల మీదుగా జరుగుతున్నాయి.

ఇక సీఎం గా బాబు 2016లో కృష్ణా పుష్కరాలను కూడా నిర్వహించారు. 2028లో వచ్చే కృష్ణా పుష్కరాలను కూడా ఆయనే నిర్వహిస్తారు. అలా రెండు పుష్కరాల నిర్వహణ ఘనత కూడా ఆయందే అవుతుంది. 2004లో మాత్రం వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉండగా ఒకసారి కృష్ణా పుష్కరాలను నిర్వహించారు.

ఆ భాగ్యం చూస్తే కనుక 1991 గోదావరి పుష్కరాలకు, 1992 క్రిష్ణా పుష్కరాలకు సంబంధించి కాంగ్రెస్ సీఎం గా ఉమ్మడి ఏపీకి ఉన్న నేదురుమల్లి జనార్ధనరెడ్డి అప్పట్లో దక్కించుకున్నారు. ఇంకా వెనక్కి వెళితే కనుక 1979లో మర్రి చెన్నారెడ్డికి గోదావరి పుష్కరాల నిర్వహణ అదృష్టం దక్కింది. ఇలా చూసుకుంటే గడచిన యాభై ఏళ్లలో పుష్కరాల నిర్వహణ అయితే బాబుకే అతి పెద్ద గౌరవంగా మారింది. విభజన తరువాత గోదావరి క్రిష్ణా పుష్కరాల నిర్వహణను ఒకసారి కేసీఆర్ చేపట్టారు. అలాగే ఇపుడు రేవంత్ రెడ్డికి ఆ భాగ్యం దక్కనుంది. అయితే అఖండ గోదావరిగా ఉన్న రాజమండ్రిలోనే పుష్కర సందడి ఎక్కువగా ఉంటుంది. అలాగే విజయవాడలో క్రిష్ణా పుష్కరాల హడావుడి అధికంగా కనిపిస్తుంది.