Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు భారీ కానుక‌.. ఆ వ‌ర్గంపై వ‌రాలు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో భారీ కానుక‌ను ప్ర‌క‌టించారు. దివ్యాంగుల సంక్షేమ దినాన్ని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం రాత్రి విజ‌యవాడ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు.

By:  Garuda Media   |   4 Dec 2025 8:00 AM IST
చంద్ర‌బాబు భారీ కానుక‌.. ఆ వ‌ర్గంపై వ‌రాలు!
X

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో భారీ కానుక‌ను ప్ర‌క‌టించారు. దివ్యాంగుల సంక్షేమ దినాన్ని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం రాత్రి విజ‌యవాడ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగ స‌మాజానికి చంద్ర‌బాబు కీల‌క వ‌రం ప్ర‌క‌టించారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ‌స్సుల్లోనూ దివ్యాంగుల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తున్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు .. గురువారంనుంచి స్త్రీ, పురుష బేధం లేకుండా.. దివ్యాంగులు అంద‌రికీ ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణం అందుబాటులోకి తెస్తున్నామ‌న్నారు.

ఈ ఒక్క‌టే కాకుండా.. సీఎం చంద్ర‌బాబు దివ్యాంగుల‌పై మ‌రిన్నివ‌రాలు గుప్పించారు. నామినేటెడ్ ప‌ద‌వుల్లో దివ్యాంగుల‌ను నియ‌మిస్తామ‌న్నారు. ముఖ్యంగా లోక‌ల్ బాడీలు, కార్పొరేష‌న్లు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ఒక దివ్యాంగ ప్ర‌తినిధిని నామినేట్ చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.

అదేవిధంగా దివ్యాంగుల‌కు స‌బ్సిడీ ప‌థ‌కాన్ని పున‌రుద్ధ‌రిస్తున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. దీని కింద‌.. వాహ‌నాలు కొనుగోలు.. ఇళ్లు, స్థ‌లాల కొనుగోలు ప్ర‌భుత్వం స‌బ్సిడీ ఇవ్వ‌నుంది. అదేవిధంగా ఉన్న‌త విద్య‌ను చ‌దువుకునే దివ్యాంగుల‌కు కూడా ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. ఇది పూర్తి ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుకు భిన్నంగా ఉంటుంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు.

అలానే.. క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్‌మెంట్‌ స్కీములను కూడా దివ్యాంగులకు అందేలా చ‌ర్య‌లు చేప‌డ‌తారు. ఇక‌, టిడ్కో స‌హా .. ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఇచ్చే ఇళ్ల విష‌యంలో దివ్యాంగుల‌కు ప్ర‌త్యేక కోటాను అమ‌లు చేస్తారు. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్‌ను వారికి రిజ‌ర్వ్ చేస్తారు. వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు సీఎం తెలిపారు. దివ్యాంగుల‌కు ఇచ్చే పింఛ‌నును ఇక‌పై కార్యాల‌యాల్లోను, విద్యా సంస్థ‌ల్లోనూ అందించ‌నున్నారు. త‌ద్వారా ఇళ్ల వ‌ద్ద వారు పింఛ‌ను కోసం వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటారు.

అమ‌రావ‌తిలో దివ్యాంగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం.. ప్ర‌త్యేకంగా దివ్యాంగ భ‌వ‌న్‌ను నిర్మించ‌నున్న‌ట్టు తెలిపారు.. దీనికి మూడు ఎక‌రాల స్థ‌లం కేటాయించే అంశంపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. దివ్యాంగుల‌కు గ‌తంలో రూ.3000లుగా పింఛ‌నును తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రూ.6వేల‌కు పెంచిన విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు గుర్తు చేశారు.