Begin typing your search above and press return to search.

ప్రజలు అంగీకరించడానికి సమయం పట్టినా సరే, ఆ పని చేసి తీరుతా : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు జనాభా నిర్వహణ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలనే తన ప్రతిపాదన అమలు కష్టమైనప్పటికీ, ప్రజలకు దీర్ఘకాలంలో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రయత్నం కొనసాగిస్తానన్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ, దేశాభివృద్ధికి రాబోయే 20 ఏళ్లు కీలకమని పేర్కొన్నారు. ఎస్ఐఆర్‌పై స్పందిస్తూ, ఓట్ల తొలగింపుపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రతి 20–25 ఏళ్లకు ఒకసారి ఎస్ఐఆర్ అవసరమని చెప్పారు.

By:  Tupaki Political Desk   |   13 Nov 2026 3:40 PM IST
ప్రజలు అంగీకరించడానికి సమయం పట్టినా సరే, ఆ పని చేసి తీరుతా : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

సీఐఐ సదస్సు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంతోపాటు ప్రతిపక్షాలు చేస్తున్న ఓట్ చోరీ విమర్శలపైనా చంద్రబాబు మాట్లాడారు. తాను ప్రతిపాదించిన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు చేయడం కష్టమని అంగీకరించడమే కాకుండా, ఆ విధానాన్ని అమలు చేయడానికి ఎంత కష్టమైనా ప్రయత్నిస్తానని వ్యాఖ్యానించారు. విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ సదస్సులో చంద్రబాబు పలువురు పారిశ్రామిక వేత్తలు, మేథావులు, జర్నలిస్టులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు పాల్కీ శర్మతో ప్రత్యేకంగా సంభాషించారు. ఇందులో డెమోగ్రాఫిక్ డివిడెంట్ (సంతానమే సంపద)పై గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావన రాగా, సీఎం ఆకట్టుకునేలా సమాధానమిచ్చారు. ప్రజలకు దీర్ఘకాలంలో మేలు జరుగుతుందని భావించినప్పుడు, ఆ విధానాన్ని అమలు చేయడం ఎంత కష్టమైనా సరే, ప్రజలు అంగీకరించడానికి సమయం పట్టినా సరే... తాను చెప్పడం మాత్రం విరమించుకోనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

డెమోగ్రాఫిక్ డివిడెండ్ విషయంలో మీరు ప్రతిపాదిస్తున్న ఆలోచనలను ఆచరణలో అమలు చేయడం సాధ్యమేనా అని సీనియర్ జర్నలిస్ట్ పాల్కీ శర్మ ప్రశ్నించగా, చంద్రబాబు ఎంతో పరిణతితో సమాధానమిచ్చారు. గతంలో తానే స్వయంగా కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తూ ‘ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి’ అని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే, కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుదల వల్ల ఎదురవుతున్న పరిణామాలను, వృద్ధుల జనాభా పెరిగి యువశక్తి తగ్గిపోతున్న తీరును గమనించిన తర్వాత తన ఆలోచన మార్చుకున్నానని వివరించారు. భవిష్యత్ తరాల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే జనాభా వృద్ధి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని తాను సూచిస్తున్న కొత్త విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, అమలు చేయడం అత్యంత కష్టమైన పని అని చంద్రబాబు అంగీకరించారు. మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మార్పును వెంటనే అంగీకరించడం కష్టమేనని తనకు తెలుసని అన్నారు. అయినప్పటికీ, తాను ఎంచుకున్నది చాలా కష్టమైన మార్గమే అయినా, సమాజానికి మంచి జరుగుతుందనే నమ్మకం ఉన్నంత వరకు ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తూనే ఉంటానని, తన ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించుకోనని తేల్చిచెప్పారు.

జనాభా విధానంతో పాటు జాతీయ రాజకీయాల్లో పొత్తుల అంశంపై కూడా పాల్కీ శర్మ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో పొత్తుల వల్ల ఎప్పుడైనా సిద్ధాంతపరమైన విభేదాలు వచ్చాయా అన్న ప్రశ్నకు బదులిస్తూ, 1991కి ముందు దేశంలో 'లెఫ్ట్ వింగ్ - రైట్ వింగ్' అనే సిద్ధాంతపరమైన విధానాలు ఉండేవని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు. నేడు ప్రజల సంక్షేమం, అభివృద్ధే ఏకైక ప్రధాన అజెండాగా మారిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని నరేంద్ర మోదీనే సరైన ఛాయిస్ అని, ఆయనే రైట్ పర్సన్ అని స్పష్టం చేశారు. భారతదేశ అభివృద్ధికి రాబోయే 20 ఏళ్లు అత్యంత కీలకమైన సమయమని, ఈ సువర్ణావకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదని పిలుపునిచ్చారు.

మారుతున్న యువత, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన ఎలా ఉండాలనే అంశంపై మాట్లాడుతూ, నాయకత్వం నిరంతరం ప్రజలు, యువతతో ఇంటరాక్ట్ అవుతూనే ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజంలోని విభిన్న వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎక్కడా ఆందోళనలకు తావుండదని అన్నారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో తమ ప్రభుత్వం నిరంతరం ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తోందని, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన, మంచి నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఇక ఎస్ఐఆర్ (SIR) పై వస్తున్న ఆందోళనలు, విమర్శలపై స్పందిస్తూ ప్రతి 20 నుంచి 25 ఏళ్లకు ఒకసారి ఎస్ఐఆర్ నిర్వహించడం తప్పనిసరి అని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు మిస్ అయిందన్న ఫిర్యాదులు ఎక్కడా రాలేదని స్పష్టం చేశారు. ప్రతి రాజకీయ పార్టీకి గ్రామస్థాయిలో బలమైన నెట్‌వర్క్ ఉంటుందని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఏ ఒక్క ఓటు కూడా మిస్ అయ్యే అవకాశమే ఉండదని వివరించారు. ఓట్ల తొలగింపు అనేది కేవలం అపోహలు మాత్రమేనని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు. అపోహల ఆధారంగా రాజకీయాలు చేయాలనుకోవడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు.