నా జీవితంలో ఇది శాశ్వతం...బాబు భావోద్వేగం
విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగానికి గురి అయ్యారు.
By: Satya P | 28 April 2026 12:11 PM ISTవిశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగానికి గురి అయ్యారు. నా జీవితంలో ఇది శాశ్వతం అని అన్నారు. తాను ఎన్నో కార్యక్రమాలను ప్రారంభోత్సవాలను చేశాను కానీ గూగుల్ డేటా సెంటర్ కి శ్రీకారం చుట్టడం ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది అని అన్నారు. మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్ లో తాను హైటెక్ సిటీ నిర్మాణానికి పూనుకున్నాను అని అది సైబరాబాద్ గా మారి ఈ రోజున సంపదను సృష్టిస్తోంది అని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
నాడు నమ్మలేదు :
భవిష్యత్తు అంతా ఐటే రంగానిదే అని తాను ఉమ్మడి ఏపీ సీఎం హోదాలో చెబితే ఆనాడు ఎవరూ నమ్మలేదని బాబు అన్నారు. కానీ ఇపుడు అంతా దానిని చూస్తున్నారు అన్నారు ఇపుడు ఏఐ విప్లవం వచ్చిందని క్వాటం విప్లవం వచ్చిందని దానిని అందుపుచ్చుకుంటున్నామని విశాఖ మరో హైటెక్ సిటీ అవుతుందని కేరాఫ్ ఏఐ అవుతుందని బాబు చెప్పారు. విశాఖలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడం అంటే తాను ఎంతగానో ఆనందిస్తున్నాను అని బాబు అన్నారు.
ఉత్తరాంధ్ర గ్రేట్ :
ఉత్తరాంధ్రా అంటే ఒకనాడు వెనకబాటుతనం వలలక ప్రాంతం అని అంతా అనేవారు అని బాబు గుర్తు చేశారు. కానీ ఈ రోజున ఉత్తరాంధ్ర వలసలు జిల్లా కాదు ఉపాధికి అభివృద్ధికి చిరునామా అన్నారు. బయట నుంచి ఎందరో విశాఖకు ఉత్తరాంధ్రకు ఇక మీదట వస్తారు అని బాబు చెప్పారు. గడచిన రెండేళ్ల కాలంలో ఎన్నో పరిశ్రమలు విశాఖతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలకు తరలి వచ్చాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది జూలైలో అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం వద్ద ప్రారంభం అవుతుందని అన్నారు. రాబోయే కాలంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, గూగుల్ డేటా సెంటర్, మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటివి పూర్తి అయితే ఉత్తరాంధ్ర రూపు రేఖలే మారిపోతాయని బాబు చెప్పారు.
విశాఖ మంచితనం :
విశాఖ వాసులు ఎంతో మంచివారు అని బాబు కితాబు ఇచ్చారు. తాను ఎన్నో నగరాలను తిరిగాను కానీ విశాఖ వాసుల వంటి వారిని ఎక్కడా చూడలేదని ఆయన అన్నారు. ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటారని అందరినీ ప్రేమిస్తారని బాబు చెప్పారు. దాంతో పాటుగా అభివృద్ధిని వారు స్వాగతిస్తారు అని బాబు చెప్పారు. విశాఖలో ఉన్న మంచితనం ప్రకృతిలో కూడా కనిపిస్తుందని అన్నారు. ఒక వైపు చక్కని సాగర తీర ప్రాంతం అలాగే ఎత్తైన కొండలు పచ్చని ప్రకృతి అదే వ్దిధంగా విశాఖలో ఉన్న ప్రశాంతత అన్నీ కలసి ఈ నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చాయని అన్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఖరగ్ పూర్ టూ చెన్నై వెళ్తూ విశాఖ అందాలను నాడు వీక్షించి ముచ్చటపడ్డారని ఇపుడు ఆయనే విశాఖలో గూగుల్ ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ నగరం అభివృద్ధిలో తన వంతు పాత్రని పోషించడం ఎంతో గర్వ కారణం అన్నారు.
