ఏలూరు నేతలకు బాబు ఏం చెప్పారు.. ?
ఇప్పటికే తిరుపతి, అనంతపురం, గుంటూరు పార్లమెంటు స్థానాల నాయకులతో భేటీ అయ్యారు. తాజాగా ఇటీవల ఏలూరు పార్లమెంటు స్థానంలోని ఎమ్మెల్యేలతోనూ ఆయన భేటీ అయ్యారు.
By: Garuda Media | 27 March 2026 8:15 AM ISTపార్లమెంటు నియోజకవర్గాల వారీగా సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ఎంపీ సహా.. ఆ నియోజకవర్గం పరిధిలోని ఏడు లేదా ఆరు అసెంబ్లీ స్థానాల ఎమ్మెల్యేల(టీడీపీ నేతలకు)తో బాబు తరచుగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే తిరుపతి, అనంతపురం, గుంటూరు పార్లమెంటు స్థానాల నాయకులతో భేటీ అయ్యారు. తాజాగా ఇటీవల ఏలూరు పార్లమెంటు స్థానంలోని ఎమ్మెల్యేలతోనూ ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మూడు కీలక విషయాలను నాయకులకు బోధించారు. వాటిని పాటించాలని సూచించారు. ప్రజల మధ్యకు వెళ్లడం దీనిలో కీలకమైన సూచన. ప్రస్తుతం ఏలూరు నియోజకవర్గంలో ప్రజలకు, నాయకులకు మధ్య గ్యాప్ ఉంది. దీనిని తగ్గించాలని చంద్రబాబు సూచించారు. అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై వివరించాలని.. ముందుగా ఎమ్మెల్యేలు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు.
వీటిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని సూచించారు. పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాల కల్పన, సంక్షేమ పథకాలను సంపూర్ణంగా వివరించేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక, మూడో అంశం.. వివాదాలకు దూరంగా ఉండడం. ఈ విషయం అందరికీ చెబుతున్నా.. కొందరు మాత్రమే చంద్రబాబు చెప్పినట్టు వింటున్నారన్న చర్చ ఉంది. ఏలూరులోనూ ఈ తరహా నాయకులు ఉన్నారు. ఈ క్రమంలో వారిని తమను తాము మార్చుకోవాలని గట్టి హెచ్చరికే చేశారు.
ఇక, ప్రస్తుతం ఉన్న వివాదాలపు వ్యక్తిగతంగా పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్నీ పార్టీ నే చేయాలంటే.. సమయం చాలదని తేల్చి చెప్పారు. ఏలూరు నియోజకవర్గం ప్రజలు.. కొన్ని దశాబ్దాలు గా పార్టీకి అండగా ఉంటుందున్నారన్న చంద్రబాబు.. దీనిని నిలబెట్టుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పార్టీ నాయకులు జాగ్రత్తగా అడుగులు వేయాలన్నారు. అయితే.. ఇతర నియోజవర్గాల్లో ఉన్నంత స్థాయిలో ఏలూరులో విభేదాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
