Begin typing your search above and press return to search.

రాత్రి ప‌దైంది.. బాబు నిద్ర‌పోతారులే అనుకున్నారు.. కానీ ఏం జ‌రిగిందంటే!

తుఫాను, ఎన్నికలు, సీఐఐ సదస్సుతో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు శనివారం రాత్రి 10 గంటల తర్వాత టీడీపీ, కూటమి ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 32 మంది నేతలతో సుమారు 45 నిమిషాలు మాట్లాడి, రాబోయే మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం కొనసాగాలని, గ్రామస్థాయిలో అభ్యర్థుల విజయానికి నేతలు కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో కొందరు నేతలు ఆవలింతలు తీయడంతో.. అప్పుడే నిద్ర వస్తోందా అంటూ చంద్రబాబు చురకలు అంటించారు.

By:  Garuda Media   |   16 Nov 2026 2:04 AM IST
రాత్రి ప‌దైంది.. బాబు నిద్ర‌పోతారులే అనుకున్నారు.. కానీ ఏం జ‌రిగిందంటే!
X

సీఎం చంద్ర‌బాబు గ‌త రెండు మూడు వారాల నుంచి తుఫాను, ఎన్నిక‌లు, అనంత‌రం విశాఖ‌లో ఏర్పాటు చేసిన సీఐఐ స‌ద‌స్సుతో బిజీబిజీగా గ‌డిపారు. అనంత‌రం.. శ‌నివారం మ‌ధ్యాహ్నం ఆయ‌న హైద‌రాబాద్ వెళ్లిపోయారు. ఇక‌, ఆయ‌న ఈ వారం రోజుల క‌ష్టంతో రెస్టు తీసుకుంటారులే అని అంద‌రూ అనుకున్నారు. కానీ.. ఇక్క‌డే అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. శ‌నివారం రాత్రి 10 గంట‌లైపోయింది. దాదాపు టీడీపీ నాయ‌కులు, మంత్రులు కూడా త‌మ త‌మ వ్య‌క్తిగ‌త ప‌నులు, కుటుంబాల‌తో క‌లిసి భోజ‌నం, విందులు వంటి కార్య‌క్ర‌మాల్లో ఉన్నారు. మ‌రికొంద‌రు నేత‌లు గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు దారుల విష‌యంపై `ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు` ఏర్పాటుచేసుకుని చ‌ర్చిస్తున్నారు. ఎవ‌రికీ చంద్ర‌బాబు గురించిన చ‌ర్చ లేదు.

కానీ, క‌చ్చితంగా అదేస‌మ‌యంలో సీఎంవో నుంచి ముఖ్య నేత‌ల‌కు ఫోన్లు వెళ్లాయి. ``స‌ర్‌.. ప‌ది నిమిషాల్లో లైన్‌లోకి వ‌స్తున్నారు`` అని సందేశం అందింది. అంతే నాయ‌కుడు విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ``స‌మ‌యం చూస్తే.. 10 దాటింది.. ఇప్పుడు సీఎం నుంచి ఫోనా`` అని నోరెళ్ల బెట్టారు. ఇలా ఒక‌రికో ఇద్ద‌రికో కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది ముఖ్య‌నాయ‌కుల‌కు ఫోన్ చేసి రాత్రి 10 త‌ర్వాత‌.. చంద్ర‌బాబు టెలీ కాన్ఫ‌రెన్సు పెట్ట‌డంతో అంద‌రిలోనూ ఒక్క‌టే ఆశ్చ‌ర్యం. ఇంత అత్య‌వ‌స‌రంగా ఏంటీ మీటింగ్ అని!. దీంతో విందులు, భోజ‌నాలు ఆపేసి మ‌రీ నాయ‌కులు టెలిఫోన్ల ముందు కూర్చున్నారు. చంద్ర‌బాబు లైన్‌లోకి వ‌చ్చారు. అంద‌రినీ కుశ‌ల ప్ర‌శ్న‌లు అడిగారు. అనంత‌రం.. 45 నిమిషాల పాటు నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు.

విష‌యం ఇదీ..

రాష్ట్రంలో జరుగుతున్న గ్రామస్థాయి ఎన్నికలపై పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల‌ని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలపై నేతలతో చర్చించారు. స్థానిక సంస్థ‌లు, కార్పొరేష‌న్‌లు, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో పార్టీ ఏవిధంగా కూట‌మి పార్టీలు విజ‌యం ద‌క్కించుకున్నాయో.. ఇప్పుడు జ‌ర‌గ‌నున్న 23 మునిసిపాలిటీలు(ఇటీవ‌ల నిలిచిపోయిన వాటికి ఇప్పుడు నిర్వ‌హిస్తున్నారు) గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ అదే విజ‌యం ద‌క్కాల‌ని దిశానిర్దేశం చేశారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసుకుని ముందుకు సాగాల‌న్నారు. ఎక్క‌డా త‌ప్పులు జ‌ర‌గ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పారు. కూట‌మి పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త కొన‌సాగాల‌ని సూచించారు. గ్రామీణ‌ ప్రాంతాల్లో కూట‌మి మ‌ద్ద‌తు ఇచ్చిన అభ్య‌ర్థుల‌ను గెలిపించే బాధ్య‌త‌ను తీసుకోవాల‌ని సూచించారు. ఇలా.. ఎన్నిక‌ల‌పై నాయ‌కుల‌కు ప‌లు అంశాల‌ను సూచించారు.

నాయ‌కుల ఆవ‌లింత‌లు.. బాబు చుర‌క‌లు

ఈ టెలీ కాన్ఫ‌రెన్స్ జ‌రుగుతున్న స‌మ‌యంలో కొంద‌రు నాయ‌కులు ఆవలింత‌లు పోయారు. ఈ సంద‌ర్బంగా.. చంద్ర‌బాబు వారికి చుర‌క‌లు అంటించారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల స‌మ‌యం కొన‌సాగుతోంద‌ని.. ``అప్పుడే నిద్ర వ‌చ్చేస్తోందా?`` అంటూ త‌న‌దైన శైలిలో న‌వ్వుతూ వారిని హెచ్చ‌రించారు. ఎన్నిక‌ల స‌మ‌యంంలో నిద్ర ప‌క్క‌న పెట్టాల‌న్నారు. పార్టీ శ్రేయ‌స్సే ప్ర‌ధానంగా ప‌నిచేయాల‌ని సూచించారు. కూట‌మి పార్టీల లు ఐక్యంగా ఉన్న ప్రాంతాల్లోనే విజ‌యం ఎక్కువ‌గా క‌నిపించింద‌ని, ప్ర‌జ‌లు కూడా ఆద‌రించార‌ని తెలిపారు. వ్య‌క్తిగ‌త అవ‌స‌రాలు, ప్రాధాన్యాల‌ను ప‌క్క‌న పెట్టి.. నాయ‌కులు.. ప‌నిచేయాల‌ని, క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌ను ముందుకు న‌డిపించాల‌ని సూచించారు.