అర్జెంటుగా బాబు ఢిల్లీకి...మ్యాటర్ ఇదే !
ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ కి సంబంధించి ప్రధాని వస్తున్నట్లుగా సమాచారం ఏపీ ప్రభుత్వానికి కొద్ది రోజుల క్రితమే వచ్చింది.
By: Satya P | 21 July 2026 10:30 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఒక వైపు ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. మరో వైపు చూస్తే విద్యార్థుల ఆందోళనలు ప్రతిపక్షాల ఆందోళనలు కూడా చోటు చేసుకున్నాయి. రైఉతు ఉద్యమాలకు కూడా ఢిల్లీ వేదిక కాబోతోంది. ఎన్డీయే ప్రభుత్వమయితే వివిధ రకాలైన ఆందోళనతో సతతమతం అవుతోంది. పార్లమెంట్ లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఎన్డీయే కీలక మిత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీ వస్తున్నారు.
బిజీ షెడ్యూల్ తోనే బాబు :
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ షెడ్యూల్ చూస్తే బిజీగా సాగనుంది అని అంటున్నారు. ఆయన ఢిల్లీకి ప్రత్యేకంగా పనిగట్టుకుని వెళ్తున్నది భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడానికే అని అంటున్నారు. అంతే కాదు ఇదే సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను కూడా చంద్రబాబు కలవనున్నారని అంటున్నారు. పార్లమెంట్ సెషన్ సందర్భంగా కేంద్ర మంత్రులు అంతా అక్కడే ఉంటారు కాబట్టి ఏపీకి సంబంధించిన అంశాల విషయంలో కూడా చంద్రబాబు చర్చిస్తారు అని అంటున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు అలాగే అనేకమైన రాష్ట్రానికి సంబంధించిన అంశాలను బాబు ప్రస్తావించనున్నారు అని తెలుస్తోంది.
స్వయంగా ఆహ్వానం కోసం :
ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ కి సంబంధించి ప్రధాని వస్తున్నట్లుగా సమాచారం ఏపీ ప్రభుత్వానికి కొద్ది రోజుల క్రితమే వచ్చింది. అయితే ఇపుడు ముఖ్యమంత్రి హోదాలో బాబు మోడీని ఆహ్వానించడం అన్నది ఒక సంప్రదాయంగా పెట్టుకున్నారు. తానే మోడీని కలసి ఆహ్వానించాలని ఆయన అనుకుంటున్నారు. ఉత్తరాంధ్రాలో కాదు ఏపీకే అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నిలుస్తోంది. దాంతో ఈ ఓపెనింగ్ అన్నది అంగరంగ వైభవంగా చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అందుకే ప్రధానిని కలసి ఆహ్వానించి ఆయనతో ఈ వేడుక గురించి ముచ్చటించాలని బాబు నిర్ణయించుకున్నారని అంటున్నారు.
ఒక రోజు పర్యటన :
ఇక ఢిల్లీలో చంద్రబాబు పర్యటన ఒక రోజు మొత్తం కొనసాగే అవకాశం ఉంది అని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవనున్నారు. అదే విధంగా కేంద్రమంత్రులు పియూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సీఆర్ పాటిల్‌ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక చంద్రబాబు షెడ్యూల్ చూస్తే బుధవారం ఉదయం 7.30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 10.00 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలిసిన అనంతరం ఆ రోజు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేస్తారు. ఢిల్లీలో కార్యక్రమాలను ముగించుకుని గురువారం ఉదయం 10.20 గంటలకు ఆయన నేరుగా అమరావతికి చేరుకుంటారని చెబుతున్నారు.
