Begin typing your search above and press return to search.

ఢిల్లీకి బాబు...రెండు రోజులు బిజీ షెడ్యూల్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. చాలా రోజుల తరువాత ఆయన ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు.

By:  Satya P   |   9 Jun 2026 1:56 AM IST
ఢిల్లీకి బాబు...రెండు రోజులు బిజీ షెడ్యూల్
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. చాలా రోజుల తరువాత ఆయన ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఈసారి ఆయన ఢిల్లీ టూర్ లో రెండు రోజులు గడపబోతున్నారు. బాబు ఢిల్లీ షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉండబోతోంది. అందులో రాజకీయ సమావేశాలతో పాటు అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి. బాబు ఢిల్లీకి ఈ నెల 10న వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే ఎన్డీయే కీలక భేటీకి బాబు హాజరవుతారు అని అంటున్నారు.

మోడీ అధ్యక్షతన :

ప్రధాని ఎన్డీయే సారధి అయిన నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నెల 10న జరిగే ఎన్డీయే కీలక భేటీలో బాబు కూడా టీడీపీ పక్షాన పాల్గొనబోతున్నారు. ఎన్డీయేలో బీజేపీ తరువాత టీడీపీ రెండవ పెద్ద మిత్ర పక్షంగా ఉంది. దాంతో ఎన్డీయే భేటీకి బాబు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ సమావేశంలో రెండేళ్ళ ఎన్డీయే పాలన మీద సమగ్రంగా చర్చిస్తారు. అంతే కాదు కేంద్ర మంత్రుల పనితీరు మీద కూడా కూలంకషంగా చర్చిస్తారు. అలాగే ఏ రాష్ట్రాల నుంచి మంత్రులను తీసుకోవాలి ఎన్డీయే పార్టీల నుంచి ఎంత మందికి అవకాశం ఇవ్వాలన్న దాని మీద కూడా చర్చ సాగనుంది. కూటమిలో కీలకమైన పాత్ర పోషిస్తున్న తెలుగుదేశానికి ఈ విషయంలో తగిన విధంగా ప్రయారిటీ ఉంటుందని అంటున్నారు.

నీతి అయోగ్ మీట్ కి :

ఇదిలా ఉంటే జూన్ 11న ఢిల్లీ వేదికగా జరిగే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి హోదాలో హాజరవుతారు. భారత్ మండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగే ఈ నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశంలో బాబు ఏపీ తరఫున హాజరై కీలకమైన అధికార మీటింగులో పాలుపంచుకుంటారు అని అధికార వర్గాలు తెలిపాయి.

టైట్ షెడ్యూల్ గానే :

ఇదిలా ఉంటే చంద్రబాబు ఢిల్లీ పర్యటన టైట్ షెడ్యూల్ గా ఉండబోతోంది. జూన్10వ తేదీ విజయవాడ నుంచి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అదే రోజున భారత్ మండపంలో జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఇక ఆయన అదే రోజు రాత్రి న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో బస చేయనున్నారు. రెండో రోజు నీతి అయోగ్ గవర్నింగ్ బాడీ మీటింగ్ అనంతరం బాబు అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరి రాత్రికి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఇక ఈ రెండు రోజుల టూర్ లో భాగంగా కేంద్ర మంత్రులను కలసి ఏపీ సమస్యల మీద చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే బాబు పర్యటన తరువాత ఏపీకి సంబంధించి కొత్తగా కేంద్ర మంత్రులు అయ్యేది ఎవరు అన్నది అలాగే ఏపీకి ఏ కీలక శాఖలు దక్కబోతున్నాయన్నది కూడా సూచనామాత్రంగా తెలియనుంది అని కూడా ప్రచారం సాగుతోంది.