వారిక రారు.. స్వేచ్ఛగా ఏపీకి రావొచ్చు: చంద్రబాబు
ఈ క్రమంలోనే వారికి రాష్ట్రంలో ఇప్పట్లో మరో ప్రభుత్వంరాదని తేల్చి చెప్పినట్టు తెలిపారు. ముఖ్యంగా అరాచక పాలనకు ప్రజలు ఎట్టి పరిస్థితిలోనూ అవకాశం ఇవ్వబోరని తాను స్పష్టం చేశానన్నారు.
By: Garuda Media | 21 Jan 2026 11:50 PM ISTదావోస్‌లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. పరిశ్రమల ఏర్పాటు.. పెట్టుబడుల సాధనకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు అంతర్జాతీయ ప్రతినిధులతోనూ ఆయన భేటీ అయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే.. కొందరు ఇంకా సందేహంగా ఉన్నారని స్వయం గా చెప్పారు. పెట్టుబడుల విషయంలో అనేక సందేహాలు వున్నా.. వాటిని తాము నివృత్తి చేస్తామన్నారు.
ముఖ్యంగా మరో పార్టీ(వైసీపీ) అధికారంలోకి వస్తే.. ఏంటని కొందరు ప్రశ్నించినట్టు మీడియాకు చంద్రబాబు తెలిపారు. కానీ, వారిక రారని.. బలమైన కూటమి(కొయిలేషన్) ప్రభుత్వం ఉందని చెప్పినట్టు తెలిపారు. ``పారిశ్రామిక వేత్తలను గ్రౌండ్ రియాల్టీ చూడమని కోరారు. ఒకసారి రాష్ట్రానికి వచ్చి.. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి? కూటమి పాలన ఎలా ఉంది? అనే విషయాలపై ఆలోచన చేయాలని కోరారు. కొందరు వస్తామని హామీ ఇచ్చారు`` అని వివరించారు.
ఈ క్రమంలోనే వారికి రాష్ట్రంలో ఇప్పట్లో మరో ప్రభుత్వంరాదని తేల్చి చెప్పినట్టు తెలిపారు. ముఖ్యంగా అరాచక పాలనకు ప్రజలు ఎట్టి పరిస్థితిలోనూ అవకాశం ఇవ్వబోరని తాను స్పష్టం చేశానన్నారు. శాంతి భధ్రతలు ఇప్పుడు బాగున్నాయని.. పెట్టుబడి దారుల పట్ల గౌరవంతోపాటు.. వారికి అవసరమైన అన్ని అనుమతులు కూడా వెంటనే ఇస్తున్నామని చెప్పారు. 15 ఏళ్లపాటు కూటమి ప్రభుత్వం ఉంటుందన్న నమ్మకాన్ని వారిలో కల్పిస్తున్నట్టు తెలిపారు. దీనికి ప్రజలు కూడా సహకరించాలన్నారు.
``పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎక్కువ తీర ప్రాంతం ఉన్నరాష్ట్రంలో పెట్టుబడులు మరిన్ని రావాలి. దీనికి సుస్థిరమైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. ఉంటుంది. కూటమి మరో 15 ఏళ్లు స్థిరంగాఉంటుంది. ఇదే విషయాన్ని వారికి చెప్పా. ప్రజలు కూడా స్థిరమైన ప్రభుత్వాన్నికొనసాగించాలనే కోరుకుంటున్నారు. అప్పుడే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి.`` అని మీడియాతో మాట్లాడిన చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా.. చంద్రబాబు దావోస్ పర్యటనకు భారీ స్పందన లభించిన విషయం తెలిసిందే.
