విజయవాడ సాయికృష్ణ కేసు.. చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్
విజయవాడలో రౌడీషీటర్ సాయికృష్ణ కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. గతకొద్ది రోజులుగా సాయికృష్ణ అదృశ్యంపై రకరకాల ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Gallery Desk | 24 Jun 2026 3:49 PM ISTవిజయవాడలో రౌడీషీటర్ సాయికృష్ణ కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. గతకొద్ది రోజులుగా సాయికృష్ణ అదృశ్యంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆయన పోలీసుకస్టడీలో మరణించారని, మృతదేహాన్ని రహస్యంగా దహనంచేశారని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వేడుకుంది. ఆ తర్వాత ఈ అంశంపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ వేసింది. సిట్ దర్యాప్తు చేపట్టి సాయికృష్ణ పోలీసు కస్టడీలో మరణించారని గుర్తించి, అందుకు బాధ్యుడిగా సీఐ నాగరాజును అరెస్టు చేసింది. అంతేకాకుండా నిందితుడు, సీఐ నాగరాజును కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజుల విధించారు. ఈ పరిణామాలు ఒకవైపు కొనసాగుతుండగా కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో సాయికృష్ణ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమలోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైన్ ను బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనే అంశంపై తాను ఆలోచిస్తున్నానని వెల్లడించారు. కానీ, గొడ్డలి పార్టీ నేతలు మాత్రం రాత్రిబంవళ్లూ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గాల వారీగా విడదీస్తూ విషం చిమ్ముతున్నారని సీఎం మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మందిని చూశానని, కానీ కన్ను ఆర్పకుండా అబద్దాలు చెప్పడంలో గొడ్డలి పార్టీ నాయకుడు దిట్ట అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై ఫైర్ అయ్యారు. ఎక్కడికక్కడ నేరాలు, ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శించారు. ఈ సమయంలోనే విజయవాడ కేసుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో ఒక సంఘటన జరిగితే, కులం రంగు పులిమి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో సీఐ, బాధితుడు ఒకే కులం అయినా కుల రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా నోరు పారేసుకుంటే ఖబర్దార్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నేరాలు చేయడంలో గొడ్డలి పార్టీ నేతలు చాలా సమర్థవంతులు అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గంజాయి, బ్లేడు బ్యాచులకు అండగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాయలసీమలో ముఠాలను అణచివేస్తే, వాళ్లు ఫ్యాక్సనిస్టులతో నేరాలు చేయించి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారని ఆరోపించారు.
గొడ్డలి పార్టీకి విధ్వంసమే విజన్, ఫేక్ ప్రచారమే విధానం, రప్పారప్పా రాజకీయాలే మ్యానిఫెస్టో అంటూ వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు. ఎప్పుడైనా ఎక్కడైనా పోస్టర్లకు జంతు బలి ఇవ్వడం చూశామా? అంటూ ప్రశ్నించారు. మాట్లాడితే మళ్లీ మేం వస్తాం గొడ్డలి తీసుకుని రప్పా రప్పా నరికేస్తాం అంటే వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ‘‘నాటి బాబాయ్ మర్డర్, మొన్నటి పాస్టర్ ప్రమాదం, నిన్నటి సింగయ్యను తొక్కించుకు వెళ్లిపోవడం అన్నీ కుట్రలే. బాబాయ్ ని చంపి ఆ గొడ్డలి నా చేతిలో పెట్టారు. నారాసుర రక్త చరిత్ర అన్నారు ముఖ్యమంత్రిపై నిందలేశారు. గొడ్డలి పార్టీ ఎంత ప్రమాదమో ఆలోచించుకోండి. గొడ్డలి పార్టీకి భవిష్యత్తు లేదు.’’ అంటూ చంద్రబాబు తేల్చిచెప్పారు. గొడ్డలిపార్టీ ఏం చేస్తుందో చెప్పగలదా? అంటూ సవాల్ విసిరారు.
