బాబుకు వీరు కనిపించట్లేదా.. లేక వదిలేశారా ..!
రాజకీయాల్లో చెత్తను తుడిచేయాలని.. కడిగేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇది మంచిదే.
By: Tupaki Desk | 21 July 2025 3:00 PM ISTరాజకీయాల్లో చెత్తను తుడిచేయాలని.. కడిగేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇది మంచిదే. ఎవరు మాత్రం చెత్తరాజకీయాలు కోరుకుంటారు? ఎవరు మాత్రం రప్పా రప్పా రాజకీయాలు చేయాలని ఆశిస్తారు? సో.. చంద్రబాబుకు అందరి మద్దతు ఉంటుంది. అయితే.. ఇది ఏకపక్షంగా అయతే.. మాత్రం అది ఆయనకే ఇబ్బంది అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. చంద్రబాబు ఒక కోణంలో ఆలోచించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా వైసీపీ గురించి.. ఆ పార్టీ నాయకుల గురించే చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.
కానీ.. ఒక్కసారి నాణేనికి రెండో వైపు చూస్తే.. టీడీపీలోనూ రప్పా రప్పా రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు. మరి వారి సంగతేంటి? అనేది ఆయన ఆలోచన చేసుకోవాలి. ఎందుకం టే.. గత 2014-19 మధ్య కూడా ఇలాంటి వారిని ఉపేక్షించే చంద్రబాబు తీవ్రంగా నష్టపోయారు. పొరుగు పార్టీవైపు వేలు చూపించడం తప్పుకాదు. కానీ, మన వైపు చూపించే వేళ్లను కూడా సరిచేసుకోవాలి. ఉదాహరణకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు పూర్తిగా గాడితప్పారు.
వీరిలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వారు చేస్తున్న రాజకీయాలు సొంత పార్టీ లోనే కుంపట్లు పెడు తున్నాయి. బెదిరింపులు, హెచ్చరింపులతోపాటు.. సొమ్ములు కూడా పోగేసుకుంటున్నారన్న ఆరోపణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వీరిని కంట్రోల్ చేయకపోతే.. వ్యక్తిగతంగానే కాకుండా.. పార్టీ పరంగా కూడా నష్టమే. ఇక, కర్నూలు, అనంతపురంలో రోజుకో రకంగా.. నాయకులు రెచ్చిపోతున్నారు. అధికారులనే బెదిరిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిపై వాడు వీడు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక, అనంతపురంలో అయితే.. మరింత ఎక్కువగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఓ మాజీ ఎంపీ.. నేరుగా కలెక్టర్‌కే వార్నింగ్ ఇచ్చారు. మరో ఎమ్మెల్యే స్వయంగా కలెక్టర్ ఆఫీసులోనే తిష్టవేశారు. ఇవన్నీ.. ప్రత్యర్థుల నుంచో లేక, సర్కారు వ్యతిరేక మీడియాలోనో రావడం లేదు. చంద్రబాబును సమర్ధించే మీడియాలోనే పుంఖాను పుంఖాలుగా వస్తున్న కథనాలు. కానీ. చంద్రబాబు మాత్రం ఒకవైపు మాత్రమే చూస్తున్నారు. దీనిని సరిచేసుకునే ప్రయత్నం చేసి.. ముందు ఇంట్లో చెత్త ఏరేస్తే.. తర్వాత.. బయట పార్టీల పనిపట్టవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
