పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... క్రిస్మస్ కానుక విడుదల!
అవును... విజయవాడలోని ఏ ప్లస్ కన్వెషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
By: Raja Ch | 23 Dec 2025 1:42 PM ISTప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మొదలైన వేళ.. ఆంధ్రప్రదేశ్ లోని పాస్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... క్రైస్తవుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఉపాధి, ఆర్థిక సాధికారత విషయంలో అండగా ఉంటుందని.. వారి భద్రతకు, గౌరవానికి ఎలాంటి భంగం కలగనివ్వదని చెబుతూ.. వారి కోసం ఉపాధి పథకాలను పునఃప్రారంభించినట్లు చంద్రబాబు తెలిపారు.
అవును... విజయవాడలోని ఏ ప్లస్ కన్వెషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, క్యాండిల్ వెలిగించి, ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకం అని అన్నారు.
ఈ నేపథ్యంలోనే... క్రైస్తవ సమాజం కోసం రూ.22 కోట్లు ఖర్చు చేసి 44,812 మంది క్రైస్తవ సోదర సోదరీమణులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చామని.. రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇదే క్రమంలో.. జెరుసలేం యాత్రకు వెళ్లే క్రైస్తవులకు.. 3 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి రూ.60,000 అందిస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా.. రూ.3 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి రూ.30,000 ఇస్తున్నామని.. మొత్తంగా దీనికోసం ఈ ఏడాది రూ.1.50 కోట్లు కేటాయించామని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో.. మే 2024 నుంచి నవంబర్ 2024 వరకూ మొత్తం రూ.30 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని.. డిసెంబర్ 2024 - నవంబర్ 2025 వరకూ రూ.51 కోట్ల సాయాన్ని ఈ నెల 24 లోపు వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
ఇదే సమయంలో 2014 - 18 మంధ్య తమ హయాంలో 977 చర్చిలకు రూ.70 కొత్లు మంజూరు చేశామని చెప్పిన చంద్రబాబు.. వీటిలో 377 చర్చ్ ల నిర్మాణం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా.. సమాజ సేవలో క్రైస్తవ సంస్థలు ముందున్నాయని.. క్రీస్టియన్ స్కూల్స్, కాలేజీలు, ఆసుపత్రులు దశాబ్ధాలుగా చేస్తున్న సేవలు వలకట్ట లేనివని.. లక్షల మంది జీవితాల్లో ఎంతో మార్పు తెస్తున్నాయని చంద్రబాబు కొనియాడారు!
ఇదే క్రమంలో... క్రమశిక్షణ, సేవ, నాలెడ్జ్ కు మిషనరీ విద్యా సంస్థలు కేంద్రాలుగా ఉన్నాయని.. ఎన్టీఆర్ కూడా మిషనరీ కాలేజీలోనే చదువుకున్నారని చంద్రబాబు తెలిపారు. గుంటూరు ఆంధ్ర క్రీస్టియన్ కాలేజ్, ఆంధ్ర లయోలా కాలేజ్ వంటి క్రీస్టియన్ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నతికి సేవ చేశాయని ఈ సందర్భగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
