Begin typing your search above and press return to search.

చంద్రబాబు ప్రయోగం వికటించిందా? కేబినెట్లో అనుభవ రాహిత్యంతోనే సమస్యలా?

ఏడాది కిందట 4.O ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్లో కొత్తవారిని తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   10 July 2025 4:43 PM IST
చంద్రబాబు ప్రయోగం వికటించిందా? కేబినెట్లో అనుభవ రాహిత్యంతోనే సమస్యలా?
X

ఏడాది కిందట 4.O ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్లో కొత్తవారిని తీసుకున్నారు. పాలనలో యువతకు భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో సీనియర్లను పక్కన పెట్టారు. కొత్తగా అవకాశం దక్కించుకున్న మంత్రులు తనతో పోటీ పడి పనిచేస్తే రాష్ట్రాన్ని గాడిన పెట్టడంతోపాటు భవిష్యత్తులో తన కుమారుడు లోకేశ్ కు బాధ్యతలు బదిలీ చేసే సమయంలో అనుభవమున్న టీమును అప్పగించొచ్చని భావించారు. దీంతో 24 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సుమారు 18 మందికి తొలిసారి మంత్రిగా నియమించారు.

అయితే తొలిసారి మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న 18 మందిలో 90 శాతం మంది అంచనాలకు తగినట్లు పనిచేయడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సీనియర్లలో మంత్రి నారాయణతోపాటు ఒకరిద్దరు బాగానే పనిచేస్తున్నప్పటికీ కొత్తగా మంత్రి పదవులు తీసుకున్నవారే ఏడాది అయినా కుదురుకోవడం లేదని, జిల్లా రాజకీయాలపై పట్టు సాధించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రలో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం ఇచ్చినా, ఆ ఇద్దరు ప్రతిపక్షాన్ని సమర్థంగా అడ్డుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స హవా ఇప్పటికీ నడుస్తున్నట్లు వార్తలు రావడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నారు.

అదేవిధంగా విశాఖ జిల్లాలో సీనియర్లను కాదని మంత్రి అనితకు బాధ్యతలు అప్పగిస్తే, ఆమె పనితీరు కూడా ఆశించిన స్థాయిలో ఉండటం లేదని సీఎం భావిస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా సింహాచలం చందనోత్సవం సమయంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. పార్టీపరంగా విశాఖ చాలా కీలకమని అటువంటి చోట మంత్రి అనిత మరింత దూకుడు చూపించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆమె ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోవడానికి పార్టీ పరంగా కొన్ని అవాంతరాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అనిత కన్నా సీనియర్లు ఎమ్మెల్యేలుగా ఉండటంతో మంత్రి ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోతున్నారని అంటున్నారు.

ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూడా సీనియర్లను పక్కనపెట్టి తొలిసారి గెలిచిన సుభాష్ కు మంత్రి పదవిని కట్టబెట్టారు. అయితే ఆయన కూడా ఇతర నేతలను సమన్వయం చేయలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు ఓ సారి మంత్రి పనితీరు సరిగా లేదని మందలించినట్లు ఆడియో వైరల్ అయింది. ఇక అప్పటి నుంచి సుభాష్ ను ఏ క్షణమైనా తప్పిస్తారని ప్రచారం ఊపందుకుంది. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ తరఫున నిమ్మల రామానాయుడు ఒక్కరే మంత్రిగా ఉన్నారు. ఈ జిల్లాలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, సీనియర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వంటివారు పార్టీ పరంగా జోరు చూపిస్తున్నారు. అయితే ఏలూరు వంటి నియోజకవర్గాల్లో పార్టీని సమన్వయంతో నడిపించలేకపోతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఇక కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో అనుభవజ్ఞులైన కొల్లు రవీంద్ర, పార్థసారథి మంత్రులుగా ఉన్నప్పటికీ ప్రతిపక్షానికి చెందిన పేర్ని నానిని కంట్రోల్ చేయలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా, ఇద్దరూ కొత్త కావడం వల్ల చిన్నపాటి సమస్యలు ఉన్నా ఆ ఇద్దరిపై సీఎం చంద్రబాబుకు మంచి అభిప్రాయమే ఉందని అంటున్నారు. ఇక రాయలసీమకు వచ్చేసరికి కడప, అనంతపురం జిల్లాల్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఇందులో ఒకరు బీజేపీ నేత సత్యకుమార్ కాగా, మిగిలిన టీడీపీకి చెందిన మంత్రులు సవిత, రాంప్రసాద్ రెడ్డి. ఈ ఇద్దరి పనితీరుపైనా సీఎం ఏమంత సంతృప్తిగా లేరని అంటున్నారు.

కొత్తగా అవకాశం దక్కించుకున్న మంత్రుల్లో చాలా మంది బ్యూరోక్రాట్లుగా పనిచేస్తున్నారని, తాము రాజకీయ నాయకులమని పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన ఉండటం లేదని పార్టీలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్యూటీలకు వచ్చినట్లు పార్టీ కార్యాలయంలోనో, తమ క్యాంపు కార్యాలయంలోనో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుని చేతులు దులుపుకుంటున్న వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. తమకు అందిన అర్జీలను పరిష్కరించారా? లేదా? అని ఫాలో అప్ చేయడం లేదని, ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతా యాంత్రికంగా పనిచేస్తున్నారు కానీ, రాజకీయంగా ఉత్సాహంగా ఉండటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి చెందుతున్నారని అంటున్నారు.

రాజకీయ ఎత్తుగడలు వేయకుండా, ప్రత్యర్థులపై పైచేయి సాధించకుండా ఎల్లకాలం పదవుల్లో ఉంటామను కోవడం కరెక్టు కాదన్న ఆలోచనతో మంత్రి మండలిని పునర్వవ్యస్థీకరించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు మార్పులు ఉండకపోయినా, కొద్ది నెలల్లో తన జట్టును సమూలంగా మార్చాలన్న నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీంతో కొత్త మంత్రులుగా మళ్లీ సీనియర్లకు అవకాశాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.