కేబినెట్ మీటింగ్ వేళ పవన్ కు మళ్లీ ఏమైంది?
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది.
By: Tupaki Desk | 15 April 2025 3:13 PM ISTరాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీ అమరావతి నిర్మాణ నిధుల సమీకరణ కోసం సీఆర్డీఏ కమిషనర్ కు కేబినెట్ అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ సంగతి అలా ఉంటే... ఈ కేబినెట్ భేటీకి హాజరైన పవన్ కల్యాణ్.. అస్వస్థత కారణంగా అక్కడ నుంచి వెళ్లిపోయారు!
అవును... ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో సీఆర్దీఏ 46వ అథారిటీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ సమయంలో రాజధాని పరిధిలోని 92 పనులకుగానూ సుమారు రూ.65 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు తెలుస్తోంది.
మరోపక్క ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కేబినెట్ భేటీ కోసం సచివాలయానికి వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సమావేశం ప్రారంభమయ్యే లోపే అక్కడనుంచి వెళ్లిపోయారు! దీనికి కారణం ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడమే అని తెలుస్తోంది. దీంతో.. ఆయన సచివాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారని సమాచారాం!
కాగా... ఫిబ్రవరి 6న జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ పవన్ కల్యాణ్ పాల్గొనలేకపోయిన సంగతి తెలిసిందే. నాడు పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడ్డారు. అదే సమయంలో.. జ్వరంతోపాటు స్పాండిలైటిస్ తో కూడా పవన్ బాధపడుతున్నారని.. వీటి మూలంగా క్యాబినెట్ సమావేశానికి హాజరుకాలేకపోవచ్చని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నాడు వెల్లడించింది.
రూ.60 కోట్లతో 15,000 పశువుల నీటి తొట్టెల నిర్మాణం!:
మరోపక్క పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా, రైతాంగానికి భరోసా కల్పించేలా ఇప్పటికే నిర్మించిన గోకులాలకు కొనసాగింపుగా, మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు.. ప్రస్తుత వేసవి కాలంలో నీటి కొరతను నివారించేందుకు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుందని ఏపీ డిప్యూటీ సీఎంఓ వెల్లడించింది.
ఇందులో భాగంగా... ప్రధానమంత్రి మోడీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రూ.60 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 15,000 పశువుల నీటి తొట్టెల నిర్మాణాన్ని ఏప్రిల్ నెలాఖరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పంచాయతీకి కనీసం ఒక్క నీటి తొట్టె ఏర్పాటు చేయబడుతోందని తెలిపింది.
ఇది మూగజీవాలకు తాగునీటి అందుబాటును కల్పించడమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందని.. పశుపోషణ, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధికి దోహదపడే ఈ కార్యక్రమం సమగ్రమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎంవో కార్యాలయం వెల్లడించింది.