మన్యం జిల్లాలో రిమోట్ ఏరియాకు బాబు
ఏపీ సీఎం చంద్రబాబు తిరగని ప్రాంతం లేదు, ఆయన అధికారంలో నాలుగు సార్లు ఉన్నారు. విపక్షంలో కూడా ఉన్నారు.
By: Satya P | 2 Dec 2025 9:26 AM ISTఏపీ సీఎం చంద్రబాబు తిరగని ప్రాంతం లేదు, ఆయన అధికారంలో నాలుగు సార్లు ఉన్నారు. విపక్షంలో కూడా ఉన్నారు. ఆయన ఏ హోదాలో ఉన్నా ఏపీలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణిస్తూనే ఉంటారు. ఆయన పర్యటన లేని రోజు ఉండదు, ఆయన జనంలో ఉండే నేతగా అందుకే పేరు పొందారు. నిరంతరం ఆయన పరిశ్రమించడం వల్లనే లాంగ్ పొలిటికల్ కెరీర్ ని కొనసాగిస్తున్నారు అని చెబుతారు. ఇక చంద్రబాబు ఒక్కో జిల్లాను కనీసంగా పది నుంచి పాతిక సార్లు తిరిగి ఉంటారు. ఇక మండలాలు గ్రామాల్లో కూడా ఆయన తిరగని చోటు దాదాపుగా ఉండదు. అయితే మరీ రిమోట్ ఏరియాలకు ఆయన గతంలో కొన్ని వెళ్ళారు, ఇపుడు కూడా మరోసారి అదే విధంగా టూర్ పెట్టుకున్నారు.
అక్కడ మెగా ఈవెంట్ :
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 5వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో పర్యటించనున్నారు. భామిని ఆదర్శ పాఠశాల వేదికగా ఏర్పాటు చేస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ మెగా ఈవెంట్ ని చాలా గొప్పగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నం అయింది. సీఎం పర్యటన ఏర్పాట్లతో పాటు ఆయన పాల్గొనే సభాస్థలిని హెలిప్యాడ్ పార్కింగ్ స్థలాలను అధికారులు పరిశీలించడమే కాకుండా ఎటువంటి భద్రతా లోపాలు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
గతంలో వేరే పరిస్థితి :
మన్యం జిల్లాలో గతంలో మారు మూల ప్రాంతాలకు వెళ్ళడానికి కొంత ఇబ్బంది ఉండేది. మావోల ప్రభావం అధికంగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో వారి ప్రభావం బాగా తగ్గింది. దాంతో నాయకులు చాలా మంది వెళ్ళగలుగుతున్నారు. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారు ఇలా రిమోట్ ఏరియాలను ఎంచుకుని కార్యక్రమాలను నిర్వహించడం మాత్రం కొంత ఆసక్తిగా విశేషంగా ఉంది. అయితే చంద్రబాబు ఏపీలో ప్రతీ ఇంటి గడపకూ వెళ్ళాలని పట్టుదల చూపిస్తూంటారు. అందులో భాగంగానే ఆయన అనేక చోట్లకు వెళ్ళగలుతున్నారు. ఈ విషయంలో ఆయన ప్రత్యేకంగా ఉంటారని అంటారు. అందుకే ఈ మెగా ఈవెంట్ కి రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు.
అభివృద్ధిలో భామిని :
గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా భామిని మండలం ఇపుడు ప్రగతి బాటన నడుస్తోంది. భామిని మండలం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. ఈ మండలంలో మొత్తం ఇరవై రెండు గ్రామాలు ఉన్నాయి. అయితే ఈ గ్రామంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పధకాలు విజయన్వంతంగా అమలు అవుతున్నాయి. వంద శాతం సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీని సాధించడం గొప్ప విషయంగా చెబుతున్నారు. అలాగే దేశంలోని ఆకాంక్షాత్మక బ్లాక్‌లలో ఒకటిగా భామిని ఎంపిక కావడంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాల రూపకల్పనతో ఈ ప్రాంతం ఆరోగ్యంలో కూడా గణనీయమైన పురోగతిని సాధించింది అని అధికారులు చెబుతున్నారు. గతంలో క్షయ పీడిత ప్రాంతంగా ఉన్న ఈ మండలంలోని అనేక గ్రామాలు టిబి రహితంగా ఈ రోజు ప్రకటించబడ్డాయి అంటే అభివృద్ధి సాధించినట్లే అని అంటున్నారు.
