Begin typing your search above and press return to search.

పంచుకుందాం రా అంటున్న బాబు...తెలంగాణాకు ఓకేనా ?

తాజాగా ఆయన శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలాశయం గేట్లను ఎత్తి నాగార్జునసాగర్ కి నీటిని విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   9 July 2025 9:00 AM IST
పంచుకుందాం రా అంటున్న బాబు...తెలంగాణాకు ఓకేనా ?
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మాత్రమే రెండు రాష్ట్రాల మీద మాట్లాడే హక్కు అర్హత ఉన్నాయని టీడీపీ వారు అంటారు. దానికి ఒక కారణం టీడీపీ రెండు రాష్ట్రాలలో ఉంది. అంతే కాదు చంద్రబాబు ఏకంగా తొమ్మిదేళ్ళ పాటు సీఎం గా పనిచేశారు. టీడీపీ చేసిన కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ తెలంగాణాలో ఈ రోజుకీ ఉందని బాబు సహా తమ్ముళు అంతా నమ్ముతున్నారు.

ఇదిలా ఉంటే ఏపీకి చంద్రబాబు నాలుగవసారి సీఎం అయ్యారు. తెలంగాణాలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున సీఎం గా ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యన వ్యక్తిగతంగా మంచి అనుబంధమే ఉంది. పేచీలు లేకుండా రెండు రాష్ట్రాలూ ఎదిగేందుకు ఆస్కారం ఉంది అని కూడా అంతా అనుకున్నారు. అయితే తెలంగాణాలో చూస్తే సెంటిమెంట్ ముందు పెట్టి రచ్చ చేస్తున్నారన్నది ఉంది.

ఇక ఏపీలో చూస్తే గోదావరి నది నీటిని క్రిష్ణా మీదుగా పెన్నా దాకా తీసుకెళ్ళి మొత్తం ఏపీని సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు తలపోస్తున్నారు. అంతే కాదు పోలవరం బనకచర్ల అని ఒక భారీ పధకాన్ని ఆయన తలకెత్తుకున్నారు. ఏకంగా 81 వేల కోట్ల అతి భారీ ప్రాజెక్టుగా ఇది ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు బనకచర్ల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు.

దీని వల్ల ఎవరికీ నష్టం లేదు లాభమే అని చెబుతున్నారు. తాజాగా ఆయన శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలాశయం గేట్లను ఎత్తి నాగార్జునసాగర్ కి నీటిని విడుదల చేశారు. అనంతరం జరిగిన సభలో బాబు మాట్లాడుతూ నదులు అనుసంధానం తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. వంశధార, పోలవరం, బనకచర్ల అనుసంధానం కావాలని కోరారు. నీటిని సమర్థంగా వాడుకోవాల్సి ఉందని చెప్పారు. సముద్రంలో కలిసే నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే రైతులకు మేలు జరుగుతుందని చంద్రబాబునాయుడు పేర్కొనడం విశేషం.

వరద నీరు పెద్ద ఎత్తున సముద్రంలో కలుస్తోందని అందువల్ల రెండు రాష్ట్రాలు ఆ నీటిని వాడుకోవాలని ఆయన సూచిస్తున్నారు. అయితే ఎగువ రాష్ట్రం అయిన తెలంగాణా వాదన వేరే విధంగా ఉంది. గోదావరి జలాలను మిగులు జనాలు వరద జలాలుగా ఎవరు లెక్కిస్తారు అని ప్రశ్నిస్తోంది. నికర జలాలకు అయితే ఒక కొలమానం ఉంది కానీ మిగులు జనాలు వరద జలాల లెక్క తేల్చాసి ఉందని చెబుతోంది.

పైగా ఎగువన ఉన్న తాము ప్రాజెక్టులు కట్టి నీటిని తమ వాటా కింద వచ్చినవి వాడుకుంటే మిగులు జలాల ఊసే రాదు వరదలు అన్నవి కూడా మబ్బులో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోవడం లాంటిదని అంటోంది దాంతో వరద జలాల మీద ఆశలు పెద్దగా పెట్టుకోవద్దు అని స్పష్టం చేస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం వరద నీరు వృధాగా పోనీయవద్దు అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండూ పంచుకుంటే పదిలంగా ఉంటుందని హిత బోధ చేస్తున్నారు. మరి తెలంగాణాకు ఈ ప్రతిపాదనలు ఓకేనా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి బనకచర్ల మీద బాబుకు ఉన్న అభిమానం విశ్వాసం ఏ విధంగా ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకుని వెళ్తాయో