Begin typing your search above and press return to search.

బాబు జాక్ పాట్ కొట్టేస్తున్నారు !

అంతే కాదు ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోడీ బాబుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Jun 2025 1:00 PM IST
బాబు జాక్ పాట్ కొట్టేస్తున్నారు !
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్నీ అలా కలిసి వస్తునాయి. ఆయన 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అత్యధిక సీట్లను గెలవడంతో మొదలైన రాజకీయ అదృష్ట జాతకం అలా కొనసాగుతోంది అని అంటున్నారు. కేంద్రంలో టీడీపీ మద్దతుతోనే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడడం బాబుకు ఎంతో సానుకూల అంశంగా ఉంది.

అంతే కాదు ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోడీ బాబుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. బాబు ఏది అనుకుంటే అది జరుగుతోంది. అమరావతి పోలవరం సహా అనేక కీలక ప్రాజెక్టుల విషయంలో కేంద్రం ఏపీకి ఎంతో తోడ్పాటు అందిస్తోంది. అలా బాబు ఏపీలో అభివృద్ధి కాముకుడిగా ఏపీ పునర్నిర్మాణ ప్రదాతగా మారేందుకు కేంద్రం ఇతోధికంగా సహకారం అందిస్తోంది.

ఇదిలా ఉంటే బాబు చూపు అంతా 2029 ఎన్నికల మీదనే ఉంది అని అంటున్నారు. ఆ ఎన్నికలను కూడా గెలిచేస్తే వైసీపీతో అసలు పేచీ పూచీ ఉండదని ఏపీలో టీడీపీ వన్ సైడ్ గా దూసుకుపోతుందని బాబు నమ్ముతున్నారు. దానికి తగినట్లుగా ఆయన చేయాల్సినవి చేస్తున్నారు. వేయాల్సిన ఎత్తులు పన్నాల్సిన వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు.

ఇపుడు బాబుకు మరింత కలిసి వచ్చేలా మరో అంశం ముందుకు వస్తోంది. అదే గత పుష్కర కాలంగా ఊరిస్తున్న ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపు. ఏకంగా యాభై సీట్ల దాకా పెంచుతారు అని అంటున్నారు. నిజానికి విభజన చట్టంలోనే ఏపీకి ప్రస్తుతం ఉన్న 175 సీట్లను 225గా చేయాలని తెలంగాణాలో ఉన్న 119 సీట్లను 154గా చేయాలని ఉంది. అయితే ఆ విభజన హామీ అయితే అమలుకు నోచుకోలేదు.

బాబు తొలిసారి సీఎం అయిన 2014 నుంచి 2019 మధ్యలో కూడా సీట్ల పెంపు మీద గట్టిగానే ఒత్తిడి పెట్టారు. కానీ అది అసలు జరగలేదు. ఇక జగన్ హయాంలో జరుగుతుందని అనుకున్నా అదీ వీలు పడలేదు. ఇపుడు ఆ సువర్ణ అవకాశం బాబుకే వస్తోంది. దాని ఫలాలు బాబుకే దక్కనున్నాయి.

అధికారంలో ఉండగా సీట్ల పెంపుదల అంటే అది కచ్చితంగా కూటమి పార్టీలకే మేలుగా ఉంటుంది అని అంటున్నారు ఆ విధంగా అసెంబ్లీ సీట్ల పునర్ విభజన చేసుకునే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఏపీలో చూస్తే మూడు పార్టీలు కూటమిలో ఉన్నాయి. ఈ మూడు పార్టీలు అధికారంలో వాటాదారులుగా ఉన్నాయి. ఆశావహులు చాలా మంది ఉన్నారు.

వారంతా 2024 ఎన్నికల్లో త్యాగపురుషులు అయిపోయారు ఇక మరో యాభై సీట్లు పెరిగితే కనుక కచ్చితంగా వీరిలో అనేక మందికి అవకాశాలు దక్కుతాయి. అలా పార్టీలో ఉన్న వారిని న్యాయం చేయడం ద్వారా మరోసారి అధికారంలోకి వచ్చే వీలుంది. దాంతో ఇది బాబుకు శుభవార్తగానే చెబుతున్నారు.

జనాభా గణన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయింది. 2027 మార్చి ఫస్ట్ కొలమానంగా జనాభా గణన జరుగుతుంది. ఇది కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనకు వెళ్తుంది. పెరిగిన జనాభా గణనను పరిగణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా అసెంబ్లీలకు పార్లమెంట్ కి కూడా సీట్లను పెంచే ప్రక్రియను 2027 ద్వితీయార్ధంలో ఈసీ చేపడుతుంది అని అంటున్నారు.

దాంతో ఏపీలో మరో యాభై సీట్లు పెరగబోతున్నాయి. వీలుంటో మరిన్ని సీట్లు అదనంగా పెంచుకునేందుకు కూడా టీడీపీ కూటమి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వినతి చేసే అవకాశం ఉంది. ఈ విధంగా 2029లో పక్కాగా గెలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న బాబుకు ఈ సీట్ల పెంపు వర్జాయుధంగా మారుతుంది అని అంటున్నారు.