Begin typing your search above and press return to search.

బాబుకు మొదట గుర్తొచ్చె మంత్రి ఆయనేనట !

చంద్రబాబు పనిమంతుడు. ఆ విషయంలో ఆయనను ప్రత్యర్ధులు సైతం విమర్శించలేరు.

By:  Satya P   |   5 Oct 2026 9:03 AM IST
బాబుకు మొదట గుర్తొచ్చె మంత్రి ఆయనేనట !
X

చంద్రబాబు పనిమంతుడు. ఆ విషయంలో ఆయనను ప్రత్యర్ధులు సైతం విమర్శించలేరు. రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే అందులో పద్దెనిమిది గంటల దాకా కష్టపడడం బాబు నైజం. ఆయన్ని అందుకే చాలా మంది పని రాక్షసుడు అని కూడా అంటారు. తాను పనిచేస్తూ ఎదుటి వారిని కూడా చేయించడం బాబు నాయకత్వ లక్షణం. ఆయన ఆ విధంగా దిశా నిర్దేశం చేస్తారు. ఇక చంద్రబాబు విషయం తీసుకుంటే ఎంత బాగా కష్టపడినా కూడా ఆయన నుంచి అంత సులువుగా కాంప్లిమెంట్ రాదు అని కూడా అంటారు. అంటే బాబు బెంచ్ మార్క్ ని అందుకోవడం ఎంతటి పని రాక్షసుడికి అయినా చాలా కష్టం అనే చెప్పాల్సి ఉంది. అయితే బాబు మెచ్చిన నాయకులు కూడా ఉన్నారు. అలా కనుక ఆయన ఎవరికి అయినా కితాబు ఇస్తే కనుక వారికి ఇక తిరుగు ఉండదనే అంటారు. ఎందుకంటే బాబు మెచ్చుకోలు పొందిన వారు ఎంత కష్టించి పనిచేస్తారో అన్నది సులువుగానే అర్ధం చేసుకోవచ్చు.

మంత్రులకు క్లాస్ :

ఇక చంద్రబాబు కేబినెట్ మీటింగ్ పెట్టినప్పుడల్లా పలువురు మంత్రులకు క్లాస్ తీసుకుంటున్నారు అని ప్రచారం అయితే వస్తూంటుంది. అది క్లాస్ నా లేక ఆయన ఇచ్చే సలహా సూచనలా అన్నది పక్కన పెడితే మంత్రులకు నాయకుడిగా ప్రభుత్వ పెద్దగా బాబు ఇచ్చే సలహాలు ఎపుడూ ఉపయోగపడతాయనే చాలా మంది అంటారు. ఇక బాబు చెప్పిన తీరుగా పనిచేస్తూ మెప్పు పొందే వారు కేబినెట్ లో ఉన్నారా అంటే ర్యాంకులు కూడా ఆయన ప్రకటిస్తూ ఉంటారు. అలా మంచి ర్యాంకులు వచిన వారు అంతా తమ శాఖలలో బాగా పనిచేస్తున్నారు అనే చెప్పుకోవాలి. మరి ఇవన్నీ పక్కన పెడితే బాబు నేరుగా మెచ్చుకునేది కానీ శభాష్ అంటూ ఓపెన్ గా చెప్పినది కానీ ఏ మంత్రి విషయంలో అయినా ఉందా అంటే ఉంది. కొందరు మంత్రుల విషయంలో ఆయన ఓపెన్ గానే బాగా చేస్తున్నారు అని అంటారు.

బెస్ట్ మినిస్టర్ గా :

అలా లేటెస్ట్ గా చూస్తే జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ కి చంద్రబాబు కితాబు ఇచ్చారు. బెస్ట్ మినిస్టర్ అంటూ సభలోనే జనం ముందే పొగిడారు. సమర్ధవంతంగా పనిచేస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అని బాబు చెప్పడం విశేషం. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో చంద్రబాబు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి నిర్వహించిన ఒక కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఇక సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాదెండ్ల మనోహర్ పనితీరుని మెచ్చుకున్నారు. తనకు కేబినెట్‌లో మొదట గుర్తొచ్చే మంత్రి ఎవరూ అంటే నాదెండ్ల మనోహర్ అని చెప్పేశారు.

సమర్ధుడు అంటూ :

ఏపీలో ఎక్కడైనా నిత్యావసరాల ధరలు కొంచెం పెరిగితే చాలు నాదెండ్ల వెంటనే తనకు ఒక చీటీ పంపించి పరిస్థితి వివరిస్తారని చంద్రబాబు చెప్పారు. తమ మంత్రిత్వ శాఖలో ధరలను నియంత్రణలో ఉంచడానికి తాము ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నామని నాదెండ్ల చెబుతారని బాబు వెల్లడించారు. అలా పేద ప్రజలపై ధరల భారం పడకుండా అనునిత్యం పనిచేస్తున్న అత్యంత సమర్థవంతమైన మంత్రి మనోహర్ అని బాబు ప్రశంసించారు. ఆయన నియోజకవర్గం తెనాలిలో మంచి కార్యక్రమం జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి పనితీరు కూటమి ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూరుస్తోందని బాబు అన్నారు.

ఆయన పొలిటికల్ హీరో :

ఇక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశీఖర్ గురించి మాట్లాడుతూ ఆయన పొలిటికల్ హీరో అని బాబు కితాబు ఇచ్చారు. అమెరికాలో ఎక్కువ కాలం గడిపిన పెమ్మసారి స్థానిక ప్రజలతో మమేకం కాగలరా అని తాను మొదట్లో అనుమానించానని అయితే ఆయన ఉపన్యాసాలు ప్రజలతో కలిసిపోతున్న తీరు చూస్తూంటే కనుక చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఒక సామాన్యుడిలా ప్రజలలో ఒకరిగా మారిపోయిన పెమ్మసాని పనితీరు చాలా బాగుంది అని బాబు కొనియాడారు. ఇలా ఇద్దరు మంత్రులను ఆయన మెచ్చుకోవడం చూస్తే ఆ ఇద్దరూ ఎంతగా కష్టపడుతున్నారో అర్ధం అవుతోంది అంటున్నారు.