Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాలు రెండేనా? ప్రభుత్వ ఆలోచన ఏంటి?

గత ప్రభుత్వంలో జిల్లాలను అశాస్త్రీయంగా విభజించారని ఫిర్యాదులు రావడంతో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడుగురు మంత్రుల బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   29 Oct 2025 12:01 PM IST
కొత్త జిల్లాలు రెండేనా? ప్రభుత్వ ఆలోచన ఏంటి?
X

ఏపీలో జిల్లాల పునర్వ్యస్థీకరణపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. గత ప్రభుత్వంలో జిల్లాలను అశాస్త్రీయంగా విభజించారని ఫిర్యాదులు రావడంతో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడుగురు మంత్రుల బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మంగళవారం సమీక్షించిన సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. ఈ రోజు కూడా సచివాలయంలో ఇదే విషయమై మరోమారు భేటీ కానున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను విభజించి జిల్లాల సంఖ్యను 32కు పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ప్రభుత్వ వైఖరి మారిందని కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రస్తుతం ఉన్న జిల్లాల సరిహద్దులు మార్చడానికే పరిమితమవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని 13 జిల్లాలను విభజించి 26 జిల్లాలు చేశారు. పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా చేసుకుని జిల్లాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా, అరకు నియోజకవర్గాన్ని రెండుగా విభజించడంతో జిల్లాల సంఖ్య 26 అయింది. అయితే పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోవడంతో కొన్ని పరిపాలన సమస్యలు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. అల్లూరి జిల్లా పరిధిలో ఉన్న రంపచోడవరం నియోజకవర్గానికి సమీపంలో రాజమహేంద్రవరం ఉంది. కానీ, రంపచోడవరాన్ని పాడేరు కేంద్రంగా ఉన్న అల్లూరి జిల్లాలో కలపడంతో ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. అదేవిధంగా రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న చింతూరు, పోలవరం ప్రాంతాలు జిల్లా కేంద్రాలకు వెళ్లడం కన్నా, రాష్ట్ర రాజధానికి చేరుకోవడమే తేలికగా ఉంటోంది. దీంతో ఈ ప్రాంతాలను వేరే జిల్లాలో కలపాలని ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఇదేవిధంగా చాలా జిల్లాల్లో మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కొత్తగా మదనపల్లె, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని అంటున్నారు. మార్కాపురం జిల్లా ఆ ప్రాంతీయుల చిరకాల కోరికగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రస్తావించడంతో ఆ జిల్లా ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు రెవన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయని కూడా చెబుతున్నారు. పుంగనూరు లేదా పీలేరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంతోపాటు అద్దంకి, గిద్దలూరు, మడకశిరలను కూడా రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

మరోవైపు ప్రస్తుతం ఉన్న 10 రెవెన్యూ డివిజన్లలో కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేట పట్టణానికి మార్చాలని ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి, నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని ప్రతిపాదనలను వచ్చినట్లు చెబుతున్నారు. అదేసమయంలో ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును తిరిగి నెల్లూరులో విలీనం చేస్తారని చెబుతున్నారు.