డిసెంబరులో కీలక మార్పులు.. రాయలసీమ నుంచి కొత్త మంత్రులు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఏపీ కేబినెట్ పునర్వ్యస్థీకరణ ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది.
By: Tupaki Desk | 2 Nov 2026 7:25 PM ISTస్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఏపీ కేబినెట్ పునర్వ్యస్థీకరణ ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. ప్రధానమైన మున్సిపల్ ఎన్నికలు ముగియడం, రెండు రోజుల్లో జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు కూడా పూర్తికానున్నాయి. అదేవిధంగా ఈ నెల 26, 28 తేదీలతోపాటు డిసెంబరు 2న మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రహసనం ముగియనుంది. ఇక 2029 ఎన్నికలే టార్గెట్ గా ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయ్యారని అంటున్నారు. డిసెంబరు 2న పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించాలని సీఎం భావిస్తున్నారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
2024 జూన్ లో రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే డిసెంబరుతో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంటారు. ఇంకా రెండున్నరేళ్ల పాలన మిగిలివున్నప్పటికీ చివరి సంవత్సరం పూర్తిగా ఎన్నికలకే అంకితం చేయాల్సివుంటుందని అంటున్నారు. అంటే ఇంకా గట్టిగా ఏడాదిన్నర మాత్రమే ప్రభుత్వం పూర్తిస్థాయిలో పనిచేయనుందని, ఈ కారణంగా గత రెండున్నరేళ్ల పాలనను పునః సమీక్షించుకోవడంతోపాటు లోపాలను సరిదిద్దుకునేందుకు వచ్చే ఏడాదిన్నర కాలం వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఒకవైపు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు తమ బాధ్యతలను ఎలా నిర్వహిస్తున్నారో కూడా పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కూటమి పార్టీలలో చాలా మంది మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఇందులో కొందరికి తొలివిడతలో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి త్వరలో విస్తరణ చేపట్టి ఎన్నికల జట్టును సిద్ధం చేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్నవారిలో కొందరిని తప్పించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారనే ప్రచారం హీట్ ఎక్కిస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షం వైసీపీకి గట్టి పునాదులు ఉన్న రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. రాయలసీమలో ప్రస్తుతం ఏడుగురు మంత్రులు ఉండగా, ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని, వారితో ఎన్నికలకు వెళితే పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదని సీఎం భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు సొంత నియోజకవర్గం, జిల్లాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో చాలా మంది కొత్తవారికి అవకాశం ఇవ్వడం కూడా ఈ పరిస్థితికి కారణంగా సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో త్వరలో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో అనువజ్ఞులను తీసుకోవాలన్న ప్రతిపాదనను సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో వైసీపీని కంట్రోల్ చేసే నాయకుల కోసం సీఎం అన్వేషిస్తున్నారని చెబుతున్నారు.
స్థానిక ఎన్నికల ఫలితాలను చూసి మంత్రులు, కొత్తగా మంత్రి పదవులు ఇచ్చే నేతలపై ఒక అవగాహనకు రావాలని సీఎం భావిస్తున్నారని అంటున్నారు. తమ జిల్లాలతోపాటు ఇంచార్జులుగా వ్యవహరిస్తున్న జిల్లాల్లో ఫలితాలను బేరీజు వేసి మంత్రుల పనితీరుపై అంచనాకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అదేసమయంలో ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా వ్యూహరచన చేసిన నేతల సామర్థాన్ని పరిశీలనకు తీసుకోవాలని, అటువంటి వారికి సముచిత గౌరవం కల్పించాలని సీఎం ఆలోచిస్తున్నారని అంటున్నారు. దీంతో జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా మంత్రులు, ఎమ్మెల్యేలు పోటాపోటీగా పనిచేస్తున్నట్లు టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
