అమరావతిలో ఒలింపిక్స్ @ 2036.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్, మోదీ సపోర్టు?!
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా వేదిక ఒలింపిక్స్. ఈ మెగా టోర్నీపై అంతర్జాతీయ స్థాయిలో ఎంతో క్రేజ్ ఉంటుంది.
By: Tupaki Desk | 28 Aug 2026 10:50 PM ISTప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా వేదిక ఒలింపిక్స్. ఈ మెగా టోర్నీపై అంతర్జాతీయ స్థాయిలో ఎంతో క్రేజ్ ఉంటుంది. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్ మహా క్రీడా సంగ్రామానికి ఆతిథ్యం ఇవ్వడం ఏ దేశానికైనా దక్కే గొప్ప గౌరవంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో 2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని భారత్ గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తోంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) నిబంధనలకు అనుగుణంగా దేశంలో అత్యాధునిక మౌలిక వసతులు, క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా బిడ్ దాఖలు చేసేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ఆతిథ్య హక్కులు దక్కించుకునేలా క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు వివిధ రాష్ట్రాలు సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్నాయి.
దేశం తరఫున జరుగుతున్న ఈ ప్రయత్నాలకు అనుగుణంగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. రాజధాని అమరావతిని ఈ గ్లోబల్ ఈవెంట్‌కు వేదికగా నిలిపడం ద్వారా ఒక గొప్ప అవకాశం దక్కించుకోవాలని ఆయన భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కేంద్రం బిడ్ గెలుచుకుంటే, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహణకు అవసరమైన అన్ని సన్నాహాలు చేపట్టాలని సీఎం అధికారులను ఇప్పటికే సన్నద్ధం చేశారని అంటున్నారు. ఒకప్పుడు రాజధాని లేదనే విమర్శలను ఎదుర్కొన్న ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్స్ వేదికగా ఎదిగేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం ద్వారా అమరావతిని గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నం చేయాలని సీఎం ఆదేశించారని అంటున్నారు.
ఈ లక్ష్య సాధనలో భాగంగానే అమరావతిలో అత్యాధునిక హంగులతో 'స్పోర్ట్స్ సిటీ' నిర్మాణానికి ప్రభుత్వం గతంలోనే కీలక నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో సుమారు 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ మహా క్రీడా నగరాన్ని రూపుదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెబుతున్నారు. ఇందులో ఒలింపిక్స్ ప్రమాణాలకు తగినట్లుగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ స్టేడియంలు, ఆక్వాటిక్స్ కాంప్లెక్స్‌లు, ఇండోర్ స్టేడియాలు, హై-పెర్ఫార్మెన్స్ శిక్షణా కేంద్రాలు, విదేశీ క్రీడాకారులు బస చేయడానికి వీలుగా సకల సౌకర్యాలతో కూడిన ఒలింపిక్ విలేజ్ నిర్మాణాలు ఈ స్పోర్ట్స్ సిటీలో అంతర్భాగంగా ఉండనున్నాయని చెబుతున్నారు. అలాగే, ప్రపంచ దేశాల నుంచి వచ్చే వేలాది మంది అతిథులు మరియు అథ్లెట్ల కోసం అంతర్జాతీయ స్థాయి రవాణా, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు.
రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి అమరావతిని గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రముఖ క్రీడాకారులు, నిపుణులతో తరచూ చర్చిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఒలింపియన్లు, క్రికెట్ దిగ్గజాలు, కోచ్‌లతో సమావేశాలు నిర్వహించి స్పోర్ట్స్ సిటీ బ్లూప్రింట్, స్టేడియాల రూపకల్పనపై వారి సలహాలు తీసుకుంటున్నారు. చిన్న వయస్సు నుంచే ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి వారికి ప్రపంచ స్థాయి శిక్షణ ఇప్పించడం, రాష్ట్రంలో నిరంతరం జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అంటున్నారు. క్రీడల్లో రాణించే యువతకు ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యత, రిజర్వేషన్లు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. మొత్తంగా చూస్తే, 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా అమరావతిని సన్నద్ధం చేయడం కేవలం క్రీడలకు మాత్రమే పరిమితం కాకుండా, రాష్ట్ర అభివృద్ధిని, ఆర్థిక వృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పే సువర్ణావకాశంగా ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా, దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఒక శక్తివంతమైన జాతీయ స్థాయి క్రీడా కేంద్రంగా రూపాంతరం చెందనుందని భావిస్తున్నారు.
