ఏపీ సత్తా.. జగన్ హయాంలో.. చంద్రబాబు హయాంలో తేడా ఇదే ..!
సీఎం చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలు, వేస్తున్న అడుగులు రాష్ట్ర ప్రజల, ప్రభుత్వ సత్తాను ప్రపంచానికి చాటుతున్నాయనే చెప్పాలి.
By: Tupaki Desk | 21 Jun 2025 6:00 AM ISTసీఎం చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలు, వేస్తున్న అడుగులు రాష్ట్ర ప్రజల, ప్రభుత్వ సత్తాను ప్రపంచానికి చాటుతున్నాయనే చెప్పాలి. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో సీఎం కృషి ఎంతో ఉంది. అది ఇంకా పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టకపోయినా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా అమరావతి లో పెట్టుబడులు పెట్టేందుకు, అమరావతిలో సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక కీలక కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
తద్వారా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ను పరిశీలిస్తే ఈ స్థాయిలో ప్రపంచ దేశాల ముందు ఒక తెలుగు రాష్ట్రం గురించి చర్చించే అవకాశం రావడం నిజంగా ప్రజలకు గర్వకారణం అనే చెప్పాలి. 2019 24 మధ్య అమరావతి ఏరకంగా ఇబ్బందులు పడిందో అందరికీ తెలిసిందే. అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో అమరావతిని తొక్కిపెట్టి రైతులను ఇబ్బందులు పాలు చేసి రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా చేశారు. అంతే కాదు రాష్ట్రంలోని రైతులపై కూడా కక్ష కట్టినట్టుగా వ్యవహరించారనే పేరును ఆయన సొంతం చేసుకున్నారు.
వాటికి భిన్నంగా ఏడాది కాలంలో కూటమి పార్టీల ప్రభుత్వ అధినేతగా సీఎం చంద్రబాబు అమరావతి రాజధానిని వడివడిగా ముందుకు నడిపించడంతోపాటు అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. దీంతో మరోసారి చంద్రబాబు హయాంలో ఏపీ ప్రస్తావన ఏపీ ప్రజల గురించి ప్రపంచ దేశాలు చర్చించుకునే లాగా చేశారనడంలో సందేహం లేదు. తాజాగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం దీనికి మరిన్ని రెట్లుగా రాష్ట్ర సత్తాను ప్రజలు ప్రభుత్వ సత్తాను కూడా ప్రపంచ దేశాల ముందు చాటి చెబుతోంది.
దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలతో యోగాసనాలు వేయించాలని తద్వారా రికార్డును నెలకొల్పాలని చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యం అందరికీ తెలిసిందే. అయితే ఈ లక్ష్యం ద్వారా చంద్రబాబు సాధించాలనుకుంటున్న రెండు కీలక విషయాలపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం తద్వారా పెట్టుబడులు వచ్చేలా చేయడం ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం యువతకు అవకాశాలు కల్పించడం అనేవి ఈ లక్ష్యం వెనక కీలక అంశం.
ఇక రెండవది ప్రపంచ దేశాల ప్రతినిధులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ద్వారా విశాఖపట్టణం జిల్లాను ప్రపంచ స్థాయిలో పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలన్న మరో లక్ష్యం కూడా దాగి ఉందనేది వాస్తవం. ఈ రెండు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం ని ఎంచుకున్నారు. ఈ లక్ష్య సాధనలో ఆయన విజయవంతం కావడం ఖాయం. తద్వారా ఏపీ ప్రస్తావన ప్రపంచ దేశాల ముందు మరింతగా పెరిగి రాష్ట్రానికి మేలు చేస్తుందని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం.
