దిగివచ్చిన చంద్రబాబు.. రాజధాని రైతులతో ఈ రోజు కీలక చర్చలు
కూటమి ప్రభుత్వంలో రాజధాని అమరావతి రైతుల సమస్యలపై సరైన స్పందన కనిపించడం లేదన్న విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
By: Tupaki Political Desk | 27 Nov 2025 7:00 PM ISTకూటమి ప్రభుత్వంలో రాజధాని అమరావతి రైతుల సమస్యలపై సరైన స్పందన కనిపించడం లేదన్న విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇటీవల కాలంలో రైతుల నుంచి అనేక విమర్శలు, ఆరోపణలు పెరిగిపోవడంతోపాటు.. మరో ఉద్యమానికి రైతులు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబులో చలనం వచ్చిందని అంటున్నారు. దాదాపు 18 నెలలుగా రైతులు సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోయారని, ఇక అధికారులు, నాయకుల తీరులో మార్పు రాదన్న ఆవేదనతో ఆందోళనకు సిద్ధమవుతున్నారని ప్రభుత్వ అనుకూల మీడియాలో సైతం ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై సీరియస్ గా ఫోకస్ చేశారు. బుధవారం రైతుల సమస్యలపై మున్సిపల్ మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో చర్చించిన సీఎం.. గురువారం సాయంత్రం రైతులతో భేటీ కావాలని నిర్ణయించారు.
చంద్రబాబు 3.0 ప్రభుత్వంలో రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు వదులుకున్నారు. రాజధాని ప్రాంత రైతులను భాగస్వాములుగా పరిగణిస్తూ ప్రభుత్వం వారితో ఒప్పందాలు చేసుకుంది. భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగిస్తామని హామీ ఇచ్చింది. రాజధాని అభివృద్ధి చెందితే తమ భూములకు విలువ వస్తుందనే సహృదయంతో రైతులు భూములు ఇచ్చేశారు. అయితే ఇలా భూములు వదులుకున్న రైతుల విషయంలో సీఆర్డీఏ, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి.
భూములిచ్చిన రైతుల్లో 90 శాతం మంది గతంలోనే ప్లాట్లు కేటాయించగా, 10 శాతం మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు అప్పగించడంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. గత ప్రభుత్వంలో రాజధాని అంశాన్ని తొక్కిపెట్టడంతో రైతుల ఇబ్బందులు అలానే కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కారమవుతుందని రైతులు ఆశించగా, సీఆర్డీఏ అధికారులు రైతులను తమ దగ్గరకు రానీయకుండా అడ్డుకోవడంతోపాటు సమస్యలపై నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. మున్సిపల్ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వంటివారు చొరవ తీసుకున్నా కొందరు సీఆర్డీఏ అధికారులు పనిచేయడం లేదని ఫిర్యాదులు ఎక్కువైపోయాయి. దీనిపై ప్రభుత్వ అనుకూల మీడియాలోనూ వ్యతిరేక కథనాలు రావడంతో ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు షాక్ తిన్నారని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో గురువారం రాజధాని అంశంపై అటో.. ఇటో తేల్చేయాలని సీఎం నిర్ణయించారు. బుధవారం సీఆర్డీఏ, పురపాలక శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రాజధాని రైతులకు న్యాయం జరగాలని సీఎం సూచించారు. భూములు త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం తరపున అదే స్థాయి సహకారం అందాలని సీఎం అభిప్రాయపడ్డారు. అపరిష్కృత సమస్యలను కేబినెట్ ముందు ఉంచాలని ఆదేశించారు.
ఇదే సమయంలో రాజధాని రైతులతోనూ సమావేశం కావాలని సీఎం భావించారు. గురువారం సాయంత్రం రైతు నాయకులతో పాటు సమస్యలు ఉన్న రైతులు అందరినీ కలవాలని సమాచారం పంపారు. సీఎం చంద్రబాబు తమ సమస్యలపై సానుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు మాత్రం కొర్రీలు వేస్తూ తమను వేధిస్తున్నారని రైతులు రగిలిపోతున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడి తాడోపేడో తేల్చుకోవాలని వారంతా నిర్ణయానికి రావడంతో రాజధాని రైతులతో సీఎం సమావేశం ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు.
