అమరావతి, బనకచర్ల.. రెండూ రెండు కళ్లు!
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యాలు మారాయా? గతంలో A అంటే అమరావతి, P అంటే పోలవరం అన్న చంద్రబాబు ఇప్పుడు పోలవరం బుధులుగా బనకచర్లకు ప్రాధాన్యమిస్తున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 2 July 2025 7:00 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యాలు మారాయా? గతంలో A అంటే అమరావతి, P అంటే పోలవరం అన్న చంద్రబాబు ఇప్పుడు పోలవరం బుధులుగా బనకచర్లకు ప్రాధాన్యమిస్తున్నారని అంటున్నారు. గోదావరి వరద జలాలను వృథాగా సముద్రం పాల్జేయడం కన్నా, కరువు సీమ రాయలసీమకు తరలించాలనే ఉద్దేశంతో పోలవరం-బనకచర్లకు చంద్రబాబు ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణలో రాజకీయ పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, రాష్ట్రానికి చెందిన మేథావులు సైతం బనకచర్ల ప్రతిపాదనతో ప్రయోజనం ఏం లేదని పెదవి విరుస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తగ్గేదేలే అంటూ అమరావతితోపాటు బనకచర్లను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోకూడదని అమరావతిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక చర్యలు తీసుకుంటున్నారు. మే 2వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పనులను ప్రారంభించారు. మరోవైపు టెండర్లు ఖరారు చేస్తూ అమరావతి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇంతవరకు చంద్రబాబు ప్రయత్నాలపై ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినా, అమరావతిని మరింత విస్తరించాలని, అందుకోసం మరో 44 వేల ఎకరాల భూమి కావాలని ప్రతిపాదిస్తుండటమే విమర్శలకు తావిస్తోంది.
అయితే, కొత్తగా రాజధాని కోసం 44 వేల ఎకరాలు సేకరించాలనే ప్రతిపాదనపై చంద్రబాబు వెనక్కి తగ్గడం లేదు. ఎవరు కాదన్నా, రాజధాని చుట్టుపక్కల గ్రామాల నుంచి 44 వేల ఎకరాలు సమీకరించాల్సిందేనంటూ చంద్రబాబు పిలుపునిస్తున్నారు. ఇందుకోసం ఆయన చెబుతున్న కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో రాజధాని కోసం సేకరించిన 34 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తామన్న ప్రతిపాదన లేదు. కానీ, ఇప్పుడు అమరావతికి ప్రత్యేకంగా విమానాశ్రయం ఉండాలన్న ప్రతిపాదనతోపాటు కొత్తగా క్వాంటమ్ వాలీ, ఏఐ సిటీ ఇలా ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన కార్యాలయాలు ప్రారంభించేందుకు అదనంగా భూమి అవసరమని రైతులకు నచ్చజెబుతున్నారు చంద్రబాబు.
ప్రస్తుతం రాజధాని అమరావతి రైతుల నుంచి సేకరించిన 34 వేల ఎకరాల భూముల యజమానులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నామో అవే తాజాగా భూములు ఇచ్చిన రైతులకు వర్తింపజేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. దీంతో రైతులు వ్యతిరేకించినా కూడా భూములు సేకరించాల్సిందేనన్న పట్టుదల ప్రభుత్వంలో కనిపిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో బనకచర్లపై వస్తున్న అభ్యంతరాలను అధిగమించేలా ముఖ్యమంత్రి పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలోని కొందరు నేతలు ఫిర్యాదు చేయడంతో బనకచర్లపై కేంద్ర పర్యావరణ శాఖ కొర్రీలు వేసిన విషయం తెలిసిందే. అయితే గత పదేళ్లలో గోదావరి మిగులు జలాలు ఏ మేరకు సముద్రంలో కలిశాయో లెక్కలు చూపుతూ, వృథాగా పోతున్న నీటిని వాడుకుంటామని కేంద్రానికి తెలియజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకొంటున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రకటనలను కూడా తమ నివేదికతో జత చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని అంటున్నారు. దీంతో రాజకీయంగా బనకచర్లకు వస్తున్న అడ్డంకులకు పుల్ స్టాప్ వేయాలన్నది ముఖ్యమంత్రి వ్యూహంగా చెబుతున్నారు.
