Begin typing your search above and press return to search.

పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారం.. షాకిచ్చిన చంద్రబాబు

ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు సంబంధించిన డ్రగ్స్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By:  A.N.Kumar   |   15 March 2026 8:07 PM IST
పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారం.. షాకిచ్చిన చంద్రబాబు
X

ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు సంబంధించిన డ్రగ్స్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వంటి అంశాల్లో ఎవరైనా ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ.. పుట్టా మహేష్‌ను తాత్కాలికంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. అలాగే ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని సూచిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా పాల్గొన్నట్లు వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మొదట ఆయన యూరిన్ నమూనాల్లో డ్రగ్స్ నెగటివ్‌గా వచ్చినప్పటికీ తర్వాత తీసుకున్న బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం బయటకు రావడం వివాదానికి కారణమైంది.

ఇప్పటికే ఈ ఘటనను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావిస్తూ టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా చేస్తామని చెప్పే ప్రభుత్వం, తమ పార్టీకి చెందిన ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడటం రాష్ట్ర ప్రజలకు అవమానకరమని.. ఆయన ఎంపీగా కొనసాగేందుకు అర్హత లేదని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక ఎంపీ ఇలాంటి పార్టీల్లో పాల్గొనడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన తర్వాత చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. సమాజానికి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాల్సిన సమయంలో డ్రగ్స్ వినియోగం యువతకు తప్పు సందేశం ఇస్తుందని షర్మిల వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో టీడీపీపై ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితి ఏర్పడింది. గతంలో అవినీతి, నేరారోపణలు ఎదుర్కొన్న నేతలపై కఠిన చర్యలు తీసుకున్న చంద్రబాబు.. ఈ వ్యవహారంలో కూడా కఠిన వైఖరి అవలంబించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పుట్టా మహేష్‌పై వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు.. ఘటనపై పూర్తి నివేదిక తనకు సమర్పించాలని పార్టీ నాయకత్వానికి ఆదేశించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం. నేతల వ్యక్తిగత బలహీనతలు లేదా తప్పుల కారణంగా పార్టీకి నష్టం కలిగే పరిస్థితి రానివ్వనని ఆయన స్పష్టం చేశారు. ఘటనపై వివరణ కోరుతూ మహేశ్‌కు నోటీసులు ఇవ్వాలని, పూర్తి నివేదిక తనకు సమర్పించాలని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సూచించారు. డ్రగ్స్ కేసుల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

మొత్తానికి డ్రగ్స్ వివాదం ఇప్పుడు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.