ఒక రోజు ముందే స్టార్ట్ అయిన బాబు బర్త్ డే !
ఇదిలా ఉంటే ఒక రోజు ముందుగానే ఏపీలో బాబు పుట్టిన రోజు వేడుకలు స్టార్ట్ అయిపోయాయి. టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ బాబు పుట్టిన రోజుని ఘనంగా నిర్వహిస్తున్నాయి.
By: Tupaki Desk | 19 April 2025 11:07 PM ISTతెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పేరులోనే ఒక మ్యాజిక్ ఉంది. ఆయన రాజకీయ చాణక్యుడు. ఆయన అనుభవం ఎప్పటికీ అందరికీ స్పూర్తిదాయకమే. బాబు ఉంటే చాలు ఎలాంటి సవాళ్ళు అయినా ఎదుర్కోగలమన్న నిబ్బరం అందరిలో కలిగించడం ఆయనకే చెల్లు.
బాబు ఇపుడు ఏపీకి నాలుగవ సారి సీఎం అయ్యారు. ఆయన తన జీవితంలో ఒక కీలక ఘట్టానికి చేరుకున్నారు. ఆయన 75 ఏళ్ళను ఈ నెల 20తో పూర్తి చేసుకోబోతున్నారు. ఈ అతి ముఖ్యమైన మైలురాయిని ఆయన దాటుతున్న వేళ ఎన్నడూ లేని విధంగా విదేశాలలో ఉన్నారు.
బాబు ఎపుడూ తాను ఉన్న చోటనే తన ఆత్మ బంధువులు అనదగిన పార్టీ వారితోనే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటారు. బాబుకు అదే ఆనందంగా ఉంటుంది. కానీ బాబు ఇపుడు తన వజ్రోత్సవ జన్మదిన వేడుకలను విదేశాల్లో జరుపుకోవడం ఒక ప్రత్యేకత.
ఇదిలా ఉంటే ఒక రోజు ముందుగానే ఏపీలో బాబు పుట్టిన రోజు వేడుకలు స్టార్ట్ అయిపోయాయి. టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ బాబు పుట్టిన రోజుని ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఎవరికి వారుగా తామ ముందు బాబుని గ్రీట్ చేయాలన్న ఆనందంతో ఆరాటంతో ఈ విధంగా చేస్తున్నారు.
ఇక మంత్రులంతా కూడా బాబుకు ఒక రోజు ముందే శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. జనసేన నేత మంత్రి కందుల దుర్గేష్ అయితే బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయనను స్పూర్తి దాతగా అభివర్ణించారు. బాబు తొలి రోజులలో చేపట్టిన సినిమాటోగ్రఫీ శాఖను తాను చూడడం తన అదృష్టమని చెప్పారు.
మంచి పాలనదక్షుడు విజనరీ అయిన బాబు పాలనలో ఏపీ అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక బాబు అభిమాన సంఘాలు కూడా ఒక రోజు ముందుగానే ఆయన జన్మ దిన వేడుకలను నిర్వహిస్తున్నాయి. విశాఖలో బాబు పుట్టిన రోజు వేడుకలను ఆర్భాటంగా నిర్వహించి 75 కిలోల భారీ కేక్ ని కట్ చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నెరవేరుస్తున్నారని టీడీపీకి రాష్ట్రానికి బాబు సారధ్యం ఎంతో ముఖ్యమని కూడా పేర్కొన్నారు. ఇదే విధంగా రాష్ట్రంలో నలుమూలలా బాబు పుట్టిన రోజు వేడుకలు పెద్ద ఎత్తున చేస్తున్నారు.
ఇక బాబు పుట్టిన 20వ తేదీన ఇంకెంత ఘనంగా చేస్తారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఈసారి బాబు బర్త్ డే అత్యంత కీలకంగా మారింది. ముఖ్యమంత్రిగా ఉంటూ 75వ పుట్టిన రోజుని జరుపుకున్న వారు దేశంలో చాలా తక్కువ మందే ఉన్నారు. గట్టిగా చెప్పాలంటే ఒకరిద్దరు మించి లేరు అని కూడా చెప్పవచ్చు. అలాంటి అరుదైన రికార్డు ఇపుడు బాబు సొంతం అవుతోంది. సో చంద్రబాబు పుట్టిన రోజు టీడీపీ శ్రేణులకు పర్వదినంగా మారుతోంది. అంతా బాబు లాంగ్ లివ్ అని నినదిస్తున్నారు.
