Begin typing your search above and press return to search.

బీసీ రిజర్వేషన్లు... ప్రత్యర్ధులకు బాబు హెచ్చరిక

ఏపీలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఆమోదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

By:  Satya P   |   19 Aug 2026 9:26 AM IST
బీసీ రిజర్వేషన్లు... ప్రత్యర్ధులకు బాబు హెచ్చరిక
X

ఏపీలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఆమోదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దానిని శాసన సభలో ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు సభ్యుల హర్షద్వానాల మధ్య తీర్మానం నెగ్గేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు బీసీ రిజర్వేషన్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలు అవకాశాలు లేక వెనుకబడ్డారు కానీ నిజంగా వారు వెనకబడి లేరని గుర్తు చేశారు. వారిని మొదటి వరసలోకి తీసుకుని రావాల్సిన బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుంది అని స్పష్టం చేశారు.

ప్రత్యర్థి పార్టీలు అంటూ :

ఇదిలా ఉంటే బీసీల అనుకూల విధానమే టీడీపీ రాజకీయ సామాజిక విధానం అని బాబు స్పష్టం చేశారు. మొదటి నుంచి బీసీలకు న్యాయం చేసింది కూడా టీడీపీనే అని ఆయన గుర్తు చేశారు. కేంద్ర మంత్రి పదవులు కానీ ఇతర రాజకీయ అవకాశాలు కానీ తమ పార్టీయే ఇచ్చింది అని ఆయన చెప్పారు. ఇక బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అన్నది ఒక చారిత్రాత్మక విధానంగా ఆయన చెప్పారు. ఈ విషయంలో ప్రత్యర్ధి పార్టీలు ఎవరైనా కోర్టుకు వెళ్ళి మోకాలడ్డే ప్రయత్నం చేస్తే కనుక ఆ రోజుతోనే వారి రాజకీయం అంతం అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీసీల విషయంలో తమది మాటలు కాదని చేతలతోనే నిరూపించుకుంటున్నామని ఆయన చెప్పారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో బీసీలకు తీరని అన్యాయం జరిగింది అని చంద్రబాబు విమర్శించారు.

బీసీ రిజర్వేషన్ల రోజునే :

ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు రోజునే ఎమ్మెల్సీగా వడ్డెర కులానికి చెందిన రమాదేవికి ఎమ్మెల్సీగా టీడీపీ చాన్స్ ఇచ్చింది. ఈ విధంగా ఆ పార్టీ బీసీల విషయంలో తమ క్రెడిబిలిటీని మరోసారి నిరూపించుకుంది అని అంటున్నారు. అంతే కాదు మరింత మందికి అవకాశాలు ఇస్తామని భరోసా ఇవ్వడమే కాకుండా నమ్మకం కూడా వారిలో పెంచింది అని అంటున్నారు. వ్యూహాత్మకంగానే ఈ ఎంపిక జరిగింది అని కూడా చెబుతున్నారు. ఇక అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రసంగం ద్వారా బీసీలకు టీడీపీ హయాంలో చేసిన మేలు ఏమిటి అన్నది కళ్ళకు కట్టినట్లుగా తెలియచెప్పారు.

కోర్టుకు వెళ్ళే చాన్స్ :

మరో వైపు చూస్తే బీసీల రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదని చంద్రబాబు నిండు శాసనసభలో చెప్పారు. వారికి అవకాశాలు ఇస్తున్నామంటే మిగిలిన వారి నుంచి తీసుకోని కానే కాదని అన్నారు. ఈ విధంగా ఆయన స్పష్టంగా చెప్పడం వెనక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అన్ని రకాల రిజర్వేషన్లు మొత్తం 50 శాతం మించరాదు. అయితే బీసీలకు 34 సాతం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7 శాతం అంటే కచ్చితంగా అది 56 శాతం అవుతుంది. దాంతో తమ కోటాకు ఎసరు వస్తుందని భావించి ఎవరైనా కోర్టుని ఆశ్రయించవచ్చు అని అంటున్నారు. లేదా రాజకీయ ప్రత్యర్థులు కూడా ఎవరిని అయినా ఎగదోయవచ్చు అని అంటున్నారు. అందుకే చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగానే ముందర కాళ్లకు బంధం వేశారు అని అంటున్నారు. మొత్తం మీద బీసీ రిజర్వేషన్లు ఏపీలో అమలు అయితే క్రెడిట్ కచ్చితంగా టీడీపీకి చెందుతుంది. ఏ మాత్రం వికటించినా అది ఇతరులకే ఇబ్బందిగా మారుతుంది. దాంతో అత్యంత సున్నితమైన ఈ అంశంలో టీడీపీ కూటమి ప్రత్యర్థి పార్టీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.