Begin typing your search above and press return to search.

బాబుకు మోడీ ఓకే చెబితే జగన్ కి కష్టాలేనా ?

ఏపీలో మరోసారి అధికారం అందుకోవడం కోసం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు.

By:  Satya P   |   18 May 2026 9:10 AM IST
బాబుకు మోడీ ఓకే చెబితే జగన్ కి కష్టాలేనా ?
X

ఏపీలో మరోసారి అధికారం అందుకోవడం కోసం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఈసారి కనుక అధికారంలోకి తిరిగి వస్తే ఏపీకి ఉన్న ఒకసారి ఒక పార్టీ మరోసారి మరో పార్టీని గెలిపించే ట్రాక్ రికార్డుని రివర్స్ చేసి రికార్డు సృష్టించవచ్చు అన్నది కూడా ఉంది. అదే సమయంలో వరుసగా రెండోసారి కూడా ఓడిస్తే వైసీపీ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకంగా అవుతుందని దాంతో ఏపీలో కూటమి పాలనకు తిరుగు ఉండదని కూడా లెక్కలు వేస్తున్నారు అని అంటున్నారు.

ఈ చాన్స్ వదలకుండా :

ఏపీలో 2029 ఎన్నికల్లో సీట్లు పెరుగుతాయని డీ లిమిటేషన్ జరిగి తీరుతుందని ఇప్పటిదాకా ఆశలు పెట్టుకున్నారు. కానీ గత నెలలో లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడంతో ఆ అవకాశం అయితే తప్పిపోయింది. ఇక మరోసారి డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టి నెగ్గించాలనుకున్నా అది ఎపుడు ఎలా జరుగుతుంది అన్నది కూడా ఒక చర్చగానే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్లాన్ బీలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం చూస్తే తెలంగాణాలోకు ఏపీకి చెరో యాభై సీట్లు అదనంగా పెంచాలని స్పష్టంగా ఉంది. దాని మీద అయితే గత రెండు ఎన్నికల్లోనూ ఎలాంటి డెసిషన్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్న టీడీపీ దీని మీద ఒత్తిడి తెచ్చినా కూడా అది సాకారం కాలేదు, ఇక 2019 నుంచి 2024 మధ్యలో అధికారంలో వైసీపీ ఉంది. కానీ పెద్దగా సీట్ల పెంపు మీద ఆసక్తిని చూపించలేదని అంటారు. ఇపుడు చూస్తే కూటమి ఏపీలో ఉంది. కేంద్రంలో ఎన్ డీయే ఉంది. పైగా చంద్రబాబు పలుకుబడి అమాంతం పెరిగిన వాతావరణం కనిపిస్తోంది. దాంతో ఈసారి చాన్స్ వదులుకోకూడదని టీడీపీ గట్టిగానే నిర్ణయించుకుంది అని అంటున్నారు.

బీజేపీకీ లాభమే :

వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో గెలవాలని చూస్తున్న బీజేపీకి కూడా ఈ సీట్ల పెంపు లాభమే అని అంటున్నారు. పైగా తెలంగాణాలోనూ ఎన్డీయేను విస్తరించాలని కేంద్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు అని అంటున్నారు. నరేంద్ర మోడీ తాజా హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబు పవన్ లని కలిసి మరీ ప్రత్యేకంగా మాట్లాడడంతో తెలుగు రాష్ట్రాల మీద కేంద్రానికి ఎన్నో ఆశలు ఉన్నాయని అర్ధం అవుతోంది అని అంటున్నారు.

కూటమిదే పైచేయి :

ఇక ఏపీలో 175 సీట్లు కనుక 225 గా మారితే కూటమిదే 2029 ఎన్నికల్లో పైచేయి అయ్యే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని అంటున్నారు. అదేలా అంటే అధికారంలో ఉన్న పార్టీ డీ లిమిటేషన్ చేసుకునే వీలు ఉంటుంది. దాంతో ఎక్కడికక్కడ పునర్ విభజన జరుగుతుంది. ఆ మేరకు అధికార పార్టీకే అది అనుకూలిస్తుంది. అంతే కాదు మరో యాభై సీట్లు పెరిగితే కనుక కూటమి పార్టీలలోని ఆశావహలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీట్లను సర్దుబాటు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. దాంతో ఎలాంటి అసంతృప్తి వ్యక్తం అయ్యే సీన్ ఉండదు, అంతా కలసి ఎన్నికలకు ఒక్కటే మాటగా నిలిచి సమాయత్తం అవుతారు. అదే వైసీపీకి చూస్తే పెరిగిన సీట్ల వల్ల ఇబ్బందులే వస్తాయని అంటున్నారు. దాంతో పాటు కూటమిలో అసంతృప్తి చెలరేగకపోతే అది ఆ పార్టీకి మరింత ఇబ్బంది అవుతుందని కూడా విశ్లేషిస్తున్నారు. మొత్తానికి చూస్తే మోడీ బాబు ప్రతిపాదనకు ఓకే అనేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దాంతో వైసీపీకి నష్టమేనా అన్న చర్చ సాగుతోంది.