బాబు అంతా చెప్పేశారు...ఇక వారి దయా ప్రాప్తం !
ఏపీకి వచ్చిన 16వ ఆర్ధిక సంఘం ప్రతినిధులతో సచివాలయంలో జరిగిన కీలక భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పవర్ ఫుల్ గా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది.
By: Tupaki Desk | 17 April 2025 6:00 AM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాన్ని తన ఆరాటాన్ని కూడా మిళితం చేసి రాష్ట్రం గురించి అంతా చెప్పేశారు. ఉన్నది ఉన్నట్లుగా వివరించారు. విభజన తరువాత ఏపీ పడుతున్న ఇబ్బందులు నిధుల లేమి అప్పులు సహా అన్నీ ముఖ్యమంత్రి 16వ ఆర్ధిక సంఘానికి పూర్తిగా వివరించారు.
ఏపీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ప్రత్యేక సాయం ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. ఏపీకి వచ్చిన 16వ ఆర్ధిక సంఘం ప్రతినిధులతో సచివాలయంలో జరిగిన కీలక భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పవర్ ఫుల్ గా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది.
రాష్ట్రం విడిపోయే నాటికి 2014-15లో ఏపీ తలసరి ఆదాయం రూ.93,903 ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104గా ఉండేది. మొదటి ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏపీలో తలసరి ఆదాయం 13.21 శాతం పెరిగి 2019కి రూ.1,54,031కు చేరుకుందని సీఎం తెలిపారు. ఇక గడచిన అయిదేళ్ళ కాలంలో చూస్తే రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిందని ఇపుడు చూస్తే దక్షిణ భారత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయమే అత్యంత తక్కువగా ఉందని వెల్లడించారు. .
అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ తూర్పు దేశాలకు గేట్‌వేగా ఉందని సీఎం వివరించారు. అలాగే గ్రీన్ ఎనర్జీకి ఏపీ హబ్‌గా ఉంది. అటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్ వంటి నగరాలు అమరావతికి చేరువలో ఉన్నాయి. ఈ నాలుగు నగరాలను కలుపుతూ దక్షిణ భారత దేశం మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తే వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం అవుతుందని 16వ ఆర్ధిక సంఘం ప్రతినిధులకు వివరించారు.
2014లో రాష్ట్ర విభజనతో ఆదాయ వనరులు అన్నీ తెలంగాణకు వెళ్లాయి. కేవలం ప్రాథమికరంగంపైన మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఆధారపడాల్సి వచ్చిందని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. ఇక ఏపీకి ప్రధాన ఆదాయ వనరు లేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ ఆదాయం ఏపీ కోల్పోయింది. దీంతో తెలంగాణకు ఆదాయంలో 75 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. ఇది తెలంగాణ వృద్ధికి, తలసరి ఆదాయం పెరుగుదలకు ఏపీ వెనకబాటు తనానికి కారణమైందని తెలిపారు.
విభజనతో జాతీయ సంస్థలు, విద్య-వైద్య సంస్థలు, భారత ప్రభుత్వ సంస్థలు ఏపీకి లేకుండా పోయాయని కూడా గుర్తు చేశారు. విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం 91 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లకు సంబంధించి రూ.1.63 లక్షల కోట్లు, అలాగే షెడ్యూల్ 10 కింద ఉన్న 142 సంస్థలకు చెందిన రూ.39,191 ఆస్తుల పంపకం అంశం రెండు రాష్ట్రాల మధ్య విభజన జరిగి పదేళ్లవుతున్నా ఇంకా పెండింగ్‌లోనే ఉందని సీఎం వివరించారు.
ఏపీ కొత్త రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతికి రూ.47,000 కోట్లు అవసరమని చంద్రబాబు చెప్పారు. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.77,249 కోట్లు అవసరం కాగా అందులో వరల్డ్ బ్యాంక్, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఫండింగ్ రూ.31,000 కోట్లు సమకూరాయి. ఇంకా కావాల్సిన నిధులు రూ.47,000 కోట్లు అని వివరించారు.
అదే విధంగా ఏపీ సమగ్రమైన అభివృద్ధికి తమ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ చేస్తోంది అన్నారు. మొత్తానికి ఏపీకి దండీగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మరి 16వ ఆర్ధిక సంఘం ఎంత మేరకు సహకరిస్తుంది అన్న దాని మీదనే అంతా ఆధారపడి ఉంది.
