ఉచితాల మీద బాబు ఓపెన్ అయితేనే బెటర్ !
చంద్రబాబునాయుడుది ఎపుడూ సంస్కరణ వాదం. అదే ఆయనను రాజకీయాల్లో ఒక స్పెషల్ లీడర్ గా ప్రొజెక్ట్ చేసింది.
By: Tupaki Desk | 10 Feb 2025 3:37 AMచంద్రబాబునాయుడుది ఎపుడూ సంస్కరణ వాదం. అదే ఆయనను రాజకీయాల్లో ఒక స్పెషల్ లీడర్ గా ప్రొజెక్ట్ చేసింది. 1995 నుంచి 2004 మధ్యలో బాబు అంతా సంస్కరణల గురించే మాట్లాడేవారు. ఉచిత విద్యుత్ విషయంలో కూడా ఆయన మొదట్లో విభేదించేవారు అని ప్రచారంలో ఉంది.
అయితే రాను రానూ బాబు కూడా కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉచిత హామీల మీద పడ్డారు. అలా ఆయన 2009 ఎన్నికల మేనిఫేస్టోని పెద్ద లిస్ట్ తో తయారు చేశారు. దాని మీద అప్పటి కాంగ్రెస్ సీఎం వైఎస్సార్ ఆల్ ఫ్రీ బాబు అని విమర్శలు సంధించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ కూడా 92 సీట్లను తెచ్చుకుని గట్టిగానే నిలబడింది.
ఇక 2014లో విభజన తరువాత బాబు ఎన్నికల మేనిఫేస్టోలో ఎక్కువగా ఫ్రీబీస్ కనిపించాయి. అయితే వాటిలో కొన్ని అమలు చేశారు. కొన్ని చేయలేకపోయారు. దాంతో 2019లో దెబ్బ పడింది. ఇక 2024 ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలతో బాబు వచ్చారు. జనాలు పట్టం కట్టారు. అయితే బాబు గెలిచిన ప్రతీ సారీ ఉచితాలే తనను గెలిపించాయని అనుకుంటున్నారా అన్నది ఒక చర్చ.
అదే సమయంలో ఉచిత హామీలు ఇచ్చినా బాబు పాలనలో ఎపుడూ అభివృద్ధికే పెద్ద పీట వేయడమూ జరుగుతోంది. ఇపుడు చూస్తే ఏపీలో ఆర్ధిక వనరులు బహు తక్కువగా ఉన్నాయి. అభివృద్ధి లేని స్టేట్ గా ఉంది. దాంతో ఉన్న నిధులు అలాగే అప్పులు తెచ్చినవి అన్నీ కూడా అభివృద్ధి మీదనే పెడితేనే తప్ప ఏపీ ముందుకు సాగే పరిస్థితి అయితే లేదు.
దాంతోనే మెల్లగా చంద్రబాబు తనదైన శైలిలో జనాలకు హింట్ ఇస్తున్నారు. సంక్షేమ పధకాలకు నిధులు లేవని ఆయన మెల్లగా చెప్పగలుస్తున్నారు. ఢిల్లీ రిజల్ట్ తరువాత మరింత స్పష్టంగా ఆయన చెప్పారు. అయితే ఇది కూడా చాలదు. ఇంకా ప్రజలకు అర్ధమయ్యేలా ఓపెన్ గానే బాబు చెబితే బాగుంటుంది అన్నది చాలా మంది నుంచి వస్తున్న సూచన.
ఇక చంద్రబాబు ఇస్తున్న సామాజిక పెన్షన్ల విషయంలోనూ చర్చ సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారని అది ఖజానాకు భారమని అంటున్న వారూ ఉన్నారు. అలాగే ఈ సామాజిక పెన్షన్లలో దివ్యాంగులు మంచాన పడిన వారి కిడ్నీ పేషెంట్లకు ఇలా వివిధ రకాలైన పెన్షన్లు తీసుకుంటే గరిష్టంగా పదిహేను వేల దాకా ఇస్తున్నారు. దాంతో ఇది అతి పెద్ద బర్డెన్ గా మారుతోంది. సరే దీనిని ఎవరూ కాదనలేకపోయినా అన్నా క్యాంటీన్ల విషయంలోనూ మరో చర్చ ఉంది.
అక్కడ ఆర్తులకు ఆహారం దక్కువ ధరకే అందించడాన్ని ఎవరూ తప్పు పట్టకపోయినా కేవలం అయిదు రూపాయలకే అని ధర పెట్టడం మాత్రం ఆలోచించాల్సిందే అని అంటున్నారు. దానిని కనీసం పదిహేను నుంచి
ఇరవై రూపాయలు చేసినా పేదలకు ఈ రోజులలో న్యాయం చేసినట్లే అంటున్నారు. దాని విషయంలో ధరలు సవరించాల్సిందే అంటున్నారు.
ఇక ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నది కూడా అంతగా అవసరం లేనిదే అని అంటున్నారు. ఇలా చూసుకుంటే ఉచిత హామీల విషయంలో బాబు జనాలకు పూర్తిగా విషయాలు చెప్పి ఏపీ అభివృద్ధి ఎంత అవసరం అనేది వారిని చైతన్యం చేయడానికి చూడాలి అపుడే ఏపీలో అభివృద్ధి మీద డిబేట్ జరుగుతుంది.
వైసీపీ కూడా కచ్చితంగా ఇదే రూట్లోకి రావాల్సి ఉంటుంది అని అంటున్నారు. లేకపోతే ఉచితాలు అప్పు చేసి ఇస్తూ పోతే ఏపీ తట్టుకోలేదు అన్నది చర్చగానే ఉంటుంది. ఇంకా చేతిలో నాలుగున్నరేళ్ళ పాలన ఉంది కాబట్టి చంద్రబాబు ఉచితాల విషయంలో ఓపెన్ అయితేనే బెటర్ అని అంటున్నారు. అపుడు ఫోకస్ అంతా డెవలప్మెంట్ మీదనే ఉంటుందని అంటున్నారు.