Begin typing your search above and press return to search.

కేంద్రం ముందస్తు అంటే ఏపీ అసెంబ్లీ రద్దు చేస్తారా...?

కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తుంది అని అంటున్నారు. ఈ ప్రచారం గతంలో వినిపించినా ఇపుడు మరింత ఎక్కువగా వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 3:38 AM GMT
కేంద్రం ముందస్తు అంటే ఏపీ అసెంబ్లీ రద్దు చేస్తారా...?
X

కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తుంది అని అంటున్నారు. ఈ ప్రచారం గతంలో వినిపించినా ఇపుడు మరింత ఎక్కువగా వినిపిస్తోంది. గత రెండు రోజులుగా అయితే ఇంకా బిగ్ సౌండ్ చేస్తోంది. దానికి అనుగుణంగానే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి తమకు అనుకూలంగా బిల్లులను ఆమోదించుకుని ఆ మీదట లోక్ సభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని బీజేపీ పెద్దలు సీరియస్ గా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఇండియా కూటమి సవాల్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అని అంటున్నారు.

ఈ కూటమిని ఆదిలో లైట్ తీసుకున్నా ఇపుడు అంతా విభేదాలు మరచి చేతులు కలుపుతున్నారు. ఏది ఏమైనా మోడీ దిగిపోవాలి అన్న దాని మీద వారిలో ఏకాభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే టైం లో బీజేపీకి ఎదురుగా కూటమి నుంచి ఒకే ఒక అభ్యర్ధిని నిలబెట్టాలని చూస్తున్నారు.

మొత్తానికి ఇండియా కూటమి మరింతగా బలపడి జనంలో దాని మీద పాజిటివ్ వైబ్రేషన్స్ రాకముందే ఎన్నికల తతంగం ముగించాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఇక జమిలి ఎన్నికల ప్రతిపాదనతో దీనికి ముస్తాబు చేయనున్నారు. ముందస్తు అని తాము విపక్ష కూటమిని భయపడడంలేదు అని చెప్పుకోవడానికే ఈ జమిలి ఎన్నికలు.

నిజానికి జమిలి ఎన్నికలు అంటే అధికారంలో ఉన్న రాష్ట్రాలు తమ పదవిని తగ్గించుకుని సిద్ధపడాలి. అలా అయితే ఏపీలో వైసీపీ తొమ్మిది నెలల అధికారాన్ని త్యాగం చేయాలి. కేంద్రం లోక్ సభ రద్దు అంటే ఏపీ కూడా అసెంబ్లీ రద్దు చేసుకుని ముందుకు రావాలి. జమిలికి నో చెబితే మాత్రం 2024 మేలో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు వైసీపీ సర్కార్ ఫుల్ టెర్మ్ తాము అధికారంలో ఉంటామని చెబుతోంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే అది తమకు లాభమా నష్టమా అన్నది ఆలోచించిన మీదటనే అసెంబ్లీ రద్దు మీద ఆలోచిస్తుంది అని అంటున్నారు. కేంద్రం లోక్ సభను రద్దు చేసి ఎన్నికలు అంటే ఏపీ కూడా అదే బాటలో వెళ్లాలని లేదని అంటున్నారు.

జమిలి ఎన్నికలకు ఎన్ని రాష్ట్రాలు సహకరిస్తాయో చూసిన మీదట బీజేపీతో కేంద్ర పెద్దలతో ఈక్వేషన్స్ అన్నీ సరిచూసుకున్న మీదటనే వైసీపీ తన ముందస్తు అడుగులకు పదును పెడుతుందని అంటున్నారు. మొత్తానికి ముందస్తు ఎన్నికల ప్రచారం మాత్రం ఇపుడు దేశంలో ఏపీలో కూడా ఊపందుకుంటోంది.