గ్యాస్ కొరత తీర్చేందుకు సీన్లోకి రిలయన్స్.. ఇప్పుడేం జరుగుతుంది?
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాతో మొదలైన యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్లో కొత్త అనిశ్చితిని తీసుకొచ్చింది.
By: Garuda Media | 11 March 2026 9:49 AM ISTఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాతో మొదలైన యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్లో కొత్త అనిశ్చితిని తీసుకొచ్చింది. వారం మొదలై రెండు వారాలు కూడా కాక ముందే.. దేశీయ వంటగ్యాస్ బండల మీద చూపుతున్న ప్రభావంతో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు ఇప్పటికే చమురు సంస్థలను ఎస్మా చట్టం కిందకు తీసుకొచ్చిన కేంద్రం.. మరిన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బండల కొరతను తీర్చే బాధ్యతల బరువును మోసేందుకు రిలయన్స్ సీన్లోకి వచ్చింది.
ఇందులో భాగంగా గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న రిఫైనింగ్.. పెట్రో కెమికల్స్ సముదాయాల్లో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తిని పెంచుతున్నట్లుగా వెల్లడించింది. కేజీ డీ6 బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే సహజవాయువును ప్రాధాన్య రంగాలకు మళ్లించే చర్యలు చేపట్టనున్నట్లుగా చెప్పటం గమనార్హం. తమ తొలి ప్రాధాన్యత కోట్లాది భారతీయ కుటుంబాల సంక్షేమంగా పేర్కొన్న రిలయన్స్.. ‘భారతదేశ ఇంధన భద్రతకు అమితంగా ప్రాధాన్యతను ఇస్తాం. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తూ.. జాతీయ మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉంటాం’’ అన్న ప్రకటన చూస్తే.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో వాణిజ్య ప్రయోజనాల కంటే దేశ ప్రజల అవసరాలను తీర్చటమే తమ ముందున్న తక్షణ కర్తవ్యంగా పేర్కొంది.
రిలయన్స ఈ ప్రకటనకు ముందు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కారణంగా చెప్పాలి. దేశంలోని అన్ని రిఫైనరీలు.. ప్రొపేన్.. బ్యూటేన్ లాంటి సీ3, సీ4 స్ట్రీమ్ లను పూర్తిగా ఎల్పీజీ ఉత్పత్తికి వినియోగించాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో రిలయన్స్ అందుకు తగ్గట్లు రియాక్టు అయ్యింది. మొత్తంగా రిలయన్స్ లాంటి భారీ సంస్థ సైతం ఇప్పుడు వంట గ్యాస్ మీద ఫోకస్ చేస్తున్న వేళ.. కొరత తీవ్రత అంతో ఇంతో తగ్గుతుందని చెప్పక తప్పదు.
