Begin typing your search above and press return to search.

జగన్ కంటే బాబుకు తక్కువ నిధులు ఇచ్చిన మోడీ !

మాట్లాడితే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు బీజేపీ వారు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ కానీ కూటమి కానీ అధికారంలో ఉంటే అభివృద్ధి శరవేగంగా పరుగులు తీస్తుందని అంటారు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 1:00 AM IST
జగన్ కంటే బాబుకు తక్కువ నిధులు ఇచ్చిన మోడీ !
X

మాట్లాడితే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు బీజేపీ వారు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ కానీ కూటమి కానీ అధికారంలో ఉంటే అభివృద్ధి శరవేగంగా పరుగులు తీస్తుందని అంటారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల సంగతి ఒకలా ఎన్డీయే పాలిత రాష్ట్రాలలో సంగతి మరోలా ఉందని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ విషయంలో కేంద్ర సాయం ఎపుడూ వివక్షతో కూడినదిగా ఉందని విమర్శలు అయితే ప్రత్యర్ధులు చేస్తూ వస్తున్నారు.

ఇక అధికారిక లెక్కలు చూసుకుంటే డబుల్ ఇంజర్ సర్కార్ గా 2024లో కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాయి. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ జనసేన భాగస్వాములు, అలాగే ఏపీలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. మరి ఇంతలా అనుబంధం పెనవేసుకుని పోయిన నేపధ్యంలో ముగ్గురు మిత్రులూ కలసికట్టుగా ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తున్న నేపధ్యంలో ఏపీకి తొలి ఏడాది కేంద్రం నుంచి నిధుల వరద పారాలి కదా అని అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ ఏపీకి 2024-25 ఆర్ధిక సంవత్సరం చూస్తే జగన్ జమానా కొనసాగిన దాని కంటే కూడా ఏపీకి కేంద్రం బాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి తక్కువగానే కేంద్ర గ్రాంట్స్ ఇచ్చిందని అధికారిక కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఆ వివరాలను చూస్తే కనుక బాగానే తేడా కనిపిస్తోంది.

ఇక ఒక్కసారి ఆ అధికార డేటాను పరిశీలిస్తే కనుక 2023-24 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర గ్రాంట్స్ 34 వేల 695 కోట్ల రూపాయలు. అదే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గ్రాంట్స్ 20 వేల 139 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే తేడా చూస్తే ఏకంగా 14 వేల 563 కోట్ల రూపాయలుగా ఉంది. ఇంత తక్కువగా కేంద్రం గ్రాంట్స్ తగ్గించి ఇచ్చింది అని అంటున్నారు. ఏపీ లాంటి రాష్ట్రానికి ఈ 14 వేల 563 కోట్ల రూపాయలు ఎంతో విలువైనవి.

జగన్ సర్కార్ లో ఇచ్చినట్లుగానే వాటిని కూడా ఇస్తే ఎంతో కొంత ఊరటగా ఉండేది. నిజానికి జగన్ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు లేదు. కానీ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. మరి డబుల్ ఇంజన్ సర్కార్ గా ఉన్నా కూడా కేంద్రం గ్రాంట్స్ ని పెంచాల్సింది పోయి సగానికి సగం తగ్గించడం మీద చర్చ సాగుతోంది.

మరీ ఇంత తక్కువగా నిధులు ఇస్తూ డబుల్ ఇంజన్ సర్కార్ గా బీజేపీ చెప్పుకోవడమేంటని కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి మండిపడ్డారు. ఏపీని కేంద్రం ఏ విధంగానూ కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత కూడా ఆదుకోవడం లేదు అనడానికి కాగ్ రిపోర్ట్స్ నిదర్శనం అని ఆయన విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోంది అని చెప్పుకుంటున్న టీడీపీ కూటమి పెద్దలు కూడా ఇంత తక్కువగా కేంద్రం గ్రాంట్స్ ఇవ్వడం పట్ల గట్టిగా నిలదీసేది ఏమైనా ఉందా అంటే లేదనే అంటున్నారు. మరి రాష్ట్రానికి చూస్తే సరైన ఆదాయ వనరులు లేవు, అందుకే కేంద్రం అండగా ఉంటుందని పొత్తు పెట్టుకున్నారు. కానీ తీరా చూస్తే కేంద్రం కూడా ఏపీ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఉదారంగా గ్రాంట్స్ ఇవ్వాలని అంతా కోరుతున్నారు. అదే సమయంలో టీడీపీ కూటమి పెద్దలు కూడా ఆ దిశగా కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే డబుల్ ఇంజన్ సర్కార్ అన్న మాటకే అర్ధం ఉండదని అంటున్నారు.