Begin typing your search above and press return to search.

అవసరమైతే వేరే రాష్ట్రాల్లోని ఫోన్లు ట్యాప్ చేసేలా కేంద్రం ప్లానింగ్?

పెద్ద ఎత్తున చర్చకు దారి తీసే ఒక అంశాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు తెర మీదకు తీసుకొచ్చింది.

By:  Tupaki Desk   |   30 Jun 2025 10:30 AM
అవసరమైతే వేరే రాష్ట్రాల్లోని ఫోన్లు ట్యాప్ చేసేలా కేంద్రం ప్లానింగ్?
X

పెద్ద ఎత్తున చర్చకు దారి తీసే ఒక అంశాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు తెర మీదకు తీసుకొచ్చింది. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఫోన్ ట్యాపింగ్ ఉదంతంపై రచ్చ నడుస్తున్న వేళ.. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్రం కొత్త ముసాయిదాను ప్రతిపాదించింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని వ్యక్తులు.. సంస్థల ఫోన్లను ట్యాప్ చేసే అధికారం (కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే) ఉన్న సంగతి తెలిసిందే. అందుకు భిన్నంగా రాష్ట్రం వెలుపల ఉన్న వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసేందుకు వీలుగా రాష్ట్రాలకు కొత్త అధికారాలు దఖల పరుస్తూ కొత్త నిబంధనను ప్రతిపాదించింది.

ఇందులో భాగంగా చట్టబద్ధమైన ట్యాపింగ్ నకు నిబంధనలు.. జాగ్రత్తలకు సంబంధించి టెలికమ్యూనికేషన్స్ నిబంధనలు 2024లో మార్పుల్ని పేర్కొంటూ కేంద్రంలోని కమ్యూనికేషన్ల శాఖ ముసాయిదా ప్రకటనను వెలువరించింది. ఇందులో రూల్ 2(సి) కింద ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో అయితే కేంద్ర హోం శాఖ కార్యదర్శి.. రాష్ట్ర పరిధిలో అయితే రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి ఫోన్ ట్యాపింగ్నకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

దీనికి అదనంగా మరోరూల్ ను జోడించారు. ఇందులో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాదేశిక సరిహద్దుల బయట ఉన్న వ్యక్తుల ఫోన్లను కేంద్రం అనుమతితో ట్యాప్ చేయొచ్చు. అయితే సదరు రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి నుంచి వచ్చే వినతి ఆధారంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి ఇచ్చేందుకు వీలుగా అవకాశాన్ని కల్పించారు. దీనిపై ఉన్న అభ్యంతరాలు.. అభిప్రాయాలను నెల లోపు అందజేయాలని కేంద్రం కోరింది.

అయితే.. ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేయటానికి ఎప్పుడు అనుమతిస్తారన్న దానిపైనా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రజా భద్రత.. ప్రజా అత్యవసర పరిస్థితి.. ప్రజా ప్రయోజనాల భద్రతకు సంబంధించిన అంశాల మీద కేంద్రం నుంచి రాష్ట్రం ట్యాపింగ్ నకు అనుమతి తీసుకోవచ్చు. దేశ రక్షణ.. జాతీయ భద్రత.. విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు.. శాంతిభద్రతల ప్రయోజనాల్ని కాపాడేందుకు వీలుగా.. ఏదైనా నేరాన్ని ముందుగా ఆరికట్టటానికి వీలుగా ఫోన్లు ట్యాపింగ్ చేసే వీలుంది.

ఇక.. కేంద్రం తెర మీదకు తీసుకొచ్చిన ఈ ముసాయిదాపై తమ అభిప్రాయాల్ని వెల్లడించాలన్న ఆసక్తి ఉన్న వారు.. జాయింట్ సెక్రటరీ (టెలికాం), టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్ మెంట్, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సంచార్ భవన్, 20 అశోకా రోడ్, న్యూఢిల్లీ 110 001. అయితే.. అభిప్రాయాల్ని నెల రోజుల్లోపు పంపించాల్సి ఉంటుంది.