మధ్యతరగతికి త్వరలో ఉపశమనం... తగ్గనున్న ఈ వస్తువుల ధరలు!
ఇందులో భాగంగా... 12 శాతం జీఎస్టీ స్లాబ్ ను పూర్తిగా తొలగించే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
By: Tupaki Desk | 2 July 2025 4:09 PM ISTఈ ఏడాది ప్రారంభంలో వరుస ఆదాయపు పన్ను రాయితీల తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మధ్య, అల్పాదాయ కుటుంబాలకు జీఎస్టీ తగ్గింపు రూపంలో ఉపశమనం కల్పించడానికి సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... 12 శాతం జీఎస్టీ స్లాబ్ ను పూర్తిగా తొలగించే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
అవును... మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించిన కేంద్ర ప్రభుత్వం మరో చర్యకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. 12 శాతం జీఎస్టీ స్లాబ్ ను పూర్తిగా తొలగించడం.. లేదా, ప్రస్తుతం 12 శాతం పన్ను విధించబడుతున్న అనేక నిత్యావసర వస్తువులను 5 శాతం స్లాబ్ లోకి తిరిగి చేర్చడం వంటి వాటి గురించి కేంద్రం ఆలోచిస్తోందని సమాచారం.
అయితే.. ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ.40,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్ల వరకు భారం పడనుందని తెలుస్తోంది. అయితే.. దీని వల్ల వినియోగం పెరుగుతుందని, ఫలితంగా జీఎస్టీ వసూల్లు పెరుగుతాయని కేంద్రం నమ్ముతోంది. మరోవైపు, కేంద్రం ఈ చర్యలపై నిర్ణయం తీసుకున్న అనంతరం.. రాష్ట్రాల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.
ఏది ఏమైనా ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుని, అది అమలైతే పలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇందులో భాగంగా... టూత్ పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, వంటగది పాత్రలు, ప్రెషర్ కుక్కర్లు, కుట్టు యంత్రాలు, గీజర్లు, చిన్న సామర్థ్యం గల వాషింగ్ మెషీన్లు, సైకిళ్లు, స్టేషనరీ వస్తువుల ధరలు తగ్గుతాయి.
వీటితో పాటు రూ.500 - రూ.1,000 మధ్య ధర కలిగిన పాదరక్షలు, రూ.1,000 కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తుల ధరలు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాలతో పాటు టీకాల ధరలు తగ్గే అవకాశం ఉంది. కాగా.. ఈ నెల చివర్లో జరిగే 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. అందులో ఈ అంశం ప్రస్తావనకు వస్తుందని అంటున్నారు.
