Begin typing your search above and press return to search.

ఓటరు కార్డు సర్వాధారం....హక్కు చోరీ అంటున్న విపక్షం !

కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు ఓటర్ ఐడీని ఉపయోగించే ఆలోచన ఉందని ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీనిపై విమర్శలు రావడంతో ఆధార్‌ను తొలగించడం లేదని, ఆధార్, ఓటర్ ఐడీ రెండింటినీ ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌తో ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తున్న విపక్షాలు ఈ ప్రతిపాదనను తప్పుబడుతున్నాయి.

By:  Satya P   |   10 Nov 2026 9:20 AM IST
ఓటరు కార్డు సర్వాధారం....హక్కు చోరీ అంటున్న విపక్షం !
X

ఓటర్ కార్డు గురించి ఈ దేశంలో పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఎన్నికల వేళ మాత్రమే ఆలోచిస్తారు. అది కూడా పెద్ద నగరాలలో డబ్బున్న కాలనీలలో ఓటరు కార్డు గురించి అంతగా ఫికర్ కారు. ఎందుకంటే దాని అవసరం ఓటు కోసమే కదా అనుకుంటారు. ఎటూ క్యూలో నిలబడి ఓటేయాలన్న ధ్యాస అయితే పోష్ ఏరియా జనాలకు ఉండదు, దాంతో ఓటర్ కార్డు సంగతే పట్టించుకోరు. కానీ ఇపుడు చూస్తే ఓటరు కార్డు సర్వాధారం అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఆ దిశగా సాగుతున్నాయని అంటున్నారు. లేటెస్ట్ గా చూస్తే కేంద్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ ఒక సంచలన ప్రకటన చేఅశారు. ఇక మీదట ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారికే సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని ఆయన ఒక విధంగా బాంబు పేల్చారు అని అంటున్నారు.

అతి పెద్ద చర్చగా :

దీంతో ప్రస్తుతం దేశంలో ఇది అతి పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇపుడు దేశమంతా గగ్గోలు పెడుతున్నదే ఓటర్ చోరీ అన్న దాని మీద. ఉన్న ఓట్లను తొలగిస్తున్నారు అని విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇపుడు ఓటరు గుర్తింపు కార్డు అన్నింటికీ ఆధారం అంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలోనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి అయితే తన మంత్రిత్వ శాఖ పరిధిలోని సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించడానికి చెల్లింపుల ప్రక్రియ కోసం ఆధార్ కార్డుకు బదులుగా ఓటర్ ఐడీ బయోమెట్రిక్ ధ్రువీకరణను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. దీంతోనే రచ్చగా ఇది మారుతోంది.

ఈజీగా ఆధార్ కార్డు :

ఇక కేంద్ర మంత్రి అయితే ఆధార్ కార్డు ఈజీగా దొరుకుతోంది కాబట్టి దానిని బట్టి ప్రభుత్వ పధకాలు ఎలా ఇస్తామని అంటున్నారు. నకిలీ లబ్దిదారులు పెరిగిపోతున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నకిలీల బెడదను తట్టుకోవడానికే ఓటరు గుర్తింపు కార్డులను సంక్షేమ పధకాలకు తగిలించాలని ఆయన సూచిస్తున్నారు. అయితే తాను చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్ర మంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చింది. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ దీనిపై ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తాము ఆధార్‌ను పూర్తిగా తొలగించడం లేదని ప్రధాన మంత్రి వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన కింద శిక్షణ పొందే అభ్యర్థుల గుర్తింపు కోసం ఓటర్ ఐడీ బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ రెండింటినీ కలిపి ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలోని అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తీసేసి కేవలం ఓటర్ ఐడీనే విధిగా వాడాలనే ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదని అంటోంది.

సర్ తో ఓట్లు పోతున్నాయి :

సర్ ప్రక్రియతో దేశంలో కోట్లలోనే ఓట్లు పోతున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికి చూస్తే 13 కోట్ల మంది ఓటర్ల ఓట్లను సర్ ప్రక్రియ ద్వారా తొలగించారు అని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సహా ఇతర విపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నారు. అలా ఓటర్లను తగ్గించేసి ఓటర్ గుర్తింపు కార్డు ప్రమాణం అని చెప్పడం అంటే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించకుండా చేయడమే అని ఫైర్ అవుతున్నారు. ఇంతకాలం ఓటు చోరీ చేశారని ఇప్పుడు అర్హులైన పేదలు తమ హక్కులు పోతాయంటూ విపక్షాలు హక్కు చోరీ గా దీనిని అభివర్ణిస్తున్నారు. ఆధార్ కార్డులు ఈజీగా దొరుకుతున్నాయంటే అక్కడ జరిగే అవకతవకలను సరి చేయాలి కానీ ఓటరు కార్డు సర్వాధారం అని ఎలా చెబుతారు అని అంటున్నారు. సర్ ప్రక్రియతో ఇంత చేసినా అనర్హులకు ఓటర్ కార్డు లేదని చెప్పగలరా అని నిలదీస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల అసలైన వారే ఓటరు గుర్తింపు కార్డు లేకుండా పోయారని విపక్షాలు ఆగ్రహిస్తున్నాయి.