Begin typing your search above and press return to search.

'రూపాయి'పై మా జోక్యం లేదు: కేంద్రం

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇంధ‌న సంక్షోభం ఏర్ప‌డి.. త‌ద్వారా.. అమెరికా డాల‌ర్ బ‌ల‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే.

By:  Garuda Media   |   24 May 2026 9:43 AM IST
రూపాయిపై మా జోక్యం లేదు: కేంద్రం
X

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇంధ‌న సంక్షోభం ఏర్ప‌డి.. త‌ద్వారా.. అమెరికా డాల‌ర్ బ‌ల‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఈ క్ర‌మంలో భారత క‌రెన్సీ రూపాయి విలువ రోజు రోజుకు ప‌డిపోతోంది. గ‌త నెల‌లో డాల‌రుకు 86 రూపాయ‌లుగా ఉన్న మార‌కం విలువ‌.. ప్ర‌స్తుతం 96 రూపాయ‌ల‌కు చేరింది. అంటే.. కేవ‌లం 25 రోజుల్లోనే 10 రూపాయ‌ల మేర‌కు త‌గ్గిపోయింది. ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా అన్ని ధ‌ర‌లు పెరుగుతున్నాయి. మ‌రోవైపు.. ద్ర‌వ్యోబ్బ‌ణ భ‌యాలు కూడా పెరుగుతున్నాయి. ఈ స‌మ‌యంలో కేంద్రంవైపే అంద‌రూ ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

అయితే.. ఈ విష‌యంలో కేంద్రం త‌మ జోక్యం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. రూపాయి విలువ పెర‌గ‌డం, త‌గ్గ‌డం విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకోద‌ని.. ఇది అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్ర‌క‌టించారు. రూపాయి మార‌కం విలువ ఒడిదుడుకుల‌కు లోనైన విష‌యంపై కేంద్రం కూడా ప‌రిశీలిస్తోంద‌ని.. కానీ, దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం కేంద్రానికి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇది అంత‌ర్జాతీయ అంశాల‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు. ఇటీవ‌ల రూపాయి క్షీణించినా.. గ‌త రెండు రోజులుగా కొంత మేర‌కు పుంజుకుంద‌న్నారు.

ఆ రెండు అంశాల‌కే ప‌రిమితం..

కాగా.. ఆర్థిక విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ జోక్యం ప‌రిమితం(మినిమ‌ల్‌)గా ఉంటుంద‌ని పీయూష్ గోయెల్ తెలిపారు. ఎగుమ తులు, దిగుమ‌తుల ఆధారంగానే ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌న్నారు. ఈ క్ర‌మంలో దిగుమ‌తులు త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌జ‌లు స్వ‌దేశీ ఉత్ప‌త్తులు వినియోగించుకోవ‌డం.. పెట్రోలు, ఇంధ‌న వినియోగాన్ని త‌గ్గించ‌డం ద్వారా దిగుమ‌తుల‌పై నియంత్ర‌ణ ఉంటుంద‌న్నారు. ఇక‌, ఎగుమ‌తుల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌త్యేక ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చామ‌న్నారు. త‌ద్వారా.. విదేశీ మార‌క ద్ర‌వ్యం పెరుగుతుంద‌న్నారు.

ఎప్ప‌టికి కుదుట‌?

ప్ర‌స్తుతం రూపాయి విలువ రోజుకో ర‌కంగా మారుతోంది. మ‌రి ఇది ఎప్ప‌టికి కుదుట ప‌డుతుంద‌న్న చ‌ర్చ వ్యాపార‌, పారిశ్రామిక వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. దేశంలో బంగారం కొనుగోలు నిలిపివేయాల‌ని.. పెట్రోలు ఉత్ప‌త్తుల వినియోగాన్ని త‌గ్గించాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చినా.. ఆ మేర‌కు ఫ‌లితాలు క‌నిపించ‌డం లేద‌ని వ్యాపారులు చెబుతున్నారు. దీనివ‌ల్ల బంగారం దిగుమ‌తి, పెట్రోల్ ఉత్ప‌త్తుల దిగుమ‌తి త‌గ్గ‌డం లేద‌ని.. ఫ‌లితంగా మార‌కం విలువ మ‌రింత కుదేల‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో స్టాక్స్ లో మ‌దుప‌రులు పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకోవ‌డం కూడా.. రూపాయి విలువ‌పై ప్ర‌భావం చూపుతోంద‌ని చెబుతున్నారు.